The state capital
-
కారాగారం.. మృత్యు కుహరం
ఈ ఏడాదిలో చర్లపల్లి జైల్లో 31 మంది ఖైదీలు మృతి అందులో సగం మందికి పైగా విచారణ ఖైదీలే.. జైలు ఆస్పత్రిలో వైద్యుల్లేరు.. సిబ్బందీ అంతంతే.. కనీసం అంబులెన్స్‌కు డ్రైవర్ కూడా లేడు తెలంగాణ జైళ్లన్నింటిలోనూ ఇదే తరహా దుస్థితి.. ‘సాక్షి’ విశ్లేషణలో వెల్లడైన వాస్తవాలు అత్తలూరి అరుణ రాష్ట్ర రాజధానిలోని చర్లపల్లి జైలులో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. మానసిక పరివర్తనకు ప్రతిరూపంగా నిలవాల్సిన జైళ్లు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. తప్పు చేసి జైలుకు వచ్చిన వారితో పాటు.. అసలు నేరం చేశారో లేదో తేలకుండానే మరణం పాలవుతున్న కఠోర వాస్తవాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జైళ్లలో మరణాలకు కారణాలను కోరుతూ నివేదిక సమర్పించాలని సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనంతరం కూడా చర్లపల్లి జైలులో ఈ దారుణాలు జరుగుతున్నట్లు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. 2014 జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు చర్లపల్లి జైల్లో మొత్తం 31 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా టైస్టులో లేక మరేదో పెద్ద నేరాలు చేసినవారో కాదు. చిన్నా చితకా నేరాలు చేసినవారు, నేరం ఆరోపించబడి వచ్చిన సాధారణ వ్యక్తులు. దొరెవరో దొంగెవరో తేలకుండానే, నేరం రుజువుకాకుండానే అండర్ ట్రయల్‌లో ఉన్న 12 మంది ఖైదీల ప్రాణాలు జైలులోనే గాలిలో కలిసిపోయాయి. ఇక నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న 15 మంది ఖైదీలు సైతం దయనీయ స్థితిలో మరణించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు 23 మంది మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం. ఆ తర్వాత మరో ఎనిమిది మంది చనిపోయారు. ఈ మొత్తం 31 మందిలో కనీసం మూడు పదుల వయస్సు కూడా దాటనివారు ఎక్కువ మంది ఉన్నారు. పాతికేళ్లయినా నిండని యువకులకు నిండా నూరేళ్లు నిండిపోయాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో ఏడుగురు ఖైదీలను మరణించిన తర్వాత వారి మృతదేహాలనే ఆస్పత్రికి చేర్చినట్లు ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. మరో ఏడుగురు ఆస్పత్రిలో చేర్చిన 24 గంటల లోపే మరణించారు. చేరిన 24 గంటల తర్వాత మరణించినవారు తొమ్మిది మంది వరకు ఉన్నారు. ‘అసలు ఈ మరణాలకు కారణాలేమిటి? నెలల తరబడి, సంవత్సరాల తరబడి విచారణ ఖైదీలుగా ఉంటూ చిన్న చిన్న కారణాలతో మృత్యువాత పడుతున్న ఖైదీలకు దిక్కెవరు. చేయని తప్పునకు మరణశిక్ష వేస్తున్న ప్రభుత్వ అలసత్వానికి బాధ్యత ఎవరిది?..’ ఖైదీల కుటుంబసభ్యులు, హక్కుల నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. చర్లపల్లి జైలులో అసలేం జరుగుతోంది..? ఏడాదిలో 31 మంది ఖైదీల మృతికి కారణాలేమిటనేదానిపై ‘సాక్షి’ విశ్లేషణలో కళ్లు బైర్లుకమ్మే కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 1,500 మంది ఖైదీలున్న చర్లపల్లి జైలులో సెప్టెంబర్ 17 నాటికి ఒక్క డాక్టర్ కూడా లేడు. హఠాత్తుగా ఎవరైనా ఖైదీకి ఏదైనా జరిగితే పట్టించుకునే దిక్కులేదు. ముగ్గురు సివిల్ సర్జన్ల ఖాళీలు అలాగే ఉన్నాయి. కేవలం ఒక దంత వైద్యుడు, ఒక మానసిక వైద్యుడు మాత్రమే చర్లపల్లి జైలు ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. ల్యాబ్ టెక్నీషియన్గానీ, పాథాలజిస్ట్గానీ లేరు. మేల్ నర్సు పోస్టులు ఆరు ఉండగా.. ఐదుగురు మాత్రమే ఉన్నారు. అత్యవసరంగా ఏ గుండెనొప్పో వస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇక్కడ ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు ఉండాల్సి ఉండగా... కనీసం ఒక్క డ్రైవర్ కూడా లేకపోవడం దారుణమైన విషయం. మరణించిన 31 మందిలో ఎక్కువ మంది హృద్రోగంతోనే చనిపోయినట్లు వైద్యుల నివేదికలు చెబుతున్నాయి. ఇక ఏ కాలో చెయ్యో విరిగితే వారిని ఎత్తుకుని వెళ్లడానికి ఆఫీస్ సబార్డినేట్స్ ఇద్దరు ఉండాల్సిన చోట.. ఆ రెండు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. చిన్నా చితకా రోగమొచ్చినా మందిచ్చే నాథుడు లేడు. ఇక పెద్ద జబ్బు చేస్తే పలకరించే వారే లేరు. పోలీసు అధికారులు తన తండ్రి వద్ద లాక్కున్న ఇన్సులిన్ కిట్ ఇవ్వాలన్నందుకు రూ. 30 వేలు లంచం అడిగారంటూ.. ఇటీవల జైలు గోడల మధ్య షుగర్ స్థాయిలు పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ మరణించిన సంగతుల వెంకటేశ్వర్రావు కుమారుడు అమర్దాస్ వేసిన కేసు హైకోర్టులో విచారణలో ఉంది. నిర్లక్ష్యం, అలసత్వం కలగలిసి.. అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కలిసి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రతి మూడు నెలలకోసారి జిల్లా జడ్జి జైలును సందర్శించాలి. కానీ ఎప్పుడో స్వాతంత్య్ర దినోత్సవం రోజునో, మరో సందర్భంలోనో జెండా ఎగురవేయడానికి తప్ప జిల్లా జడ్జీలు జైళ్లను సందర్శిస్తున్న దాఖలాలు లేవు. జైలు అడ్వయిజరీ కమిటీల నిర్మాణం సంగతి సరే సరి. ఇంతవరకు అటువంటి కమిటీ ఉందా? ఉంటే ఏం చేస్తోంది? అన్నది ప్రశ్నార్థకమే. ఒక వైస్ చాన్స్‌లర్, ఒక సామాజిక కార్యకర్త, ఒక సీనియర్ జర్నలిస్టుతో కలిసి జైలు అడ్వయిజరీ కమిటీ ఉంటుంది. కానీ అదేదీ పనిచేస్తున్న పరిస్థితి లేదు. జైళ్లలో ఖైదీల బాగోగులేంటి? అసలు వారంతా బతికే ఉన్నారా? ఇలాంటి అంశాలను తెలుసుకోవడానికి, వివిధ కారణాల వల్ల కోర్టుకు హాజరుపర్చకుండా జైల్లోనే ఉంచుతున్నవారి క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. జడ్జి కోర్టు నుంచి వేస్తున్న క్షేమ సమాచార ప్రశ్నలకు ఖైదీలు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో సమాధానం చెప్పాలి. ఇది ప్రతి 40 రోజులకోసారి జరగాలి. కానీ సాంకేతిక లోపాల కారణంగా ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ మూతపడింది. ఈలోగా ఎవరైన మరణిస్తే వారి గురించి అడిగేందుకు ఎవరూ లేరు. కనీసం జైలులో మరణించినవారి కుటుంబసభ్యులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ ప్రభుత్వానికి ఒక సమగ్ర విధానం లేదు. జాతీయ మానవహక్కుల సంస్థ (ఎన్‌హెచ్చార్సీ) ప్రమేయంతోనే తృణమో ఫణమో జైలు మృతుల కుటుంబాలకు దక్కుతోంది. అంతకు మించిన విధానమేదీ అమలులో లేదు. ఇవన్నీ జైళ్ల వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. ఇలా జైళ్లలో జరుగుతున్న మరణాలపై విస్తృతంగా పరిశోధన సాగించాలని మానవ హక్కుల వేదిక భావిస్తోంది. ఆ సంస్థ చేపట్టిన ప్రాథమిక అధ్యయనంలో మరెన్నో దారుణాలు బయటపడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జైళ్లలో మోగుతున్న మృత్యు ఘంటికలను అరికట్టే వరకు ఉద్యమిస్తామని మానవ హక్కుల వేదిక స్పష్టం చేస్తోంది. ఈ మరణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. మరణించిన వారి వివరాలు.. చర్లపల్లి జైలులో జనవరిలో 8వ తేదీన మహ్మద్ హబీబ్ (22), 10న కె.శ్రీను (23), 20న ఎ.వెంకటేశ్వర్లు (33), 30న జి.విజయ్‌కుమార్ (66).. ఫిబ్రవరి నెలలో 16వ తేదీన ఎస్.వెంకటేశ్వర్రావు (57), 19న డి.సాయికుమార్ (19).. మార్చి నెలలో 23వ తేదీన కె.శివకుమార్ (24).. మే నెలలో 16వ తేదీన బి.సత్యనారాయణ (35), 19న పోలీస్ చంబాసీరెడ్డి (65), 20న ఇ.అయ్యన్న (55), 30న ఐ.కృష్ణయ్య (31).. జూన్ నెలలో 14వ తేదీన యు.రాములు (39), 28న సయ్యద్ అషఫ్ రపాషా (54).. ఆగస్టు నెలలో 5వ తేదీన ఎం.సహదేవ్ (26), 6న సి.హెచ్.నర్సింహ (54), 16న సయ్యద్ సాధిక్ హుస్సేన్ (54), 17న ఎం.వెంకటేశ్ (36), 27న షేక్ అబ్బాస్ అలీ (28), 28న చాంద్ ఖురేషి (22).. సెప్టెంబర్ నెలలో 2వ తేదీన షేక్ మస్తాన్ (35), 4వ తేదీన వి.హరిచందర్ (42), ఎం.రాము (22), 15న కె.మొగిలయ్య (62), 22న జి.నరసింహ... అక్టోబర్ నెలలో 15వ తేదీన షేక్ మస్తాన్, 20న నల్లా దానయ్య (33), 25న సయ్యద్ చాంద్, 27న విద్యాసాగర్, 28న సంజయ్, 31న ముకుల్ పుల్వాన్ (19), నవంబర్ 12వ తేదీన తరియా (39) మరణించారు. ఎక్కువగా విచారణ ఖైదీలే.. నేరం రుజువుకాకుండానే, చేయని తప్పుకి ప్రాణాలు కోల్పోతున్న అమాయకుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకూ ఈ మరణాలపై విచారణ జరిగిన దాఖలాలు లేవు. పాత ప్రభుత్వాల సంగతి సరే కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపానపోలేదు. విచారణ ఖైదీలను సమయానికి కోర్టుకు తీసుకెళ్లకపోతుండడంతో.. విచారణలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి జైలు అధికారుల నుంచి వచ్చేది ఎస్కార్ట్ లేదనే సమాధానమే. జిల్లా రిజర్వ్ పోలీసులను రాజకీయ నేతలకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం వల్లనే ఎస్కార్ట్ ఇవ్వలేకపోతున్నామనేది వారి వాదన. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్వేచ్ఛగా గన్‌మెన్ లేకుండా పరిపాలన సాగించాలని మానవ హక్కుల వేదిక కోరుతోంది. అప్పుడైనా ఖైదీల కోసం ఎస్కార్ట్ ఇవ్వగలుగుతారని పేర్కొంటోంది. క్షమాభిక్ష హక్కును తప్పనిసరి చేయాలి.. ‘‘జైళ్లలో ఖైదీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. మానసిక క్షోభ నుంచి బయటపడేసేందుకు ఖైదీలకు రాజ్యాంగంలో పొందుపరిచిన క్షమాభిక్ష హక్కుని తప్పనిసరి చేయాలి. 2009లో జైల్లోని ఖైదీల ప్రాణాలు కాపాడేందుకు గాంధీ ఆస్పత్రిలో 50 పడకల ఖైదీల వార్డుకు సిబ్బందిని కేటాయించాలని వైఎస్ఆర్ను కోరాం. ఆ మేరకు అక్కడ ఖైదీలకు వైఎస్ ప్రభుత్వం వైద్య సదుపాయాలను మెరుగుపర్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలి. చర్లపల్లి జైలు ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని నియమించి, సదుపాయాలను మెరుగుపర్చాలి. కేసీఆర్ నిజాంను నిజంగా ఆదర్శంగా తీసుకునేవారైతే.. నిజాం కాలంలో మాదిరిగా రాత్రి, పగలు రెండింటినీ లెక్కలోకి తీసుకుని ఏడేళ్లకే శిక్షను పరిమితం చేయాలి. ఆనాడు లేనట్లే నవ తెలంగాణలో కూడా ఉరిశిక్షను రద్దు చేయాలి..’’ - జనశక్తి నేత కూర అమర్ (గతంలో రెండున్నరేళ్ల పాటు చర్లపల్లి జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నారు) తెలంగాణ వచ్చినా విముక్తేది? ‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, టంగుటూరి ప్రకాశం పంతులు హయాంలోనూ జీవిత ఖైదీలను విడుదల చేసిన చరిత్ర ఉంది. కానీ తెలంగాణ కోసం జైల్లో కూడా ఎన్నో ఉద్యమాలు చేసినవారికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టలేదు. జీవిత ఖైదీలంతా ఎంతో ఆశతో తెలంగాణ వస్తే విముక్తి లభిస్తుందని భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోంది. జైల్లో పెట్టే ఆహారం తినడం కన్నా శిక్ష మరొకటి ఉండదేమో! చింత పులుసు చారు, ఉడికీ ఉడకని అన్నం, దానికోసమే తన్నుకునే దారుణమైన పరిస్థితి. 1980లో ముల్లా కమిషన్ చేసిన సిఫార్సులను సవరించి, నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. ఒక్కో ఖైదీకి రూ. 35 ఖర్చు చేయాలి. కానీ 17 రూపాయలే ఖర్చుచేసి మిగిలింది జైలు అధికారులు మింగేస్తున్నారు..’’ మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్ (గతంలో ఐదున్నరేళ్లు చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్నారు) -
పాదయాత్ర చేసి... భరోసానిచ్చి...
బెజవాడలో సీఎంచంద్రబాబు బిజీబిజీ స్వచ్ఛభారత్, ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ భరోసా పథకాలు ప్రారంభం రాజధానికి రూ.3.60 కోట్ల విరాళాలు సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటన చేశారు.పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన నగర శివారు ప్రాంతాల్లో సుమారు గంట సేపు కాన్వాయ్ ద్వారా పర్యటించి రాజధానిలోని ప్రాంతాలు, స్థితిగతులను తెలుసుకున్నారు. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ భరోసా పథకాలకు గురువారం విజయవాడలో శ్రీకారం చుట్టారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వచ్చింది మొదలుకుని తిరిగి వెళ్లేంత వరకు బిజీబిజీగా గడిపారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి బయలుదేరిన ఆయన నేరుగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు వెళ్లకుండా విజయవాడ నగర పరిస్థితిని పరిశీలించేందుకు బయలుదేరారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాన్వాయ్ రూట్‌ను ఎంపిక చేసి సుమారు గంటపాటు సుడిగాలి పర్యటన చేశారు. గన్నవరం నుంచి నిడమానూరు మీదుగా ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఏలూరు రోడ్డు మీదుగా బీఆర్టీఎస్ రోడ్డు, ఎర్రకట్ట, చిట్టినగర్, పాలప్రొజెక్టు ఫ్లై ఓవర్, వైఎస్సార్(జేఎన్ఎన్యుఆర్ఎం) కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, పైపుల రోడ్డు ప్రాంతాలను కాన్వాయ్ నుంచే కేంద్రమంత్రితో కలిసి పరిశీలించారు. మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని సింగ్‌నగర్ పైపుల రోడ్డు సెంటర్లో జాతిపిత విగ్రహానికి పూలమాల వేసిన బాబు నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి మార్గమధ్యంలో పలువురితో మాట్లాడారు. పాదయాత్రతో పాటుగా సీఎం, కేంద్ర మంత్రి సైడుకాల్వల్లో పూడికలు తీసి, రోడ్డు ఊడ్చారు. అనంతరం నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మొక్కలు నాటారు. పైపుల రోడ్డుసెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన బాబు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత 12 గంటలకు ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్‌ను ప్రారంభించారు. అజిత్‌సింగ్ నగర్లో బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘జన్మభూమి-మాఊరు’ సభలో వెయ్యి రూపాయల పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతుందని, తాను రోజుకో జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరి స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ జిల్లా అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. మధ్నాహ్నభోజన విరామం తర్వాత కొద్దిసేపు విశాంత్రి తీసుకుని అక్కడి నుంచి ఇరిగేషన్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకున్నారు. సాయంత్రం 5.50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. భారీగా విరాళాలు.... స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో సీఎంను కలిసిన పలువురు రాజధాని నిర్మాణం కోసం భారీగా విరాళాలు అందజేశారు. కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సోసైటీ చైర్మన్ మండవ జానకి రామయ్య, డెరైక్టర్లు జాస్తి రాధాకృష్ణ, ఆర్జా నరేష్, వల్లభనేని బాబురావు, రత్నగిరి, అంజిరెడ్డి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబుకు రూ .2కోట్ల చెక్కును అందజేశారు. అలాగే పాల ఉత్పత్తిదారుల సొసైటీ రైతులు రూ.1.50 కోట్లు , జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్వరరావు రూ .10 వేలు అందజేశారు. నగరపాలకసంస్థ ఉద్యోగులు, ఇతర సంఘాలవారు పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సీఎం పర్యటనలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యేలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, దాసరి బాలవర్థనరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీవి మోసపూరిత ప్రకటనలు
కొలుసు పార్థసారథి శేరినరసన్నపాలెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరించి రైతులకు న్యాయం చేస్తామంటూ మోసపూరిత ప్రకటనలు చేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా కన్వీనర్ కొలుసు పార్థసారథి విమర్శించారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం లో జెడ్పీటీసీ కైలే జ్ఞానమణి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూసేకరణలో కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలను అమలు చేస్తే రైతులకు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని.. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నారు. రైతులకు రంగుల కలలు చూపిస్తున్నారు... సింగపూర్, మలేషియా తరహాలో అభివృద్ధి చేస్తామంటూ రైతుకు రంగుల కలలు చూపిస్తోందని సారథి విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో 4500 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని ఉందని, నూతన రాజధాని ఏర్పాటుకు లక్ష ఎకరాలు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల ప్రకటనలు ఇవ్వడం వారికి ఎలాంటి ప్రణాళికా లేదని తెలియజేస్తోందన్నారు. రాజధాని ఏర్పాటుకు, ఏ శాఖకు ఎంత భూమి కావాలనేదానిపై ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 18,500 ఎకరాల రెవెన్యూ, అటవీ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి రాజధాని ఏర్పాటుకు కేటాయిస్తే భూసేకరణ అవసరం లేదని సారథి అన్నారు. టీడీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను ఏమారుస్తూ ఎన్నికల హామీలు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఓట్లు దండుకుని.. రోడ్డున పడేశారు రైతు, డ్వాక్రా రుణాలు చెల్లించొద్దని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకుని, ఇప్పుడు రుణాలు రద్దు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలను రోడ్డున పడేశారని సారథి మండిపడ్డారు. గతేడాది ఖరీఫ్ రైతులకు బ్యాంకర్లు రూ.1,350 కోట్ల వ్యవసాయ రుణాలివ్వగా, ఈ ఏడాది ఇప్పటికి రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది రూ.1,050 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. పార్టీ వైద్యవిభాగం కన్వీనర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే ప్రజల పక్షాన నవంబర్ 16న మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. జెడ్పీటీసీ జ్ఞానమణి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణకు అటూ ఇటూ..!
రాజధాని నగరానికి భూసేకరణపై సీఎం నిర్దేశం? ► కృష్ణా - గుంటూరు రెండు జిల్లాలను సంతృప్తి పరుద్దాం ► కృష్ణా నదిని ఆనుకుని 2 జిల్లాలు కలిసేలా భూ సమీకరణకు సర్వే చేయండి ► కృష్ణా తీరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఏర్పాటుకు స్థలం చూడండి ► కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో భేటీలో సీఎం చంద్రబాబు ఆదేశాలు ► అమరావతి, అచ్చంపేట, కంచికచర్ల, కొండపల్లిలో రాజధాని అంటూ ప్రచారం ► అచ్చంపేట పరిసరాల్లో 3,000 ఎకరాలు, గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నాయన్న నివేదికలు విజయవాడ బ్యూరో ‘రాష్ట్ర రాజధాని విషయంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నాయకులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. మనకు అండగా నిలిచిన ఈ రెండు జిల్లాలను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలను ఆనుకుని కృష్ణా నదికి రెండు వైపులా రాజధాని నిర్మించేలా ఆలోచన చేద్దాం. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న భూములపై మరోసారి సమగ్ర సర్వే చేయించి వీలైనంత త్వరలో నివేదికలు అందించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా మంత్రులు, రెండు జిల్లాల కలెక్టర్లతో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మంగళవారం సీఎంను కలసి రెండు జిల్లాల్లో ప్రభుత్వ, అటవీ భూముల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణానదికి ఇరువైపులా భూసేకరణ కోసం సర్వే నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సీఎం సంకేతాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని అమరావతి, అచ్చంపేట, మంగళగిరి, కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల దిశగా రాష్ట్ర రాజధాని నిర్మాణం సాగే అవకాశముందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (నిడ్) ఏర్పాటు కోసం కృష్ణా నదీ తీరం వెంటే 50 నుంచి 60 ఎకరాల భూమి ఒకే చోట ఉండే స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు రఘునందనరావు, కాంతిలాల్ దండేలను ఆదేశించినట్లు తెలియవచ్చింది. ఆ ప్రాంతం అనువైనదేనన్న నివేదికలు... ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచి చెప్తున్న విధంగా కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యలోనే రాజధాని ఏర్పాటు చేయడానికి అమరావతి, అచ్చంపేట ప్రాంతాలు అనువైనవిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా నది మీదుగా రెండు కిలోమీటర్ల దూరం హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తే గుంటూరు - కృష్ణా జిల్లాలను కలిపేయవచ్చని ప్రభుత్వం భావి స్తున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వ, అటవీ భూముల వివరాలు, నీటి లభ్యత, 9వ జాతీయ రహదారికి అనుసంధాన దూరం, గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గం వివరాల గురించి గుంటూరు, కృష్ణా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంది. అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో 3,000 ఎకరాలకు పైగా, కృష్ణా జిల్లాలోని గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు చెప్తున్నారు. ఈ ప్రాంతానికి పులిచింతల ప్రాజెక్టు నుంచి గానీ, కృష్ణా నది నుంచి గానీ నీటిని సులువుగా తీసుకురావచ్చని.. రైతుల నుంచి భూములు సేకరించాల్సి వచ్చినా తక్కువ ధరకు లేదా 60 : 40 ప్రాతిపదికన సులువుగా భూ సేకరణ చేయొచ్చని అధికార వర్గాలు నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అచ్చంపేట నుంచి గన్నవరం విమానాశ్రయం 95 కిలోమీటర్లు, నందిగామ 30 కి.మీ, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, మంగళగిరి, అమరావతి, నరసారావుపేట పట్టణాలు 50 కి.మీ. దూరంలోనే ఉంటాయని వివరించారని సమాచారం. -
ప్రజాభిప్రాయం మేరకే రాజధాని ఏర్పాటు చేయాలి
తిరుపతి : రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని పుంగనూరు శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. అస్మదీయులకు ప్రయోజనం చేకూర్చేందుకే చంద్రబాబు విజయవాడ-గుంటూరు మధ ్య రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారన్నారు. రాజధాని ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాలు, ఆలోచన లతో నిమిత్తం లేకుండా ముందుగానే నిర్ణయం తీసుకుని తన అనుయాయుల చేత తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించారన్నారు. నియంతృత్వ పోకడలకు పోతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేదన్నారు. రుణ మాఫీపై చంద్రబాబు దగాకోరు విధానాలను ప్రజలు గ్రహిస్తున్నారని, రైతులు, మహిళలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రుణమాఫీపై చంద్రబాబు చేసిన ప్రకటనతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమన్నారు. లక్షా రెండు వేల కోట్ల రూపాయల రుణాలలో కేవలం 35 వేల కోట్లు మాత్రమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు, ఇది కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదన్నారు. అంతా మేలు చేసేసినట్లు మైండ్‌గేమ్ ఆడి ఎన్నికల హామీల నుంచి తప్పుకుని ప్రజల చూపును మళ్లించే యత్నం చేస్తున్నారని రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు స్పందించేలోపు పుణ్యకాలం దాటిపోయిందని ఖరీఫ్ అదను దాటిపోవడంతో రైతులు రుణాలు మాఫీ కాక, క్రాప్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ వంటివి పొందే వీలు కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నారన్నారు. రుణాల రీషెడ్యూలింగ్‌పై ఆర్బీఐ సైతం ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని బ్యాంకులు రైతులకు, డ్వాక్రా గ్రూపులకు నోటీసులు పంపి రుణ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎన్నికలు ముగిసి ఏదో విధంగా అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.