బీరు బాబులకోసం ఓ యాప్
లండన్ : మండే ఎండలకి చల్లని బీరు తో చెక్ చెప్పాలనుకునే మందుబాబులకు శుభవార్త. మీరు తాగే బీర్ ఎంత ఫ్రెష్ దో, లేదా ఎంత పాతదో కనిపెట్టేసే స్మార్ట్ పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. అవును... ఇక కాలం చెల్లిన బీరు కారణంగా పార్టీ పాడవుతుందేమో నని బెంగపడొద్దంటూ పరిశోధకులు మద్యం ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అందించారు. బీర్ తాజాదనాన్ని పట్టిచ్చే ఒక సరికొత్త యాప్ ను మాడ్రిడ్ కంప్లుటెన్స్ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ యాప్ లోని పాలీమర్ సెన్సర్ ద్వారా బీర్ లోని తాజాదనం కొలిచేందుకు అనుమతించే ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు.
స్మార్ట్ ఫోన్ లోని ఈ యాప్ ద్వారా అతి సులువుగా, చవకగా బీర్ నాణ్యతను కొలిచే యాప్ ను ఎలీనా బెంటిటో, పెనామారియా క్రజ్ అనే పరిశోధకులు డెవలప్ చేశారు.ఇప్పటివరకూ బ్రెవరేజ్ కంపెనీలు క్రొమటోగ్రఫీ పద్ధతుల ఆధారంగా ఫర్ ఫ్యూరల్ ( బీర్ లో కలిపే ఒక రకమైన కృత్రిమ, రంగులేని ద్రవం) ఇతర తాజాదనం సూచికలను కొలిచే వారన్నారు. కానీ వారు ఉపయోగించే ఈ పద్ధతి చాలా ఖరీదుతో కూడుకున్నదని, ఎక్కువ సమయం కూడా తీసుకుంటుందని తెలిపారు. అయితే తమ కొత్త యాప్ లోని సెన్సర్ ద్వారా బీర్ ఫర్ ఫ్యూరల్ శాతం, ఇతర నాణ్యతలను చాలా ఈజీగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. పాత బీరును పరీక్షించినపుడు, పసుపురంగు నుంచి పింక్ రంగుకు మారేలా ఈ సెన్సర్ డిస్క్ ను డిజైన్ చేశామని, దీని ద్వారా డాటాను స్వీకరించి, తద్వారా బీర్ తాజాదనాన్ని కొలవచ్చని పేర్కొన్నారు. కాంటాక్ట్ లెన్స్ లను తయారుచేయడానికి ఉపయోగించే పాలిమర్ నుంచి ఈ సెన్పర్లు తయారు చేసినట్టు తెలిపారు. ఈ డేటా అప్లికేషన్ ఓపెన్ సోర్స్ లో అందుబాటులో ఉందని, ఏ ప్రోగ్రామర్ అయినా దీన్ని తమకనుగుణంగా సవరించుకొని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ అప్లికేషన్ ఇపుడు అందుబాటులో ఉందని, త్వరలో ఆపిల్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎనలిటికల్ కెమిస్ట్రీ జర్నల్ ఇది ఈ పరిశోధన ప్రచురితమైంది.