కోనసీమలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్ష
అట్రాసిటీ చట్టాల అమలులో అధికారులు విఫలం
ఆర్డీవో, డీఎస్పీలపై కమిషన్ చైర్మన్ శివాజీ ఆగ్రహం
అమలాపురం : ‘ఒక ఎస్సీ ఎంపీ.. ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న కోనసీమలో ఎస్సీ, ఎస్టీ చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం బాధాకరం. కోనసీమలో నేటికీ కులవివక్ష కొనసాగుతోంది. చట్టాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అధికారుల గైర్హాజరుపై అసహనం
ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయం నుంచి సమాచారం పంపినా పలుశాఖల అధికారులు హాజరు కాకపోవడంపై శివాజీ అసహనం వ్యక్తం చేశారు. ఆర్డీఓ గణేష్‌కుమార్ వివరణపై పెదవి విరిచారు. సమావేశంలో భాగంగా డివిజన్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కారమైనవెన్ని, ఎంతమందికి ఇళ్ల స్థలాలిచ్చారు వంటి అంశాలను ఆరా తీశారు. అమలాపురం మన్నా కాలనీలో రహదారి సమస్యపైనా, రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఎస్సీ కుటుంబం సాంఘిక బహిష్కారం తదితర సమస్యల ప్రగతిపైనా, వివిధ శాఖల్లో పెండింగ్ సమస్యలపై ఆయన ప్రశ్నించారు.
ఆర్డీవో., డీఎస్పీలపై ఆగ్రహం
అట్రాసిటీ కేసుల్లో పురోగతి లేకపోవడంపై ఆర్డీవో గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, అమలాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌లపై శివాజీ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ అధికారులను సస్పెండ్ చేయిస్తా అంటూ హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌ను మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల హక్కులపై మీకు క్లారిటీ లేదన్నారు. ఫిర్యాదులపై మీరు స్పందిస్తారా లేదా కమిషనే స్వయంగా పరిష్కరించే ఏర్పాటు చేయమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలు తమ సమస్యలపై శివాజీకి వినతిపత్రాలు సమర్పించారు.