
సాక్షి : టీవీ షోల్లో, సినిమాల్లో ఏలియన్ల ప్రస్తావన వచ్చినప్పుడు జనాలు ఆసక్తిగా గమనించటం పరిపాటే. గ్రహాంతరవాసులు ఉనికి కోసం ఓవైపు అగ్రదేశాలు పోటాపోటీ పరిశోధనలు నిర్వహిస్తున్న వేళ ఓ గ్లోబల్ సర్వే ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
ఏలియన్లు ఉన్నాయన్న సంగతి పక్కనపెడితే.. వాటి ఉనికిని బలంగా నమ్మే ప్రజల శాతం చాలా ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాదు మన ఆధునీకరణకు వాటి అవసరం చాలా ఉంటుందని పేర్కొంటూ అన్వేషణ కోసం చేసే ప్రయత్నాలను కూడా వీళ్లు సమర్థించటం గమనార్హం. మొత్తం 24 దేశాల్లో.. 15 భాషల్లో ఈ సర్వే కొనసాగగా.. ది లాస్ట్ జెడి ఈవెంట్‌లో దీనిని ప్రచురించారు. స్టార్ వార్స్ చిత్రాలో 8వ సిరీస్ గా ది లాస్ట్ జెడి వచ్చే వారం విడుదల కానున్న విషయం తెలిసిందే.
మొత్తం 26,000 మందిపై ఈ సర్వే నిర్వహించగా.. 47 శాతం గ్రహాంతరవాసులు ఉన్నాయనే నమ్ముతున్నామని చెప్పారు. అందుకు కొన్ని ఘటనలకు వీరు సాక్ష్యాలుగా చూపారు కూడా. భూమ్మీద అయితే మనుషులు ఎలా ఉన్నారో.. ఇతర గ్రహాలపై కూడా ప్రాణులు ఉండి తీరతాయని 61 శాతం మంది తమ వాదన వినిపించారు. మిగిలిన వారు మాత్రం అదంతా హుళక్కేనని కొట్టి పారేశారు. ఇక ఏలియన్లు ఉన్నాయని ఎక్కువగా నమ్మేవారిలో రష్యన్‌ల సంఖ్య అధికంగా ఉండగా.. మెక్సికో, చైనా, నెదర్లాండ్ ప్రజలు తర్వాతి స్థానాల్లో నిలిచారు.