ఇంటర్ పరీక్షలక కౌంట్‌డౌన్ స్టార్ట్
పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి
అన్ని సబ్జెక్టులకు సంబంధించి గత మూడేళ్ల ప్రశ్న పత్రాలు తీసుకుని తరచుగా వచ్చిన వాటిపై దృష్టి పెట్టాలి. వీటిని ప్రతిరోజూ సాధన చేయాలి.
అధ్యాపకులు వారాంతపు, యూనిట్ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఏబీసీడీలుగా విభజించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి.
అధ్యాపకులే మోడల్, గెస్ పేపర్లు తయారు చేసి చదివించాలి.
పరీక్షలంటే భయపడే విద్యార్థుల్లో ఆ భయాన్ని తొలగించేందుకు అధ్యాపకులు, తల్లిదండ్రులు తోడ్పడాలి.్డ విద్యార్థులు పరీక్ష సమయంలో సరైన ఆహార నియమాలు పాటించాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఒత్తిడి తగ్గేందుకు మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయాలి.
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. వీరికి ఇంకా 45 రోజులే మిగిలి ఉంది. ఉన్న ఈ కొద్ది పాటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే విద్యార్థులు మెరుగైన ఫలితం సాధిం చవచ్చని అధ్యాపకులు చెబుతున్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే విజయం సాధ్యమవుతుందని అంటున్నారు. ఇప్పటికే దీనిపై కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సదస్సులు నిర్వహిస్తున్నాయి. పలు కళాశాలలు కౌన్సెలింగ్ ప్రక్రియలు కూడా చేస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్య పరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు కావాలనుకుంటున్న వారు ఈ సమయాన్ని తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
తగ్గిన విద్యార్థుల సంఖ్య
ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య గత ఏడాది కంటే బాగా తగ్గింది. ఏడాది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 22,413 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయి. మార్చిలో జరిగే పరీక్షలకు ప్రథమ సంవత్సర జనరల్ విభాగంలో 20,454 మంది, ఒకేషన్ విభాగంలో 1,959 మంది కలుపుకొని మొత్తం 22,413 మంది హాజరుకానున్నారు. రెండో సంవత్సరం జనరల్ విభాగంలో 22,262 ఒకేషనల్ విభాగంలో 3,679 మంది కలుపుకొని 25,938 మంది మాత్రమే హజరుకానున్నారు. గత విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది థియరీ పరీక్షలకు సుమారు 321 మంది వరకు విద్యార్థులు తగ్గారు. మొత్తం 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 39, ప్రైవేటు కళాశాలల్లో 30 పరీక్షా కేంద్రాలున్నాయి. థియరీ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
ప్రాక్టికల్ పరీక్షలకు నాన్ జంబ్లింగ్ పద్ధతి
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నాన్ జంబ్లింగ్ పద్ధతిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్ ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు మొత్తం 12,962 మంది హాజరవుతున్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 9,186 మంది, బైపీసీ విద్యార్థులు 3,776 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారు.
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు మొత్తం 92 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 41, ప్రైవేటు కళాశాలల్లో 51 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో మెజారిటీ విద్యార్థులు తాము చదువుతున్న కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి పరీక్షల కమిటీ (డీఈసీ) ఏర్పాటుకు ఇంటర్మీడియెట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపించినట్లు ప్రాం తీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ) ఎల్.ఆర్.బాబాజీ తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేం దుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.