ట్రంప్‌పై యుద్ధానికి ట్విట్టర్ సై
శాన్ ఫ్రాన్సిస్కో: వివాదాస్పద నిర్ణయాలతో సంచలనంగా మారి విమర్శలు పాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా టెక్ దిగ్గజాలు వరుసగా రంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా ఏడు ముస్లిందేశాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై తమ పోరును ఎక్కుపెట్టాయి. తాజాగా ట్విట్టర్ కూడా ట్రంప్ పై యుద్ధానికి సై అంటోంది. ప్రముఖ హక్కుల సంస్థ చేపట్టిన ఆన్ లైన్ క్యాంపెయిన్ లో ట్విట్టర్ ఉద్యోగులు ,ట్విట్టర్ సీవీఓ జాక్ డోర్సే , ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఒమిడ్ కొర్ దేస్తానీ స్పందించారు . ఈ మేరకు గత కొన్ని రోజులుగా విరాళాల సేకరణ లో భాగంగా, ఉద్యోగులు, ట్విట్టర్ సీఈవో, ఈడీ ద్వారా మొత్తం 1.5 మిలియన్ డాలర్లను సేకరించి ఇచ్చారు. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు 53వేల డాలర్లను సేకరించారు. మొత్తం 1.59 మిలియన్ డాలర్ల విరాళాన్ని సేకరించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారంలో సూచించింది.
మానవత, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావాన్ని పడవేయనున్న ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలపై డోర్సే విచారం వ్యక్తం చేశారు. పౌర స్వేచ్ఛకు ఆటంకానికి వ్యతిరేకంగా అందరూ దృఢంగా నిలబడాలని ట్విట్టర్ జనరల్ కౌన్సెల్ విజయ గద్దే మేమో పేర్కొన్నారు. స్వేచ్ఛను రక్షించడానికి తమ వంతు పని పూర్తి చేశామని, వచ్చే నెలల్లో న్యాయపరంగా తమ పోరాటాన్ని సాగించనున్నట్టు చెప్పారు.
ఏడు ముస్లిం దేశాలలో నుండి వచ్చే శరణార్థులు మరియు వలసదారుపై ట్రంప్ తాత్కాలిక నిషేధంపై పోరాటంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యే) ఆన్లైన్ క్యాంపెన్ చేపట్టింది. దీని ద్వారా మొత్తం విరాళాల సంఖ్య సుమారు 24 మిలియన్ (సుమారు రూ.161 కోట్లు) డాలర్లకు చేసింది.
దేశాన్ని సురక్షితంగా ఉంచాలి... అదే సందర్భంలో దేశానికి ప్రమాదంగా పరిణమిస్తున్న అసలైన శక్తులపై దృష్టిపెట్టాలంటూ ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల కూడా ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై ప్రతికూలంగా స్పందించారు. అలాగే మైక్రోసాఫ్ట్ ట్రంప్ పై ఫెడరల్ కోర్టుపై దావా కూడా వేసింది. యాపిల్, నెట్ ఫ్లిక్స్, తెస్లా, ఉబెర్ లు కూడా ఇదే బాటలో పయనించాయి. మరోవైపు అధ్యక్ష పదవిని చేపట్టిన వారం వ్యవధిలోనే విధానాలపై ప్రపంచ దేశాలతోపాటు అమెరికాలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే..