కారాగారం.. మృత్యు కుహరం | 31 inmates killed in prison this year shifted to Cherlapalli | Sakshi
Sakshi News home page

కారాగారం.. మృత్యు కుహరం

Published Fri, Dec 5 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

కారాగారం.. మృత్యు కుహరం

కారాగారం.. మృత్యు కుహరం

  • ఈ ఏడాదిలో చర్లపల్లి జైల్లో 31 మంది ఖైదీలు మృతి
  •  అందులో సగం మందికి పైగా విచారణ ఖైదీలే..
  •  జైలు ఆస్పత్రిలో వైద్యుల్లేరు.. సిబ్బందీ అంతంతే.. కనీసం అంబులెన్స్‌కు డ్రైవర్ కూడా లేడు
  •  తెలంగాణ జైళ్లన్నింటిలోనూ ఇదే తరహా దుస్థితి..
  •  ‘సాక్షి’ విశ్లేషణలో వెల్లడైన వాస్తవాలు
  • అత్తలూరి అరుణ
    రాష్ట్ర రాజధానిలోని చర్లపల్లి జైలులో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. మానసిక పరివర్తనకు ప్రతిరూపంగా నిలవాల్సిన జైళ్లు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. తప్పు చేసి జైలుకు వచ్చిన వారితో పాటు.. అసలు నేరం చేశారో లేదో తేలకుండానే మరణం పాలవుతున్న కఠోర వాస్తవాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జైళ్లలో మరణాలకు కారణాలను కోరుతూ నివేదిక సమర్పించాలని సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనంతరం కూడా చర్లపల్లి జైలులో ఈ దారుణాలు జరుగుతున్నట్లు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది.

    2014 జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు చర్లపల్లి జైల్లో మొత్తం 31 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా టైస్టులో లేక మరేదో పెద్ద నేరాలు చేసినవారో కాదు. చిన్నా చితకా నేరాలు చేసినవారు, నేరం ఆరోపించబడి వచ్చిన సాధారణ వ్యక్తులు. దొరెవరో దొంగెవరో తేలకుండానే, నేరం రుజువుకాకుండానే అండర్ ట్రయల్‌లో ఉన్న 12 మంది ఖైదీల ప్రాణాలు జైలులోనే గాలిలో కలిసిపోయాయి. ఇక నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న 15 మంది ఖైదీలు సైతం దయనీయ స్థితిలో మరణించారు.

    ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు 23 మంది మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం. ఆ తర్వాత మరో ఎనిమిది మంది చనిపోయారు. ఈ మొత్తం 31 మందిలో కనీసం మూడు పదుల వయస్సు కూడా దాటనివారు ఎక్కువ మంది ఉన్నారు. పాతికేళ్లయినా నిండని యువకులకు నిండా నూరేళ్లు నిండిపోయాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో ఏడుగురు ఖైదీలను మరణించిన తర్వాత వారి మృతదేహాలనే ఆస్పత్రికి చేర్చినట్లు ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. మరో ఏడుగురు ఆస్పత్రిలో చేర్చిన 24 గంటల లోపే మరణించారు. చేరిన 24 గంటల తర్వాత మరణించినవారు తొమ్మిది మంది వరకు ఉన్నారు.

    ‘అసలు ఈ మరణాలకు కారణాలేమిటి? నెలల తరబడి, సంవత్సరాల తరబడి విచారణ ఖైదీలుగా ఉంటూ చిన్న చిన్న కారణాలతో మృత్యువాత పడుతున్న ఖైదీలకు దిక్కెవరు. చేయని తప్పునకు మరణశిక్ష వేస్తున్న ప్రభుత్వ అలసత్వానికి బాధ్యత ఎవరిది?..’ ఖైదీల కుటుంబసభ్యులు, హక్కుల నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది.
     
    చర్లపల్లి జైలులో అసలేం జరుగుతోంది..? ఏడాదిలో 31 మంది ఖైదీల మృతికి కారణాలేమిటనేదానిపై ‘సాక్షి’ విశ్లేషణలో కళ్లు బైర్లుకమ్మే కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 1,500 మంది ఖైదీలున్న చర్లపల్లి జైలులో సెప్టెంబర్ 17 నాటికి ఒక్క డాక్టర్ కూడా లేడు. హఠాత్తుగా ఎవరైనా ఖైదీకి ఏదైనా జరిగితే పట్టించుకునే దిక్కులేదు. ముగ్గురు సివిల్ సర్జన్ల ఖాళీలు అలాగే ఉన్నాయి. కేవలం ఒక దంత వైద్యుడు, ఒక మానసిక వైద్యుడు మాత్రమే చర్లపల్లి జైలు ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం.

    ల్యాబ్ టెక్నీషియన్‌గానీ, పాథాలజిస్ట్‌గానీ లేరు. మేల్ నర్సు పోస్టులు ఆరు ఉండగా.. ఐదుగురు మాత్రమే ఉన్నారు. అత్యవసరంగా ఏ గుండెనొప్పో వస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇక్కడ ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు ఉండాల్సి ఉండగా... కనీసం ఒక్క డ్రైవర్ కూడా లేకపోవడం దారుణమైన విషయం. మరణించిన 31 మందిలో ఎక్కువ మంది హృద్రోగంతోనే చనిపోయినట్లు వైద్యుల నివేదికలు చెబుతున్నాయి.

