నిక్కచ్చిగా తొలి పాతికేళ్ల ‘సోర్స్‌ కోడ్‌’! | Sakshi Guest Column On Corporate giant Bill Gates | Sakshi
Sakshi News home page

నిక్కచ్చిగా తొలి పాతికేళ్ల ‘సోర్స్‌ కోడ్‌’!

Published Mon, Feb 10 2025 12:30 AM | Last Updated on Mon, Feb 10 2025 12:30 AM

Sakshi Guest Column On Corporate giant Bill Gates

విశ్లేషణ

మహాకవి పోతన రచించిన ఒక పద్యం ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు’ అని మొదలవుతుంది. శత కోటీశ్వరుడు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాకుడు బిల్‌ గేట్స్‌ను ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కొందరికి ఆయన తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్‌ దిగ్గజం. రాగల దశా బ్దాల్లో ప్రపంచాన్ని శాసించే సాంకేతికతను ముందే పసిగట్టి, అందుకోసం యాభైయ్యేళ్ల నాడే  ఒక సంస్థను స్థాపించిన దార్శనికుడు. మరికొందరికి ఆయన దాతృత్వశీలి. 

తన స్వచ్ఛంద సంస్థ మెలిందా–గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా వెనకబడిన దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఆరోగ్య పరిరక్షణలో పాటుపడుతున్న మహనీయుడు. కానీ అనేకులకు ఆయన అనుమానాస్పదుడు. ఆయన సేవా కార్యకలాపాల వెనక స్వప్రయోజనాలున్నాయని వారు సంశయిస్తారు. బిల్‌ గేట్స్‌ గురించి చాలా పుస్తకాలొచ్చాయి. అందులో ఆయన్ను కీర్తించినవీ ఉన్నాయి, తూర్పారబట్టినవీ ఉన్నాయి. కానీ ఇంతకూ బిల్‌ గేట్స్‌ ఎవరు? తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఏం చెబుతారు? వీటన్నిటికీ జవాబుగా ఫిబ్రవరి 4న తన స్వీయచరిత్ర ‘సోర్స్‌ కోడ్‌–మై బిగినింగ్స్‌’ పుస్తకం వెలువరించారు. 

మొత్తం మూడు భాగాలుగా వచ్చే స్వీయచరిత్రలో ఇది తొలి భాగం. ఇందులో బాల్యం నుంచి తొలి పాతికేళ్ల ప్రస్థానం ఉంది. బిల్‌ గేట్స్‌ వరకూ పుస్తకం వచ్చిన సందర్భం అనేక విధాల ముఖ్యమైనది. ఆయనకు ఈ సంవత్సరంతో 70 ఏళ్లు వస్తాయి. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతుంది. దివంగతుడైన ఆయన తండ్రికి ఇది శతజయంతి సంవత్సరం. ఏడాదిన్నర క్రితం తన గురించి తాను రాసుకోవాలనిపించిందని,ఇందులో తన ఎదుగుదలకు కారకులైన తల్లితండ్రుల గురించీ, కుటుంబం గురించీ, ఇద్దరు బాల్యస్నేహితుల గురించీ చెప్పాలనిపించిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 

తన సమకాలీకులతో పోలిస్తే ఆయనెప్పుడూ కొన్ని దశాబ్దాల ముందు ఆలోచించేవారని బిల్‌ గేట్స్‌ గురించి ఇప్పటికే చాలామంది చెప్పారు. కానీ ఈ పుస్తకం కోసం ఆయన కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగు దలకైనా, పతనానికైనా కుటుంబ ప్రభావం, పెంపకం ఎలా దోహద పడతాయో ఈ పుస్తకంలో వివరించారు. 

తండ్రికి కోపం తెప్పించిన సందర్భం
స్వీయచరిత్ర రాయదల్చుకున్నవారికి నిజాయితీ ముఖ్యం. తన తప్పొప్పులన్నిటినీ నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఆత్మకథకు పూను కోవాలి. తాను మానవాతీతుడినన్న అహం ఉండకూడదు. తన ఎదు గుదల ఎలా సాధ్యమైందో, జీవితం ఏయే మలుపులు తిరిగిందో, తన ప్రతి అడుగులోనూ ఎవరెవరు అండదండలు అందించారో, ఎవరిపట్ల తాను నిర్దయగా వ్యవహరించాడో, ఆ తప్పును ఏ దశలో గుర్తించాడో, ఎలా సరిదిద్దుకున్నాడో చెప్పగలగాలి. 

