మద్దతు ధరతో ధాన్యం కొనాలి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్దతు ధరతోనే రైతుల వద్ద నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014-15 సీజన్ ప్రారంభమైందని, తెలంగాణ ప్రభుత్వం నూతన మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేపడుతుందని తెలిపారు. బియ్యం ఏ గ్రేడ్ ధర క్వింటాల్‌కు రూ.1,400, బీ గ్రేడ్ ధర క్వింటాల్‌కు రూ.1,360, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1310 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైస్‌మిల్లర్లకు సీఎమ్మార్ చార్జీలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మార్కెట్‌యార్డుల్లో కావాల్సిన పరికరాల కొనుగోలుకు రూ.6 కోట్ల 40 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని, జిల్లాకు రూ.80 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. యార్డుల్లో సౌకర్యాలు, కాంటాలు, ఎలక్ట్రానిక్ మిషన్ల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించాలని సూచించారు.ఉపయోగించాలని న్నారు. రాష్ట్రంలో పండించిన సూపర్ క్వాలిటీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయరాదన్నారు. పత్తి, మొక్కజొన్న మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోలు చేయాలన్నారు.
31 వేల మెట్రిక్ టన్నుల అంచనా
కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ, ఈ ఏడాది 31 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలుకు అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో 179 కేంద్రాల్లో కొనుగోళ్ల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సీసీఐ ద్వారా ఈ నెల 20 నుంచి పత్తి కొనుగోళ్లు చేపడుతున్నామని, జిన్నింగ్ మిల్లులకు రెండు రోజుల పాటు పవర్ హాలీడే లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 284 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. డీఎస్వో వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎం ఆనంద్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.