పెట్టుబడులపై పరిమితులు ఎత్తివేయాలి
- అప్పుడే ఇతర దేశాలతో పోటీపడటం సాధ్యం
- ప్రభుత్వానికి నిపుణుల ప్యానెల్ నివేదిక
న్యూఢిల్లీ: ఆర్థిక రంగంలో అంతర్జాతీయంగా ఇతర దేశాలతో పోటీపడాలంటే భారత్ పెట్టుబడులపై పరిమితులను క్రమంగా ఎత్తివేయాలని స్టాండింగ్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సిఫార్సు చేసింది. అలాగే , నియంత్రణ.. పన్నుల వ్యవస్థలను మెరుగుపర్చాలని పేర్కొంది. అంతర్జాతీయంగా భారతీయ ఆర్థిక రంగం పోటీపడే సత్తాను అధ్యయనం చేసి, తగు పరిష్కార మార్గాలు సూచించేందుకు 2013 జూన్‌లో ఆర్థిక శాఖ ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇది తాజాగా తొలి నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించింది. ఈ నివేదికపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 6 దాకా ఆర్థిక శాఖకు తమ అభిప్రాయాలు పంపవచ్చు.
ఇతర దేశాలతో పోటీపడాలంటే ప్రధానంగా పెట్టుబడులపై పరిమితులను క్రమబద్ధీకరించి.. క్రమంగా తొలగించాలని, సాంకేతికంగా పటిష్టమైన ఆర్థిక నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని, స్థానికత ఆధారంగా పన్నుల విధించే విధానానికి మళ్లాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ఇందులో భాగంగా సంస్కరణల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కమిటీ సూచించింది. అలాగే, వీటి అమలు బాధ్యతలను కూడా స్పష్టంగా నిర్దిష్ట విభాగాలకు అప్పగించాలని పేర్కొంది. భారతీయ అసెట్స్‌పై ఆధారిత ఆర్థిక లావాదేవీలు విదేశాల్లో గణనీయంగా జరుగుతున్నాయని కమిటీ వివరించింది. రూపాయి డెరివేటివ్స్, మార్కెట్స్ సూచీ నిఫ్టీలో ట్రేడింగ్ భారీ స్థాయిలో దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర రోజువారీ టర్నోవరు ఉంటోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పుష్కలంగా వనరులున్న భారత్‌కు .. మార్కెట్లో ఆధిపత్యం కోసం కృషి చేయాలని కమిటీ అభిప్రాయపడింది.