ఈ చట్రంలో ఇమిడే స్వీయచరిత్రలు మనదగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ. బిల్‌గేట్స్‌ తన గురించి తాను ఏం చెప్పుకుంటారన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. తొలి భాగం ‘సోర్స్‌ కోడ్‌’ ఆ విషయంలో అందరి మన్ననలూ పొందే అవకాశం ఉంది. ఇది బాల్యం గురించే కనుక, ఆ దశలో ఆయన్ను వివాదాలు చుట్టుముట్టే అవకాశం లేదని అనుకుంటారు. కానీ బాల్య జీవితంలోని కొన్ని అంశాలను నిస్సంశయంగా చెప్పటం ద్వారా బిల్‌ ఫుల్‌మార్క్‌లు కొట్టేశారు. 

అది అమెరికా కనుక 1970ల నాటికే అందరికీ కంప్యూటర్‌ గురించి తెలిసిపోయింది. పర్సనల్‌ కంప్యూటర్ల వాడకమూ మొదలైంది. కాకపోతే ఇప్పటిలా నిత్యావసర వస్తువు కాదు. బాగా ధనవంతులకు మాత్రమే సాధ్యపడే విలాసవంతమైన ఉపకరణం. అలాగని బిల్‌ గేట్స్‌ తల్లిదండ్రులు నిరుపేదలు కాదు. వారి కుటుంబం ఇతరు లతో పోలిస్తే సుఖంగానే జీవనం సాగించేది. తండ్రి గేట్స్‌ సీనియర్‌ సమాజం పట్లా, కుటుంబం పట్లా ఎంతో నిబద్ధతతో ఉండేవాడని బిల్‌ గుర్తు చేసుకున్నారు. ఆచితూచి వ్యవహరించేవాడని, పిల్లల పట్ల దయతో, శ్రద్ధాసక్తులతో ఉండేవాడని రాశారు. ఆయన ఒకే ఒకసారి ఉగ్రుడయ్యాడట. అది కూడా తన లోపమేనని ఆయనంటారు.

డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్‌ గేట్స్‌ ముఖంపై చిమ్మారట. ‘థాంక్స్‌ ఫర్‌ ద షవర్‌’ అంటూ అక్కడి నుంచి బిల్‌ నిష్క్రమించారు. ‘ఎప్పుడూ ఎంతో శాంతంగా, ప్రేమగా ఉండే తండ్రిని నా ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశాను’ అని బిల్‌ రాశారు. ‘చిన్నప్పుడంతా ‘జటిలమైన కొడుకు’గానే ఉండేవాడిని’ అంటారు. ‘ఇప్పుడైతే ఆ ప్రవర్తన చూసి కచ్చితంగా ఆటిజంతో బాధపడేవాడిగా పరిగణించివుండేవారు’ అని చెబుతారు. 

చిన్ననాడే మద్యపానం, గంజాయి, ఎల్‌ఎస్‌డీ వంటివి అలవా టైన సంగతి, వాటికి దూరమైన సంగతి కూడా బిల్‌ దాచుకోలేదు. కొన్ని విషయాల్లో తమ పిల్లాడు ఎందుకంత ఆలోచిస్తాడో, ప్రవర్తి స్తాడో తెలుసుకోవటానికి అవసరమైన పుస్తకాలు, ఇతరేతర సమా చారం తల్లితండ్రులకు ఉండేది కాదంటాడు. ‘పెద్దవాళ్లను కలవటం, వారితో చర్చించటం, వారి సలహాలు, సూచనలు పాటించడం అనే సంస్కృతిని అమ్మానాన్న, అమ్మమ్మ అలవాటు చేశారు. అందుకే ఎక్కడికి తీసుకెళ్లినా పెద్దవాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించటం, సంతృప్తికరమైన జవాబు వచ్చేవరకూ ఆ ప్రశ్నల పరంపరను కొనసాగించటం అలవాటైంది. 

అది జీవితంలో ఎదగటానికి తోడ్పడింది’ అని బిల్‌ గేట్స్‌ అభిప్రాయపడతారు. ముఖ్యంగా అమ్మ, అమ్మమ్మ తనలో పోటీతత్వాన్ని ఎంతగానో పెంచారంటారు. తన జీవితంలో చోటుచేసుకున్న ఈ అంశాలను చెప్పటం అవి అందరికీ ఉపయోగపడతాయన్న ఉద్దేశమేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పుట్టుకే అయాచితంగా అదనపు హక్కు (ప్రివిలేజ్‌)ను ఇచ్చిందని నిజాయితీగా ఒప్పుకోవటం ప్రశసించ దగ్గది. అప్పటికే జాతిపరమైన విభేదాలతో నిలువునా చీలివున్న సియాటెల్‌ సమాజంలో తాను శ్వేతజాతిలో పుట్టడం, అందులోనూ మగవాడిని కావటం ఎంతో కలిసొచ్చిందని బిల్‌ స్వీయాభిప్రాయం. పుట్టుకతోనే ప్రతిభావంతులమని స్వోత్కర్షకు పోయేవారికి ఇదొక కనువిప్పు. 

