ఇందిర, రాజీవ్ స్టాంపులు ఔట్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల ముఖచిత్రాలతో కూడిన స్టాంపుల ముద్రణను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఆధునిక భారత నిర్మాతల’ పేరుతో ఇప్పటివరకు వీరిద్దరి స్టాంపులు రోజువారీ వినియోగానికి అందుబాటులో ఉండేవి. అయితే విధానపరమైన మార్పును తెస్తూ... ‘భారత నిర్మాతలు’ థీమ్‌తో పలువురు ప్రముఖుల పేరిట నిత్యవినియోగానికి స్టాంపులను ముద్రించనున్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ, మౌలానా ఆజాద్, భగత్‌సింగ్, జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా, వివేకానంద, మహరాణా ప్రతాప్...
తదితరుల ముఖచిత్రాలతో స్టాంపులు మరో నెలరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖుల గౌరవార్థం స్మారక తపాలా బిళ్లలను విడుదల చేసే విధానం అమలులో ఉంది. ఇలాంటివి పరిమిత సంఖ్యలోనే ముద్రిస్తారు. అలాకాకుండా ప్రముఖులందరి ముఖచిత్రాలతో కూడిన స్టాంపులను నిత్యవినియోగానికి అందుబాటులోకి తేవాలని కేంద్ర కమ్యుని కేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తపాలా శాఖను ఇదివరకే ఆదేశించారు.
ఇందిర, రాజీవ్‌లతో పాటు హోమీ జే భాభా, జేఆర్డీ టాటా, సీవీ రామన్, సత్యజిత్ రేల స్టాంపుల ముద్రణను కూడా నిలిపివేశారు. అయితే మహాత్మాగాంధీ, జవహర్ లాల్‌నెహ్రూ, బి.ఆర్.అంబేడ్కర్, మదర్ థెరిసాల ముఖచిత్రాలతో కూడిన స్టాంపులను ఇదివరకటిలాగే కొనసాగిస్తారు. ఇందిర, రాజీవ్‌ల స్టాంపులను నిలిపేయాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మోదీ సర్కారు ఇంకా ఎంతకు దిగజారుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇద్దరు ప్రధానుల జ్ఞాపకాలను తుడిచిపెట్టే ప్రయత్నంలో మోదీ సర్కారు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.