కృష్ణకు అటూ ఇటూ..! | Krishna - Guntur two districts to satisfy | Sakshi
Sakshi News home page

కృష్ణకు అటూ ఇటూ..!

Published Thu, Sep 11 2014 1:14 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

కృష్ణకు అటూ ఇటూ..! - Sakshi

కృష్ణకు అటూ ఇటూ..!

రాజధాని నగరానికి భూసేకరణపై సీఎం నిర్దేశం?

కృష్ణా - గుంటూరు రెండు జిల్లాలను సంతృప్తి పరుద్దాం
కృష్ణా నదిని ఆనుకుని 2 జిల్లాలు కలిసేలా భూ సమీకరణకు సర్వే చేయండి
కృష్ణా తీరంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఏర్పాటుకు స్థలం చూడండి
కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో భేటీలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, అచ్చంపేట, కంచికచర్ల, కొండపల్లిలో రాజధాని అంటూ ప్రచారం
అచ్చంపేట పరిసరాల్లో 3,000 ఎకరాలు, గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో
మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నాయన్న నివేదికలు

 
 విజయవాడ బ్యూరో
 ‘రాష్ట్ర రాజధాని విషయంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నాయకులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. మనకు అండగా నిలిచిన ఈ రెండు జిల్లాలను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలను ఆనుకుని కృష్ణా నదికి రెండు వైపులా రాజధాని నిర్మించేలా ఆలోచన చేద్దాం. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న భూములపై మరోసారి సమగ్ర సర్వే చేయించి వీలైనంత త్వరలో నివేదికలు అందించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా మంత్రులు, రెండు జిల్లాల కలెక్టర్లతో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మంగళవారం సీఎంను కలసి రెండు జిల్లాల్లో ప్రభుత్వ, అటవీ భూముల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణానదికి ఇరువైపులా భూసేకరణ కోసం సర్వే నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సీఎం సంకేతాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని అమరావతి, అచ్చంపేట, మంగళగిరి, కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల దిశగా రాష్ట్ర రాజధాని నిర్మాణం సాగే అవకాశముందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (నిడ్) ఏర్పాటు కోసం కృష్ణా నదీ తీరం వెంటే 50 నుంచి 60 ఎకరాల భూమి ఒకే చోట ఉండే స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు రఘునందనరావు, కాంతిలాల్ దండేలను ఆదేశించినట్లు తెలియవచ్చింది.

ఆ ప్రాంతం అనువైనదేనన్న నివేదికలు...

ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచి చెప్తున్న విధంగా కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యలోనే రాజధాని ఏర్పాటు చేయడానికి అమరావతి, అచ్చంపేట ప్రాంతాలు అనువైనవిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా నది మీదుగా రెండు కిలోమీటర్ల దూరం హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తే గుంటూరు - కృష్ణా జిల్లాలను కలిపేయవచ్చని ప్రభుత్వం భావి స్తున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వ, అటవీ భూముల వివరాలు, నీటి లభ్యత, 9వ జాతీయ రహదారికి అనుసంధాన దూరం, గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గం వివరాల గురించి గుంటూరు, కృష్ణా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంది. అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో 3,000 ఎకరాలకు పైగా, కృష్ణా జిల్లాలోని గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు చెప్తున్నారు. ఈ ప్రాంతానికి పులిచింతల ప్రాజెక్టు నుంచి గానీ, కృష్ణా నది నుంచి గానీ నీటిని సులువుగా తీసుకురావచ్చని.. రైతుల నుంచి భూములు సేకరించాల్సి వచ్చినా తక్కువ ధరకు లేదా 60 : 40 ప్రాతిపదికన సులువుగా భూ సేకరణ చేయొచ్చని అధికార వర్గాలు నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అచ్చంపేట నుంచి గన్నవరం విమానాశ్రయం 95 కిలోమీటర్లు, నందిగామ 30 కి.మీ, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, మంగళగిరి, అమరావతి, నరసారావుపేట పట్టణాలు 50 కి.మీ. దూరంలోనే ఉంటాయని వివరించారని సమాచారం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement