ఆగని దాడులు
- మరో ఏడుగురి బందీ
- రిమాండ్కు రామేశ్వరం,
- పుదుకోట్టై జాలర్లు
సాక్షి, చెన్నై : రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి నాగపట్నం జాలర్లపై కోడియకరైలో శ్రీలంక సేన విరుచుకుపడింది. ఓ పడవతో పాటు ఏడుగుర్ని బంధీగా పట్టుకెళ్లారు. కడలిలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేనల పైశాచికత్వానికి హద్దులు లేకుండా పోతోంది. కేంద్రం హెచ్చరిస్తున్నా లంక సేనలు ఏ మాత్రం తగ్గడం లేదు.
తమ చేతికి చిక్కిన జాలర్లను బందీలుగా పట్టుకెళ్తున్నారు. బుధవారం అర్ధరాత్రి రామేశ్వరం, పుదుకోట్టైలకు చెం దిన జాలర్లపై రెండు శ్రీలంక సేనల బృందాలు దాడు లు చేశాయి. తుపాకుల్ని ఎక్కుపెడుతూ వీరంగం సృష్టించి 46 మందిని బందీగా పట్టుకెళ్లారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే నాగపట్నం జాలర్లపై శ్రీలంక నావికాదళం విరుచుకు పడింది.
ఏడుగురి బందీ
నాగపట్నానికి చెందిన జాలర్లు గురువారం అర్ధరాత్రి కోడియకరై పరిసరాల్లో చేపల వేటలో నిమగ్నమయ్యారు. వలల్ని విసిరి వేటలో ఉన్న జాలర్లకు వేకువ జామున శ్రీలంక సేనల రూపంలో ప్రమాదం ఎదురైంది. వచ్చీరాగానే గాల్లో కాల్పులు జరుపుతూ శ్రీలం క సేనలు వీరంగం సృష్టించారు. అక్కడ పదుల సంఖ్య లో ఉన్న పడవలు ఒడ్డుకు తిరుగు పయనమయ్యాయి. వలల్నితెంచి పడేశారు. ఆపై వెంబడిస్తూ వస్తున్న శ్రీలంక సేనలకు దొరక్కుండా జాలర్లు ముందుకు కదిలారు. అయితే ఒక పడవ మాత్రం శ్రీలంక సేనల చేతికి చిక్కింది. ఆ పడవలోని ఏడుగురు జాలర్లపై తుపాకుల్ని ఎక్కుపెట్టి బెదిరించారు.
మిగిలిన పడవలు ఎక్కడికక్కడే ఆపేయాలని హెచ్చరించారు. అయితే పడవలు ఆగమేఘాలపై ఒడ్డుకు దూసుకెళ్లడంతో వాటిని వదలి పెట్టారు. చేతికి చిక్కిన జాలర్లను బందీగా పట్టుకెళ్లారు. నెలకొంది. వరుస దాడులు జాలర్ల సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రెకెత్తిస్తోంది. జాలర్ల విడుదలకు సీఎం జయలలిత కేంద్రానికి లేఖలు రాయడం కాదని, ఈ దాడులకు ముగింపు పలికే రీతిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అన్ని సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలకు కసరత్తులు చేస్తున్నాయి. కాగా శ్రీలంక సేనల చేతికి చిక్కిన పుదుకోట్టై, రామేశ్వరం జాలర్లను శుక్రవారం మన్నార్ కోర్టులో హాజరు పరిచారు. వారిని రిమాండ్కు తరలించారు. కేంద్రం ఒత్తిడి అనంతరం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇచ్చే సంకేతం మేరకు మళ్లీ కోర్టులో హాజరు పరిచి, ఆ తర్వాత వీరిని విడుదలచేసే అవకాశం ఉంది. లేకుంటే అక్కడి జైళ్లలో మగ్గాల్సిందే.