20 నిమిషాలు ఆలోచించి.. ఫైన్ వేశారు!
కాన్ బెర్రా: ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న 'స్టార్ వార్స్' మూవీ అభిమాని ఉత్సాహం అతనికే ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పోలీసులతో మాటలు పడటంతో పాటు చివరికి జరిమానా కట్టాల్సి వచ్చింది. కోలండ్రా సమీపంలోని సన్షైన్ తీరంలో ఈ ఘటన జరిగింది. స్టార్ వార్స్ సెవెన్త్ సిరీస్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. స్టార్ వార్స్ మూవీ చూడటానికి బుధవారం రాత్రి 11 గంటలకు క్వీన్స్లాండ్స్కు చెందిన మైఖేల్ కీలే ఫుల్ జోష్ మీద బైకుపై వెళ్తున్నాడు. అయితే, ఆ అభిమాని సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిదూరం వెళ్లాక పోలీసులు ఆ యువకుడిని ఆపేశారు. ఎందుకు ఆపేశారో అతనికి అర్థం కాలేదు. బైక్పై మూవీకి బయలుదేరేటప్పుడు లైట్ సాబెర్ స్టిక్ ని వెంట తీసుకెళ్లాడు. బైక్ నడుపుతూ మైకెల్ ఓ చేతిలో లైట్ సాబెర్ స్టిక్ పట్టుకున్నాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బైక్ నడిపిన వ్యక్తికి ఫైన్ వేయాలా వద్దా అని పోలీసులు ఏకంగా 20 నిమిషాల పాటు ఆలోచించారు. ట్రాఫిక్ రూల్స్లో ఆ విషయంపై జరిమానాకు సంబంధించి వివరాలు లేవు. చివరికి ఆ యువకుడికి భారత కరెన్సీలో రూ.18,196 ఫైన్ వేశారు. పోలీసుల వ్యవహారంతో మైఖేల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. చేతిలో వెలిగే లైట్ స్టిక్ కానీ, లేదా అనధికారికంగా ఏ ఇతర వస్తువులు తీసుకెళ్లినా ఫైన్ వేసే అధికారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లైట్ సాబెర్ స్టిక్ ఆన్ చేసి బైకుపై వెళ్తూ వీడియో తీయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ తెలియని పోలీసులు, రూల్స్లో లేకున్నప్పటికీ తనకు జరిమానా విధించారని బైకిస్ట్ ఆరోపించాడు. ఆ సమయంలో కేవలం ఒక్క కారు మాత్రమే రోడ్డుపై వెళ్తోందని పేర్కొన్నాడు. ఫైన్ విషయాన్ని టిక్కెట్టుపై కూడా రాశారు. దీంతో ఈ వివరాలను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.