గుండె పగిలింది..
వింజమూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అనివార్యమనే విషయాన్ని జీర్ణించుకోలేని ఓ సమైక్యవాది గుండె ఆగిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న గుండెడమడకలకు చెందిన చీమల నారాయణరెడ్డి(61) సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఉద్యమంలో భాగంగా శనివారం గ్రామంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన నేతృత్వం వహించారు.
అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన అదేరోజు రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. విభజన కారణంగా వచ్చే నష్టాలను రచ్చబండ వద్ద అందరికీ నారాయణరెడ్డి వివరించే వారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైఎస్సార్సీపీ నేత అయిన నారాయణరెడ్డి గుండెమడకలలోని కోదండరామస్వామి దేవస్థానం ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు.
ఘననివాళి..: చీమల నారాయణరెడ్డి మృతదేహానికి వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, నేతలు బయ్యపురెడ్డి రామకోటారెడ్డి, ఎం.విజయకుమార్‌రెడ్డి, మద్దూరి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, గోపిరెడ్ది రమణారెడ్డి, ముక్కమల్ల శ్రీనివాసులురెడ్డి, వెలుగోటి రమేష్‌నాయుడు, దాట్ల విజయభాస్కర్‌రెడ్డి, లెక్కల శ్రీనివాసులురెడ్డి ఉన్నారు.