జయతో భేటీకి సిద్ధం
టీనగర్: మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని సీనియర్ నేతగా భావించి కలుసుకున్నానని ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. త్వరలో వామపక్ష నేతలు శంకరయ్య, నల్లకన్నుతోపాటు రాందాస్, వైగో, విజయకాంత్, తిరుమావళవన్లను కలిసి ఆశీస్సులందుకోనున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా కలుసుకునేందుకు సిద్ధం గా వున్నట్లు తెలిపారు. అయితే, ఆమె అనుమతి ఇస్తారా? అనే విషయం తెలియలేదన్నారు.
అనుమతి లభించిన వెంటనే ఆమెను కలిసి మాట్లాడుతానని తెలిపారు. మంగళవారం నుంచి తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో పర్యటించనున్నానని, ఆ తర్వాత నాగపట్నం, శివగంగై, పుదుక్కోట్టై, కోయంబత్తూరు, తిరుపూరు, మదురై, రామనాధపురం జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. కాంగ్రెస్ నుంచి వైదొలగిన వారి గురించి బెంగలేదని, వారి గురించి ఇకపై వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రంగభాష్యం, హార్బర్ రవిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస మూర్తి, దేవరాజ్, దీనా, ఏలుమలై, గార్డెన్ కృష్ణమూర్తి, కుళత్తూరు సాలమన్, సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు.