ఎర్రడబ్బాకు కొత్త రూపం!
ఎర్రడబ్బా రూపం మారుతోంది. ఇన్నాళ్లబట్టి ఇనుముతో రూపొందించిన పోస్టు బాక్సులు ఎప్పటికప్పుడు తుప్పుపట్టి, పాడైపోవడం, దాంతో వాటిలో లెటర్లు వేయడానికి జనం భయపడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యకు పోస్టల్ శాఖ ఓ పరిష్కారం కనుగొంది. సరికొత్త విధానంలో పోస్టుబాక్సులను రూపొందించింది. త్వరలోనే ఇవన్నీ రోడ్ల మీద దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే వరంగల్ పోస్టాఫీసుకు ఇలాంటిది ఓ బాక్సు చేరుకుంది. తుప్పు పట్టడానికి ఏమాత్రం ఆస్కారం లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో వీటిని రూపొందించారు.
నగరాల్లో అయితే మొబైల్ ఫోన్లు, ఈమెయిళ్లతోనే సమాచారం పంపుకొంటున్నా, ఇప్పటికీ గ్రామాల్లో మాత్రం ఎర్రడబ్బాలకు ఆదరణ తగ్గలేదు. అలాగే వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా కూడా పోస్టుబాక్సులను ఆశ్రయించాల్సిందే. కొన్ని స్కాలర్షిప్పులకు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా పోస్టులో పంపాల్సిందే. చాలావరకు కొరియర్ సర్వీసుల కన్నా కూడా స్పీడ్ పోస్టు వేగంగా వెళ్తుందని, ఖర్చు కూడా తక్కువని భావిస్తున్నారు. అందుకే ఈ సరికొత్త పోస్టు బాక్సుతో మరింత ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.