- కొలుసు పార్థసారథి
శేరినరసన్నపాలెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరించి రైతులకు న్యాయం చేస్తామంటూ మోసపూరిత ప్రకటనలు చేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైఎస్సార్‌సీపీ దక్షిణ కృష్ణా కన్వీనర్ కొలుసు పార్థసారథి విమర్శించారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం లో జెడ్పీటీసీ కైలే జ్ఞానమణి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూసేకరణలో కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలను అమలు చేస్తే రైతులకు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని.. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నారు.
రైతులకు రంగుల కలలు చూపిస్తున్నారు...
సింగపూర్, మలేషియా తరహాలో అభివృద్ధి చేస్తామంటూ రైతుకు రంగుల కలలు చూపిస్తోందని సారథి విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో 4500 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని ఉందని, నూతన రాజధాని ఏర్పాటుకు లక్ష ఎకరాలు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల ప్రకటనలు ఇవ్వడం వారికి ఎలాంటి ప్రణాళికా లేదని తెలియజేస్తోందన్నారు. రాజధాని ఏర్పాటుకు, ఏ శాఖకు ఎంత భూమి కావాలనేదానిపై ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 18,500 ఎకరాల రెవెన్యూ, అటవీ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి రాజధాని ఏర్పాటుకు కేటాయిస్తే భూసేకరణ అవసరం లేదని సారథి అన్నారు. టీడీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను ఏమారుస్తూ ఎన్నికల హామీలు తుంగలో తొక్కుతోందని విమర్శించారు.
ఓట్లు దండుకుని.. రోడ్డున పడేశారు
రైతు, డ్వాక్రా రుణాలు చెల్లించొద్దని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకుని, ఇప్పుడు రుణాలు రద్దు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలను రోడ్డున పడేశారని సారథి మండిపడ్డారు. గతేడాది ఖరీఫ్ రైతులకు బ్యాంకర్లు రూ.1,350 కోట్ల వ్యవసాయ రుణాలివ్వగా, ఈ ఏడాది ఇప్పటికి రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది రూ.1,050 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. పార్టీ వైద్యవిభాగం కన్వీనర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే ప్రజల పక్షాన నవంబర్ 16న మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. జెడ్పీటీసీ జ్ఞానమణి తదితరులు పాల్గొన్నారు.