మేము లేకుండా కంప్యూటర్‌ విప్లవమా?
హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేనాటికి బిల్‌ గేట్స్‌కూ, ఆయన బాల్యస్నేహితుడు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ అలెన్‌కూ, 17 యేళ్లవయసులోనే మృత్యు వాత పడిన మరో స్నేహితుడు కెంట్‌ ఇవాన్స్‌కూ పర్సనల్‌ కంప్యూ టర్‌పై అవగాహన ఉంది. ఎయిత్‌ గ్రేడ్‌లో ఉన్నప్పుడు పాఠశాల కొచ్చిన కంప్యూటర్‌తో ఎక్కువ సమయం గడిపేందుకు కంప్యూ టర్‌లో బగ్స్‌ సృష్టించామని, అది కనిపెట్టి తననూ, ఇవాన్స్‌నూ వెళ్లగొట్టారని బిల్‌ గేట్స్‌ చెప్పారు. తర్వాత కాలంలో కంప్యూటర్లలో బగ్స్‌ గుర్తించి తొలగించే పనికి కుదిరి కొంత డబ్బు సంపాదించిన ఉదంతాలూ ఉన్నాయి. 

కంప్యూటర్‌ను నిర్వహించే సీసీసీ కంపెనీ మూతపడటంతో దాని నిర్వహణ భారాన్ని స్కూల్‌లో తనకు అప్పగిస్తే, మిత్రుడు అలెన్‌ సాయంతో దాన్ని పూర్తిచేశారు. తన తొలి వ్యాపార భాగస్వామిగా ఇవాన్స్‌ తనతో జతకట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని, అతని మరణం ఒక్కటే తన బాల్యంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనని ఆయన వివరి స్తారు. తమ ప్రమేయం లేకుండానే కంప్యూటర్‌ విప్లవం వెల్లువెత్తు తుందేమోనన్న ఆత్రుత గేట్స్‌కూ, అలెన్‌కూ ఉండేదంటే... తాము అందులో పాలుపంచుకుని ప్రముఖంగా ఎదగాలనుకున్నారంటే వారి తపన ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే ఈ ఇద్దరు మిత్రులూ ఎంఎస్‌–డాస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, బేసిక్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలు చేయ గలిగారు.

ఇవాళ్టిరోజున మైక్రోసాఫ్ట్‌లో బిల్‌ గేట్స్‌ వాటాల విలువ 10,780 కోట్ల డాలర్లు. ప్రపంచంలో ఆయన 13వ అతి పెద్ద ఐశ్వర్యవంతుడు. 2021లో ఆయనతో విడిపోయిన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ వాటాలు 3,040 కోట్ల డాలర్ల పైమాటే. అన్నట్టు, దీని అనంతరం రాబోయే పుస్తకాల్లో చాలా వివాదాస్పద విషయాలుంటాయి. ‘సోర్స్‌ కోడ్‌’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు గమనిస్తే ఆయన దేన్నీ దాచదల్చలేదని స్పష్టమవుతుంది. మిత్రుడు అలెన్‌ను దూరం చేసుకోవటం తప్పేనని అంగీకరించారు. 

మైక్రోసాఫ్ట్‌లో కొందరు మహిళా ఉద్యోగినులతో తన వివాహేతర సంబంధాలు, లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణ లొచ్చిన ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎపిస్టీన్‌తో తనకున్న అనుబంధం, 27 ఏళ్ల వివాహబంధం అనంతరం భార్యతో విడాకులు, స్టీవ్‌ జాబ్స్‌తో పరిచయం, గొడవలు వంటి వ్యవహారాలపై బిల్‌ గేట్స్‌ అరమరికలు లేకుండా మాట్లాడారు. ఇంకా పర్యావరణం, ఏఐ వరకూ అభివృద్ధిపరిచిన సాంకేతికత, కరోనా మహమ్మారి, డోనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ల తీరుతెన్నులు వగైరాలు ఈ ఇంటర్వ్యూల్లో ప్రస్తావన కొచ్చాయి. కనుక రాబోయే రెండు భాగాల్లో వీటికి సంబంధించి మరిన్ని వివరాలందిస్తారని తెలుస్తూనే ఉంది. 


తెంపల్లె వేణుగోపాలరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయుడు
venujourno@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement