స్టార్‌వార్స్ కల.. ఇలపై ఇలా..! | Star Wars dream | Sakshi
Sakshi News home page

స్టార్‌వార్స్ కల.. ఇలపై ఇలా..!

Published Tue, Dec 22 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

స్టార్‌వార్స్ కల.. ఇలపై ఇలా..!

స్టార్‌వార్స్ కల.. ఇలపై ఇలా..!

‘స్టార్‌వార్స్.. ద ఫోర్స్ అవేకన్స్’ విడుదలైంది!
 బాక్సాఫీస్ కలెక్షన్లలో మరోసారి రికార్డులు సృష్టిస్తోంది కూడా!
 సుదూర పాలపుంతలు, నక్షత్ర మండలాలు, కృష్ణబిలాలు..
 కనీవినీ ఎరుగని ఆయుధాలు, వాహనాలు.. చిత్ర విచిత్ర ఆకారాల్లో గ్రహాంతర వాసులు..
 ఇవీ స్టార్‌వార్స్ బలం, బలగం.. సమస్తం! ఈ సినిమా కథ కల్పనే! కానీ..
 ఇది 21వ శతాబ్దం! కల్పనకు.. వాస్తవానికీ మధ్య అంతరం తొలగిపోతున్న రోజులివి..
 ఈ హాలీవుడ్ చిత్రరాజంలోని టెక్నాలజీలూ దీనికి భిన్నమేమీ కాదు! ఎలాగంటే..

 
 సాక్షి, హైదరాబాద్: హాలీవుడ్ డెరైక్టర్ జార్జ్ లూకాస్ రూపొందించిన తొలి స్టార్‌వార్స్ సినిమా 1977లో విడుదలైంది. వందల వేల గ్రహాలు.. వాటిమధ్య వ్యాపార సంబంధాలు.. కుట్రలు, కుయుక్తులు.. చెడుపై మంచి (ఫోర్స్) చేసే యుద్ధం.. విఠలాచార్య సినిమా హీరోలను తలపించే జెడీయోధులు... ఇదీ స్టార్‌వార్స్ చిత్ర ఇతివృత్తం. గ్రహాలన్నింటి పాలన  కోసం ఏర్పడ్డ జెడీ కౌన్సిల్ మంచివైపునుంటే.. రాజ్యకాంక్షతో రగిలిపోతూండే డెర్త్‌వాడర్ చెడువైపు ఉండే ఈ చిత్రంలో జెడీ యోధులు ‘ధర్మ’ పరిరక్షకులన్నమాట. గ్రహాల మధ్య ప్రయాణం మొదలుకొని.. లేజర్ కిరణాలతో యుద్ధాలు.. మనిషితో సమానమైన తెలివితేటలు ప్రదర్శించే రోబోలు.. ఈ చిత్రం తాలూకూ హైలైట్స్. కాల్పనిక జగత్తు ఇతివృత్తంగా సాగినా ఈ చిత్రంలోని అనేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
 
 చిటికెలో గ్రహాంతరాళాలు దాటి..
 స్టార్‌వార్స్‌లో హాన్‌సోలో అనే ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఎలుగుబంటికి అన్నయ్యలా ఉండే ఈ క్యారెక్టర్ ‘మిలినియం ఫాల్కన్’ అనే అంతరిక్ష నౌకలో గ్రహాలు చుట్టేస్తూ ఉంటుంది. కాంతికంటే వేగంతో ప్రయాణించే ఈరకమైన అంతరిక్షనౌక మనకు అందుబాటులో లేకపోవచ్చుగానీ.. శాస్త్రవేత్తలు ఈ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలో మాదిరిగా కాంతిని మించిన వేగంతో ప్రయాణించడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన స్పేస్ టైమ్ వంపు ఆసరగా గ్రహాంతర ప్రయాణం సాధ్యమేనని అంటున్నారు ఎరిక్ డేవిస్. ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్(ఆస్టిన్ టెక్సస్, అమెరికా)లో పనిచేస్తున్న ఈ శాస్త్రవేత్త అంచనా ప్రకారం.. ‘నెగటివ్ ఎనర్జీ’ని అందించే పదార్థాలను తయారు చేయగలిగితే.. వార్ప్‌డ్రైవ్, వర్మ్‌హోల్ వంటివి నిర్మించుకుని ఇతర గ్రహాలకు దగ్గరిదారిలో చేరుకోవచ్చు. అయితే ఇలాంటి టెక్నాలజీల అభివృద్ధికి మరో యాభై ఏళ్లు పట్టవచ్చు.
 
 ఎక్సో ప్లానెట్లు..
 సౌర కుటుంబానికి అవతల ఏ గ్రహమూ లేదన్నది స్టార్‌వార్స్: ఏ న్యూ హోప్(మే 25 1977) విడుదలయ్యే సమయానికి ఉన్న అంచనా. చిత్రంలో మాత్రం లెక్కకు మిక్కిలి గ్రహాలు, అందులో జీవులు ఉంటాయి. అయితే 1992 నాటికి కల్పన కాస్తా వాస్తవమైంది. అలెగ్జాండర్ వూల్స్‌స్కాన్ అనే శాస్త్రవేత్త తొలి ఎక్సో ప్లానెట్‌ను గుర్తించారు. దానికి ‘51 పెగసీ బీ’ అని పేరుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇలాంటివి దాదాపు 2,000 గుర్తించినా.. వేటిలోనూ గ్రహాంతర జీవి మాత్రం కనపడలేదు. ఇంకో విషయం.. 2011లో కెప్లర్ టెలిస్కోప్ కెప్లర్-16బీ పేరుతో గుర్తించిన ఓ గ్రహానికి, స్టార్‌వార్స్‌కూ కొంత సాపత్యముంది. సినిమాలోని హీరో లూక్ స్కైవాకర్ ఉండే గ్రహం పేరు ‘టాటోయిన్’. మనకు సూర్యుడు ఒక్కడే నక్షత్రమైతే టాటోయిన్‌లో రెండు నక్షత్రాలుంటాయి. చిత్రంగా కెప్లర్-16బీ కూడా రెండు ప్రకాశవంతమైన నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది!
 
 స్పీడర్స్ వచ్చేశాయి..
 రవాణా కోసం స్టార్‌వార్స్‌లో ఉపయోగించిన మరోరకం వాహనాలు స్పీడర్స్. ఒకరిద్దరు వెళ్లేందుకు వీలయ్యే ఈ రకమైన వాహనాలను ఇప్పటికే అనేక కంపెనీలు తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియాలోని ఏరోఫెక్స్ వీటిల్లో ఒకటి. ఏరో-ఎక్స్ పేరుతో ఈ కంపెనీ అభివృద్ధి చేసిన స్పీడర్ హోవర్‌క్రాఫ్ట్‌లా ఉంటుంది. కానీ మోటర్‌బైక్‌లా పనిచేస్తుంది. భూమికి పదడుగుల ఎత్తులో గంటకు 45 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణించగలదీ వాహనం. ఇక మలోయ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన హోవర్‌బైక్.. గంటకు 274 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. కాకపోతే ఇది హెలీకాప్టర్ ఎగిరే ఎత్తులో ప్రయాణిస్తుంది. ఈ రెండు వాహనాలు పెట్రోల్ ఇంధనంగా వాడితే.. బే జోల్టన్ అనే హంగేరి సంస్థ ఫ్లైక్ పేరుతో తయారు చేసిన స్పీడర్  విద్యుత్తుతో నడుస్తుంది.
 
 రోబో సైన్యం..
 రోబోలు మనం చెప్పినట్టు వింటాయన్నది మనకు తెలిసిన విషయమే. కానీ.. స్టార్‌వార్స్ సినిమాలోని రోబోలు మాత్రం యజమాని మనసెరిగి ప్రవర్తిస్తాయి. అంతరిక్ష నౌకల పైలట్లుగా, టెక్నీషియన్లుగానూ రోబోలు పనిచేస్తూంటాయి. నిజజీవితంలో ఇలాంటి రోబోలు అనేకం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యనే అమెరికా రక్షణ పరిశోధన సంస్థ (డార్పా) నిర్వహించిన ఓ పోటీలో రోబోలు వాహనాలను నడపడం వంటి సంక్లిష్టమైన పనులు చేయడంతోపాటు తలుపులు తీయడం, మెట్లు దిగడం, వాల్వ్‌లు మూసేయడం వంటి సులువైన పనులు కూడా చేసేశాయి. అయితే ఇవన్నీ మనిషి ఆదేశాల మేరకే ఈ పనులన్నీ చేయడం గమనార్హం. స్టార్‌వార్స్ సినిమా తరహాలో పూర్తిస్థాయిలో స్వతంత్రంగా వ్యవహరించే రోబోలు వచ్చేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
 
 హాలోగ్రామ్స్..
 గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రచారం గుర్తుందా? స్టూడియోలో చిత్రీకరించిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు చోట్ల ప్రసారమయ్యాయి. అది కూడా హాలోగ్రామ్‌ల రూపంలో. మనిషి లేదా వస్తువు మన కళ్లముందే ఉండేలా చేయడం ఈ హాలోగ్రామ్ లక్షణం. స్టార్‌వార్స్‌లో టెలిఫోన్ లేదా ఈమెయిల్ సందేశాలు ఉండవు. దాదాపుగా అన్ని సందేశాలూ హాలోగ్రామ్ రూపంలోనే నడుస్తూంటాయి. మూడేళ్ల క్రితం టుపాక్ షకూర్ అనే సంగీత కళాకారుడి పాటల్ని ఆయన చిత్రాలతో హాలోగ్రామ్ రూపంలో ప్రసారం చేయడంతో ఈ టెక్నాలజీ గురించి అందరికీ తెలిసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక అడుగు ముందుకేసి ‘హాలోలెన్స్’ పేరుతో ఈ టెక్నాలజీని కళ్లజోడులోకి చేర్చింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ హాలోలెన్స్‌లో అన్నీ హాలోగ్రామ్‌ల రూపంలోనే కనిపిస్తాయి. మీ ఇంట్లోని గోడలే కంప్యూటర్ తెరలైపోతే.. ఇంట్లోని వస్తువులు వీడియోగేమ్‌లోని పాత్రలుగా మారిపోతాయి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement