Star Wars Movie
-
రెజ్లింగ్ పాటకు మొసలి హుషారు
90వ దశకంలో టీవీల్లో వచ్చే రెజ్లింగ్ క్రీడకు భారతీయ టీనేజర్లలో క్రేజీ అంతాఇంతా కాదు. అలాంటి క్రేజ్ ఇప్పుడు భారత్‌లో తగ్గిపోయినా అమెరికా తదితర దేశాల్లో ఇంకా ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) అభిమానులకు ఒక మొసలి సైతం జతకలిసింది. స్టార్‌వార్స్ ప్రఖ్యాత థీమ్సాంగ్ అయిన ‘ది ఇంపీరియల్ మార్చ్’ పాట వినబడగానే ఈ మొసలి హుషారుగా కదలివస్తోంది. గంటలతరబడి కదలకుండా ఉండగలిగే మొసలిలో సైతం మా సాంగ్ కదలిక తెప్పిస్తోందని, మెప్పిస్తోందంటూ పలువురు రెజ్లింగ్ అభిమానులు సంబంధిత వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్గ్లేడ్స్ హాలిడే పార్క్‌లో డార్త్ గేటర్ అనే మొసలి ఉంది. ఇది ఈ పాట వినగానే చేస్తున్న హంగామా చూసి గేటర్బాయ్స్ టీవీషో స్టార్ పౌల్ బేడార్ట్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. స్వయంగా మొసలి సమీపానికి వెళ్లి మాంసం ముక్కలను పట్టుకుని థీమ్‌సాంగ్‌ను ప్లే చేయడం, మొసలి వచ్చి హుషారుగా ముక్కలను లటుక్కున మింగేయడం వీడియోలో రికార్డయింది. దీనిని ఇప్పుడు లక్షలాది మంది లైక్‌లు, షేర్లు కొడుతున్నారు. – న్యూయార్క్ -
రెండు మిస్సైల్స్ ఢీకొట్టుకోవడం చూశారా..
సాక్షి, న్యూఢిల్లీ : స్టార్ వార్స్ మూవీ చూశారా.. అందులో ఓ మిసైల్‌ను మరో మిసైల్ ఢీకొట్టుకుంటుంటాయి. ఆ సమయంలో మనకు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. అచ్చం అలాంటి సీనే సినిమాలో కాకుండా నిజజీవితంలో దర్శనం ఇస్తే.. అవును అదెక్కడో కాదు.. మన దేశంలోనే చోటు చేసుకుంది. గురువారం నిర్వహించిన శత్రు క్షిపణిని ఢీకొట్టే పరీక్ష విజయవంతమైంది. పై నుంచి వచ్చే శత్రు క్షిపణిని మరో క్షిపణితో కిందనున్న రాడార్ల సాయంతో సరాసరిగా ఢీకొట్టించారు. దానికి సంబంధించిన ఫుటేజీ ఇప్పుడు బయటకు వచ్చింది. సాధారణంగా పాకిస్థాన్ మద్యంతర శ్రేణి క్షిపణులను ఎక్కువగా పరీక్షిస్తుంటుంది. వీటితో భారత్‌పై దాడి చేయాలని దాని వ్యూహం. అయితే, వాటిని నేరుగా ఢీకొట్టే లక్షిత క్షిపణులు ఇప్పటి వరకు భారత ఆర్మీ వద్ద లేవు. దీంతో తాజాగా తొలుత ఓ క్షిపణిని ప్రయోగించి దానిని మరో బాలిస్టిక్ క్షిపణితో విజయవంతంగా ఢీకొట్టించారు. గురువారం ఉదయం 9.45నిమిషాలకు ఇది పూర్తి చేశారు. కింద ఉండే రాడార్లు సిగ్నల్ ఇవ్వడం ద్వారా శత్రు క్షిపణిపైకి దూసుకెళ్లే క్షిపణి తనను తాను యాక్టివేట్ చేసుకొని నేరుగా ఓ బుల్లెట్‌ను మరో బుల్లెట్ ఢీకొట్టినట్లుగా ఢీకొడుతుంది. ఇది తొమ్మిదో పరీక్ష. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పాక్ నుంచి వచ్చే ఎలాంటి క్షిపణినైనా భారత్ మధ్యలోనే నిలువరించగలుగుతుంది. -
రాహుల్ గాంధీ సినిమా.. శోభనం రాత్రి!!
సాక్షి, న్యూఢిల్లీ : నోరుజారడం అలవాటుగా చేసుకున్న రాజకీయ నేతల జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ టాప్ లిస్ట్‌లో ఉంటారు. ఆయన చేసేది సద్విమర్శే అయినా ఉపయోగించే పదాలు విపరీత అర్థాలకు దారి తీస్తాయి. తాజాగా రాహుల్ గాంధీని సమర్థిస్తూ.. అదే సమయంలో బీజేపీని విమర్శిస్తూ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నేతలు శోభనాన్ని వద్దనుకుంటారా? : ‘‘ఒక రాజకీయ నాయకుడి శోభనం రాత్రికి ముహుర్తం కుదురుతుంది.. సరిగ్గా అదే రోజు ఏ ఎన్నికల ఫలితాలో వెలువడ్డాయనుకోండి.. ఆ నేత ఫస్ట్‌నైట్‌ను రద్దు చేసుకుంటాడా? బీజేపీ సంకుచితంగా ఆలోచిస్తోంది. రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయాలపై వారు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని నరేశ్ అగర్వాల్ అన్నారు. రాహుల్ గాంధీ సినిమా ఏంటంటే..! : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ మాల్లో ‘స్టార్ వార్స్’ సినిమా చూశారట! అంతే, బీజేపీ నేతలు తమ నోటికి పనిచెప్పారు. ‘‘పార్టీ ఓటమిభారంతో కుమిలిపోతుంటే, నాయకుడు(రాహుల్) మాత్రం సినిమా చూసి ఆనందించారు’’ అని వ్యాఖ్యలు చేశారు. కాగా, రాహుల్ వ్యక్తిగత జీవితంపై బీజేపీ నేతలు టార్గెట్ చేయడాన్ని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ తప్పుపట్టారు. బీజేపీ ఒక సంకుచిత పార్టీ అని విమర్శించారు. కానీ రాహుల్ సినిమా వీక్షణను శోభనం రాత్రితో పోల్చి అభాసుపాలయ్యారు. -
ఏలియన్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
సాక్షి : టీవీ షోల్లో, సినిమాల్లో ఏలియన్ల ప్రస్తావన వచ్చినప్పుడు జనాలు ఆసక్తిగా గమనించటం పరిపాటే. గ్రహాంతరవాసులు ఉనికి కోసం ఓవైపు అగ్రదేశాలు పోటాపోటీ పరిశోధనలు నిర్వహిస్తున్న వేళ ఓ గ్లోబల్ సర్వే ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఏలియన్లు ఉన్నాయన్న సంగతి పక్కనపెడితే.. వాటి ఉనికిని బలంగా నమ్మే ప్రజల శాతం చాలా ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాదు మన ఆధునీకరణకు వాటి అవసరం చాలా ఉంటుందని పేర్కొంటూ అన్వేషణ కోసం చేసే ప్రయత్నాలను కూడా వీళ్లు సమర్థించటం గమనార్హం. మొత్తం 24 దేశాల్లో.. 15 భాషల్లో ఈ సర్వే కొనసాగగా.. ది లాస్ట్ జెడి ఈవెంట్లో దీనిని ప్రచురించారు. స్టార్ వార్స్ చిత్రాలో 8వ సిరీస్ గా ది లాస్ట్ జెడి వచ్చే వారం విడుదల కానున్న విషయం తెలిసిందే. మొత్తం 26,000 మందిపై ఈ సర్వే నిర్వహించగా.. 47 శాతం గ్రహాంతరవాసులు ఉన్నాయనే నమ్ముతున్నామని చెప్పారు. అందుకు కొన్ని ఘటనలకు వీరు సాక్ష్యాలుగా చూపారు కూడా. భూమ్మీద అయితే మనుషులు ఎలా ఉన్నారో.. ఇతర గ్రహాలపై కూడా ప్రాణులు ఉండి తీరతాయని 61 శాతం మంది తమ వాదన వినిపించారు. మిగిలిన వారు మాత్రం అదంతా హుళక్కేనని కొట్టి పారేశారు. ఇక ఏలియన్లు ఉన్నాయని ఎక్కువగా నమ్మేవారిలో రష్యన్ల సంఖ్య అధికంగా ఉండగా.. మెక్సికో, చైనా, నెదర్లాండ్ ప్రజలు తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
20 నిమిషాలు ఆలోచించి.. ఫైన్ వేశారు!
-
20 నిమిషాలు ఆలోచించి.. ఫైన్ వేశారు!
కాన్ బెర్రా: ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న 'స్టార్ వార్స్' మూవీ అభిమాని ఉత్సాహం అతనికే ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పోలీసులతో మాటలు పడటంతో పాటు చివరికి జరిమానా కట్టాల్సి వచ్చింది. కోలండ్రా సమీపంలోని సన్‌షైన్ తీరంలో ఈ ఘటన జరిగింది. స్టార్ వార్స్ సెవెన్త్ సిరీస్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. స్టార్ వార్స్ మూవీ చూడటానికి బుధవారం రాత్రి 11 గంటలకు క్వీన్స్‌లాండ్స్‌కు చెందిన మైఖేల్ కీలే ఫుల్ జోష్ మీద బైకుపై వెళ్తున్నాడు. అయితే, ఆ అభిమాని సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిదూరం వెళ్లాక పోలీసులు ఆ యువకుడిని ఆపేశారు. ఎందుకు ఆపేశారో అతనికి అర్థం కాలేదు. బైక్‌పై మూవీకి బయలుదేరేటప్పుడు లైట్ సాబెర్ స్టిక్ ని వెంట తీసుకెళ్లాడు. బైక్ నడుపుతూ మైకెల్ ఓ చేతిలో లైట్ సాబెర్ స్టిక్ పట్టుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బైక్ నడిపిన వ్యక్తికి ఫైన్ వేయాలా వద్దా అని పోలీసులు ఏకంగా 20 నిమిషాల పాటు ఆలోచించారు. ట్రాఫిక్ రూల్స్‌లో ఆ విషయంపై జరిమానాకు సంబంధించి వివరాలు లేవు. చివరికి ఆ యువకుడికి భారత కరెన్సీలో రూ.18,196 ఫైన్ వేశారు. పోలీసుల వ్యవహారంతో మైఖేల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. చేతిలో వెలిగే లైట్ స్టిక్ కానీ, లేదా అనధికారికంగా ఏ ఇతర వస్తువులు తీసుకెళ్లినా ఫైన్ వేసే అధికారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లైట్ సాబెర్ స్టిక్ ఆన్ చేసి బైకుపై వెళ్తూ వీడియో తీయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ తెలియని పోలీసులు, రూల్స్‌లో లేకున్నప్పటికీ తనకు జరిమానా విధించారని బైకిస్ట్ ఆరోపించాడు. ఆ సమయంలో కేవలం ఒక్క కారు మాత్రమే రోడ్డుపై వెళ్తోందని పేర్కొన్నాడు. ఫైన్ విషయాన్ని టిక్కెట్టుపై కూడా రాశారు. దీంతో ఈ వివరాలను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. -
స్టార్‌వార్స్ కల.. ఇలపై ఇలా..!
‘స్టార్‌వార్స్.. ద ఫోర్స్ అవేకన్స్’ విడుదలైంది! బాక్సాఫీస్ కలెక్షన్లలో మరోసారి రికార్డులు సృష్టిస్తోంది కూడా! సుదూర పాలపుంతలు, నక్షత్ర మండలాలు, కృష్ణబిలాలు.. కనీవినీ ఎరుగని ఆయుధాలు, వాహనాలు.. చిత్ర విచిత్ర ఆకారాల్లో గ్రహాంతర వాసులు.. ఇవీ స్టార్‌వార్స్ బలం, బలగం.. సమస్తం! ఈ సినిమా కథ కల్పనే! కానీ.. ఇది 21వ శతాబ్దం! కల్పనకు.. వాస్తవానికీ మధ్య అంతరం తొలగిపోతున్న రోజులివి.. ఈ హాలీవుడ్ చిత్రరాజంలోని టెక్నాలజీలూ దీనికి భిన్నమేమీ కాదు! ఎలాగంటే.. సాక్షి, హైదరాబాద్: హాలీవుడ్ డెరైక్టర్ జార్జ్ లూకాస్ రూపొందించిన తొలి స్టార్‌వార్స్ సినిమా 1977లో విడుదలైంది. వందల వేల గ్రహాలు.. వాటిమధ్య వ్యాపార సంబంధాలు.. కుట్రలు, కుయుక్తులు.. చెడుపై మంచి (ఫోర్స్) చేసే యుద్ధం.. విఠలాచార్య సినిమా హీరోలను తలపించే జెడీయోధులు... ఇదీ స్టార్‌వార్స్ చిత్ర ఇతివృత్తం. గ్రహాలన్నింటి పాలన కోసం ఏర్పడ్డ జెడీ కౌన్సిల్ మంచివైపునుంటే.. రాజ్యకాంక్షతో రగిలిపోతూండే డెర్త్వాడర్ చెడువైపు ఉండే ఈ చిత్రంలో జెడీ యోధులు ‘ధర్మ’ పరిరక్షకులన్నమాట. గ్రహాల మధ్య ప్రయాణం మొదలుకొని.. లేజర్ కిరణాలతో యుద్ధాలు.. మనిషితో సమానమైన తెలివితేటలు ప్రదర్శించే రోబోలు.. ఈ చిత్రం తాలూకూ హైలైట్స్. కాల్పనిక జగత్తు ఇతివృత్తంగా సాగినా ఈ చిత్రంలోని అనేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. చిటికెలో గ్రహాంతరాళాలు దాటి.. స్టార్‌వార్స్‌లో హాన్సోలో అనే ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఎలుగుబంటికి అన్నయ్యలా ఉండే ఈ క్యారెక్టర్ ‘మిలినియం ఫాల్కన్’ అనే అంతరిక్ష నౌకలో గ్రహాలు చుట్టేస్తూ ఉంటుంది. కాంతికంటే వేగంతో ప్రయాణించే ఈరకమైన అంతరిక్షనౌక మనకు అందుబాటులో లేకపోవచ్చుగానీ.. శాస్త్రవేత్తలు ఈ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలో మాదిరిగా కాంతిని మించిన వేగంతో ప్రయాణించడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన స్పేస్ టైమ్ వంపు ఆసరగా గ్రహాంతర ప్రయాణం సాధ్యమేనని అంటున్నారు ఎరిక్ డేవిస్. ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్(ఆస్టిన్ టెక్సస్, అమెరికా)లో పనిచేస్తున్న ఈ శాస్త్రవేత్త అంచనా ప్రకారం.. ‘నెగటివ్ ఎనర్జీ’ని అందించే పదార్థాలను తయారు చేయగలిగితే.. వార్ప్డ్రైవ్, వర్మ్‌హోల్ వంటివి నిర్మించుకుని ఇతర గ్రహాలకు దగ్గరిదారిలో చేరుకోవచ్చు. అయితే ఇలాంటి టెక్నాలజీల అభివృద్ధికి మరో యాభై ఏళ్లు పట్టవచ్చు. ఎక్సో ప్లానెట్లు.. సౌర కుటుంబానికి అవతల ఏ గ్రహమూ లేదన్నది స్టార్‌వార్స్: ఏ న్యూ హోప్(మే 25 1977) విడుదలయ్యే సమయానికి ఉన్న అంచనా. చిత్రంలో మాత్రం లెక్కకు మిక్కిలి గ్రహాలు, అందులో జీవులు ఉంటాయి. అయితే 1992 నాటికి కల్పన కాస్తా వాస్తవమైంది. అలెగ్జాండర్ వూల్స్స్కాన్ అనే శాస్త్రవేత్త తొలి ఎక్సో ప్లానెట్ను గుర్తించారు. దానికి ‘51 పెగసీ బీ’ అని పేరుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇలాంటివి దాదాపు 2,000 గుర్తించినా.. వేటిలోనూ గ్రహాంతర జీవి మాత్రం కనపడలేదు. ఇంకో విషయం.. 