పదేళ్లకే ఇంటర్ పరీక్షలు
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ బాలుడు
హైదరాబాద్: అతిచిన్న వయసులోనే ఇంటర్ పరీక్షలు రాసి అగస్త్య జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్ కాచిగూడకి చెందిన పదేళ్ల అగస్త్య బుధవారం నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. గతేడాది అతిచిన్న వయసులోనే పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన బాలుడిగా అగస్త్య రికార్డు సృష్టించాడు.
యూసుఫ్‌గూడలో సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ సీఈసీ చదువుతున్న అగస్త్య.. బుధవారం జూబ్లీహిల్స్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఇంటర్ పరీక్షలు రాశాడు. అగస్త్య రెండేళ్ల వయసులోనే 300 పైగా ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడు. ప్రస్తుతం 3,000 పైగా ప్రశ్నలకు జవాబులు చెబుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు అగస్త్య అక్క, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 15 ఏళ్లకే పీజీ పరీక్షలు రాసి రికార్డు సృష్టించారు.