మా టీవీ.. స్టార్ చేతికి
స్టార్ ఇండియా గ్రూప్‌లోకి మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా
⇒ మా టీవీలో వాటాలు విక్రయించిన నిమ్మగడ్డ, చిరంజీవి, నాగార్జున
⇒ మొత్తం 100 శాతం బ్రాడ్‌కాస్టింగ్ అసెట్స్ స్టార్ ఇండియాకి విక్రయం
⇒ ఒప్పందం విలువ చెప్పడానికి నిరాకరించిన ప్రమోటర్లు
⇒ డీల్ విలువ రూ. 2,500 కోట్లు ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మా టీవీకి చెందిన నాలుగు తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్‌ను స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా చానల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపక్ మర్డోక్‌కు చెందిన స్టార్ ఇండియా గ్రూపు ప్రకటించింది. ఈ స్టార్ ఇండియా గ్రూప్ నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు సబ్సిడరీ సంస్థ. రూ. 2,000 కోట్ల టర్నోవర్‌తో మార్కెట్ పరిమాణం పరంగా దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ప్రవేశించడంపై స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు వినోదచానల్స్ రంగంలో మా టీవీ 27 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉందన్నారు. కానీ మా ప్రమోటర్లతో చేసుకున్న కొనుగోలు ఒప్పందం విలువను చెప్పడానికి మాత్రం నిరాకరించారు. అయితే పరిశ్రమవర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందం విలువ రూ. 2,500 కోట్లు ఉండొచ్చని అంచనా. మా టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసిద్ధ ఇన్వెస్టరు నిమ్మగడ్డ ప్రసాద్‌కు 65 శాతం, సినీనటులు చిరంజీవి కుటుంబానికి 20 శాతం, నాగార్జున కుటుంబానికి 10 శాతం వాటా ఉంది. మిగిలిన 5 శాతం వాటాను చిన్న ఇన్వెస్టర్లు కలిగి ఉన్నారు.
ఈ ముగ్గురు ప్రధాన ప్రమోటర్లు ఇప్పటి వరకు మా టీవీలో సుమారు రూ. 100 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. ఈ ఒప్పందం వివరాలను తెలియచేయడానికి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ మా టీవీ కొనుగోలుతో తాము దక్షిణాదిలో అన్ని భాషల్లోకి ప్రవేశించనట్లయ్యిందని అన్నారు. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఇప్పటికే స్టార్ గ్రూపు ఉన్న విషయం విదితమే. ఈ ఒప్పందానికి ఇంకా నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉందని, రెండు మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
మంచి విలువ రాబట్టే...
తమ హోల్డింగ్ కంపెనీ మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన ‘మా’ బ్రాండు చానళ్లను, బ్రాడ్ కాస్టింగ్ అసెట్స్‌ను స్టార్ ఇండియాకి విక్రయించాలని బోర్డు నిర్ణయించిందని, మా టీవీ టెలివిజన్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ మాత్రం తమ వద్దే ఉంటుందని మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. గత ఏడేళ్ళుగా పడ్డ శ్రమకు విలువ లభించిందని, మంచి విలువ రావడంతో వాటాలను విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాము మా టీవీని కొనుగోలు చేసినప్పుడు 125 మంది ఉద్యోగులు ఉండే వారని, ఇప్పుడు వారి సంఖ్య 500 దాటిందన్నారు. ప్రస్తుతం మా టీవీ రూ. 350 కోట్ల ఆదాయంపై రూ. 50 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా శంకర్ తెలిపారు. మీడియా సమావేశంలో సినీనటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్‌లు కూడా పాల్గొన్నారు.
’మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొనసాగుతుంది..
ఈ వాటాల విక్రయం జరిగినా నాగార్జున సేవలను ‘మా’ టీవీకి వినియోగించుకుంటామని స్టార్ గ్రూపు ప్రకటించింది. నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు... ఈ కార్యక్రమం కొనసాగించడమే కాకుండా భవిష్యత్తులో కూడా అతని సేవలను వినియోగించుకుంటామని ఉదయ్ శంకర్ చెప్పారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్‌లో గతేడాది 52 వారాల్లో మా టీవీ 45 వారాలు తొలి స్థానంలో ఉండటమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఎంటర్టైన్మెంట్ చానల్స్‌లో 16వ స్థానంలో ఉందన్నారు.
మా టీవీ కొనుగోలు ఒప్పంద వివరాలను వెల్లడిస్తున్న స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్, మా టెలివిజన్ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్. పక్కన చిరంజీవి, నాగార్జున, అరవింద్‌లు