2011లో కెప్లర్ టెలిస్కోప్ కెప్లర్-16బీ పేరుతో గుర్తించిన ఓ గ్రహానికి, స్టార్వార్స్కూ కొంత సాపత్యముంది. సినిమాలోని హీరో లూక్ స్కైవాకర్ ఉండే గ్రహం పేరు ‘టాటోయిన్’. మనకు సూర్యుడు ఒక్కడే నక్షత్రమైతే టాటోయిన్లో రెండు నక్షత్రాలుంటాయి. చిత్రంగా కెప్లర్-16బీ కూడా రెండు ప్రకాశవంతమైన నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది! స్పీడర్స్ వచ్చేశాయి.. రవాణా కోసం స్టార్‌వార్స్‌లో ఉపయోగించిన మరోరకం వాహనాలు స్పీడర్స్. ఒకరిద్దరు వెళ్లేందుకు వీలయ్యే ఈ రకమైన వాహనాలను ఇప్పటికే అనేక కంపెనీలు తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియాలోని ఏరోఫెక్స్ వీటిల్లో ఒకటి. ఏరో-ఎక్స్ పేరుతో ఈ కంపెనీ అభివృద్ధి చేసిన స్పీడర్ హోవర్క్రాఫ్ట్లా ఉంటుంది. కానీ మోటర్బైక్లా పనిచేస్తుంది. భూమికి పదడుగుల ఎత్తులో గంటకు 45 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణించగలదీ వాహనం. ఇక మలోయ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన హోవర్‌బైక్.. గంటకు 274 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. కాకపోతే ఇది హెలీకాప్టర్ ఎగిరే ఎత్తులో ప్రయాణిస్తుంది. ఈ రెండు వాహనాలు పెట్రోల్ ఇంధనంగా వాడితే.. బే జోల్టన్ అనే హంగేరి సంస్థ ఫ్లైక్ పేరుతో తయారు చేసిన స్పీడర్ విద్యుత్తుతో నడుస్తుంది. రోబో సైన్యం.. రోబోలు మనం చెప్పినట్టు వింటాయన్నది మనకు తెలిసిన విషయమే. కానీ.. స్టార్‌వార్స్ సినిమాలోని రోబోలు మాత్రం యజమాని మనసెరిగి ప్రవర్తిస్తాయి. అంతరిక్ష నౌకల పైలట్లుగా, టెక్నీషియన్లుగానూ రోబోలు పనిచేస్తూంటాయి. నిజజీవితంలో ఇలాంటి రోబోలు అనేకం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యనే అమెరికా రక్షణ పరిశోధన సంస్థ (డార్పా) నిర్వహించిన ఓ పోటీలో రోబోలు వాహనాలను నడపడం వంటి సంక్లిష్టమైన పనులు చేయడంతోపాటు తలుపులు తీయడం, మెట్లు దిగడం, వాల్వ్‌లు మూసేయడం వంటి సులువైన పనులు కూడా చేసేశాయి. అయితే ఇవన్నీ మనిషి ఆదేశాల మేరకే ఈ పనులన్నీ చేయడం గమనార్హం. స్టార్‌వార్స్ సినిమా తరహాలో పూర్తిస్థాయిలో స్వతంత్రంగా వ్యవహరించే రోబోలు వచ్చేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. హాలోగ్రామ్స్.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రచారం గుర్తుందా? స్టూడియోలో చిత్రీకరించిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు చోట్ల ప్రసారమయ్యాయి. అది కూడా హాలోగ్రామ్ల రూపంలో. మనిషి లేదా వస్తువు మన కళ్లముందే ఉండేలా చేయడం ఈ హాలోగ్రామ్ లక్షణం. స్టార్‌వార్స్‌లో టెలిఫోన్ లేదా ఈమెయిల్ సందేశాలు ఉండవు. దాదాపుగా అన్ని సందేశాలూ హాలోగ్రామ్ రూపంలోనే నడుస్తూంటాయి. మూడేళ్ల క్రితం టుపాక్ షకూర్ అనే సంగీత కళాకారుడి పాటల్ని ఆయన చిత్రాలతో హాలోగ్రామ్ రూపంలో ప్రసారం చేయడంతో ఈ టెక్నాలజీ గురించి అందరికీ తెలిసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక అడుగు ముందుకేసి ‘హాలోలెన్స్’ పేరుతో ఈ టెక్నాలజీని కళ్లజోడులోకి చేర్చింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ హాలోలెన్స్లో అన్నీ హాలోగ్రామ్ల రూపంలోనే కనిపిస్తాయి. మీ ఇంట్లోని గోడలే కంప్యూటర్ తెరలైపోతే.. ఇంట్లోని వస్తువులు వీడియోగేమ్లోని పాత్రలుగా మారిపోతాయి..!