    ఇక ఏ కాలో చెయ్యో విరిగితే వారిని ఎత్తుకుని వెళ్లడానికి ఆఫీస్ సబార్డినేట్స్ ఇద్దరు ఉండాల్సిన చోట.. ఆ రెండు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. చిన్నా చితకా రోగమొచ్చినా మందిచ్చే నాథుడు లేడు. ఇక పెద్ద జబ్బు చేస్తే పలకరించే వారే  లేరు. పోలీసు అధికారులు తన తండ్రి వద్ద లాక్కున్న ఇన్సులిన్ కిట్ ఇవ్వాలన్నందుకు రూ. 30 వేలు లంచం అడిగారంటూ.. ఇటీవల జైలు గోడల మధ్య షుగర్ స్థాయిలు పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ మరణించిన సంగతుల వెంకటేశ్వర్‌రావు కుమారుడు అమర్‌దాస్ వేసిన కేసు హైకోర్టులో విచారణలో ఉంది.
     
    నిర్లక్ష్యం, అలసత్వం కలగలిసి..

    అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కలిసి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రతి మూడు నెలలకోసారి జిల్లా జడ్జి జైలును సందర్శించాలి. కానీ ఎప్పుడో స్వాతంత్య్ర దినోత్సవం రోజునో, మరో సందర్భంలోనో జెండా ఎగురవేయడానికి తప్ప జిల్లా జడ్జీలు జైళ్లను సందర్శిస్తున్న దాఖలాలు లేవు. జైలు అడ్వయిజరీ కమిటీల నిర్మాణం సంగతి సరే సరి. ఇంతవరకు అటువంటి కమిటీ ఉందా? ఉంటే ఏం చేస్తోంది? అన్నది ప్రశ్నార్థకమే.

    ఒక వైస్ చాన్స్‌లర్, ఒక సామాజిక కార్యకర్త, ఒక సీనియర్ జర్నలిస్టుతో కలిసి జైలు అడ్వయిజరీ కమిటీ ఉంటుంది. కానీ అదేదీ పనిచేస్తున్న పరిస్థితి లేదు. జైళ్లలో ఖైదీల బాగోగులేంటి? అసలు వారంతా బతికే ఉన్నారా? ఇలాంటి అంశాలను తెలుసుకోవడానికి, వివిధ కారణాల వల్ల కోర్టుకు హాజరుపర్చకుండా జైల్లోనే ఉంచుతున్నవారి క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. జడ్జి కోర్టు నుంచి వేస్తున్న క్షేమ సమాచార ప్రశ్నలకు ఖైదీలు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో సమాధానం చెప్పాలి.

    ఇది ప్రతి 40 రోజులకోసారి జరగాలి. కానీ సాంకేతిక లోపాల కారణంగా ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ మూతపడింది. ఈలోగా ఎవరైన మరణిస్తే వారి గురించి అడిగేందుకు ఎవరూ లేరు. కనీసం జైలులో మరణించినవారి కుటుంబసభ్యులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ ప్రభుత్వానికి ఒక సమగ్ర విధానం లేదు. జాతీయ మానవహక్కుల సంస్థ (ఎన్‌హెచ్చార్సీ) ప్రమేయంతోనే తృణమో ఫణమో జైలు మృతుల కుటుంబాలకు దక్కుతోంది. అంతకు మించిన విధానమేదీ అమలులో లేదు. ఇవన్నీ జైళ్ల వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతున్నాయి.

    ఇలా జైళ్లలో జరుగుతున్న మరణాలపై విస్తృతంగా పరిశోధన సాగించాలని మానవ హక్కుల వేదిక భావిస్తోంది. ఆ సంస్థ చేపట్టిన ప్రాథమిక అధ్యయనంలో మరెన్నో దారుణాలు బయటపడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జైళ్లలో మోగుతున్న మృత్యు ఘంటికలను అరికట్టే వరకు ఉద్యమిస్తామని మానవ హక్కుల వేదిక స్పష్టం చేస్తోంది. ఈ మరణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్ కుమార్ డిమాండ్ చేశారు.
     
    మరణించిన వారి వివరాలు..

    చర్లపల్లి జైలులో జనవరిలో 8వ తేదీన మహ్మద్ హబీబ్ (22), 10న కె.శ్రీను (23), 20న ఎ.వెంకటేశ్వర్లు (33), 30న జి.విజయ్‌కుమార్ (66).. ఫిబ్రవరి నెలలో 16వ తేదీన ఎస్.వెంకటేశ్వర్‌రావు (57), 19న డి.సాయికుమార్ (19).. మార్చి నెలలో 23వ తేదీన కె.శివకుమార్ (24).. మే నెలలో 16వ తేదీన బి.సత్యనారాయణ (35), 19న పోలీస్ చంబాసీరెడ్డి (65), 20న ఇ.అయ్యన్న (55), 30న ఐ.కృష్ణయ్య (31).. జూన్ నెలలో 14వ తేదీన యు.రాములు (39), 28న సయ్యద్ అషఫ్ రపాషా (54).. ఆగస్టు నెలలో 5వ తేదీన ఎం.సహదేవ్ (26), 6న సి.హెచ్.నర్సింహ (54), 16న సయ్యద్ సాధిక్ హుస్సేన్ (54), 17న ఎం.వెంకటేశ్ (36), 27న షేక్ అబ్బాస్ అలీ (28), 28న చాంద్ ఖురేషి (22).. సెప్టెంబర్ నెలలో 2వ తేదీన షేక్ మస్తాన్ (35), 4వ తేదీన వి.హరిచందర్ (42), ఎం.రాము (22), 15న కె.మొగిలయ్య (62), 22న జి.నరసింహ... అక్టోబర్ నెలలో 15వ తేదీన షేక్ మస్తాన్, 20న నల్లా దానయ్య (33), 25న సయ్యద్ చాంద్, 27న విద్యాసాగర్, 28న సంజయ్, 31న ముకుల్ పుల్వాన్ (19), నవంబర్ 12వ తేదీన తరియా (39) మరణించారు.
     
    ఎక్కువగా విచారణ ఖైదీలే..

    నేరం రుజువుకాకుండానే, చేయని తప్పుకి ప్రాణాలు కోల్పోతున్న అమాయకుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకూ ఈ మరణాలపై విచారణ జరిగిన దాఖలాలు లేవు. పాత ప్రభుత్వాల సంగతి సరే కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపానపోలేదు. విచారణ ఖైదీలను సమయానికి కోర్టుకు తీసుకెళ్లకపోతుండడంతో.. విచారణలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి జైలు అధికారుల నుంచి వచ్చేది ఎస్కార్ట్ లేదనే సమాధానమే. జిల్లా రిజర్వ్ పోలీసులను రాజకీయ నేతలకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం వల్లనే ఎస్కార్ట్ ఇవ్వలేకపోతున్నామనేది వారి వాదన. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్వేచ్ఛగా గన్‌మెన్ లేకుండా పరిపాలన సాగించాలని మానవ హక్కుల వేదిక కోరుతోంది. అప్పుడైనా ఖైదీల కోసం ఎస్కార్ట్ ఇవ్వగలుగుతారని పేర్కొంటోంది.
     
    క్షమాభిక్ష హక్కును తప్పనిసరి చేయాలి..
     
    ‘‘జైళ్లలో ఖైదీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. మానసిక క్షోభ నుంచి బయటపడేసేందుకు ఖైదీలకు రాజ్యాంగంలో పొందుపరిచిన క్షమాభిక్ష హక్కుని తప్పనిసరి చేయాలి. 2009లో జైల్లోని ఖైదీల ప్రాణాలు కాపాడేందుకు గాంధీ ఆస్పత్రిలో 50 పడకల ఖైదీల వార్డుకు సిబ్బందిని కేటాయించాలని వైఎస్‌ఆర్‌ను కోరాం. ఆ మేరకు అక్కడ ఖైదీలకు వైఎస్ ప్రభుత్వం వైద్య సదుపాయాలను మెరుగుపర్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలి. చర్లపల్లి జైలు ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని నియమించి, సదుపాయాలను మెరుగుపర్చాలి. కేసీఆర్ నిజాంను నిజంగా ఆదర్శంగా తీసుకునేవారైతే.. నిజాం కాలంలో మాదిరిగా రాత్రి, పగలు రెండింటినీ లెక్కలోకి తీసుకుని ఏడేళ్లకే శిక్షను పరిమితం చేయాలి. ఆనాడు లేనట్లే నవ తెలంగాణలో కూడా ఉరిశిక్షను రద్దు చేయాలి..’’
     - జనశక్తి నేత కూర అమర్
     (గతంలో రెండున్నరేళ్ల పాటు చర్లపల్లి జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నారు)
     
    తెలంగాణ వచ్చినా విముక్తేది?

     ‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, టంగుటూరి ప్రకాశం పంతులు హయాంలోనూ జీవిత ఖైదీలను విడుదల చేసిన చరిత్ర ఉంది. కానీ తెలంగాణ కోసం జైల్లో కూడా ఎన్నో ఉద్యమాలు చేసినవారికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టలేదు. జీవిత ఖైదీలంతా ఎంతో ఆశతో తెలంగాణ వస్తే విముక్తి లభిస్తుందని భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోంది. జైల్లో పెట్టే ఆహారం తినడం కన్నా శిక్ష మరొకటి ఉండదేమో! చింత పులుసు చారు, ఉడికీ ఉడకని అన్నం, దానికోసమే తన్నుకునే దారుణమైన పరిస్థితి. 1980లో ముల్లా కమిషన్ చేసిన సిఫార్సులను సవరించి, నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. ఒక్కో ఖైదీకి రూ. 35 ఖర్చు చేయాలి. కానీ 17 రూపాయలే ఖర్చుచేసి మిగిలింది జైలు అధికారులు మింగేస్తున్నారు..’’
      మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్
     (గతంలో ఐదున్నరేళ్లు చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్నారు)  

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement