ప్రభుత్వ డేటాకు మరింత భద్రత
సాక్షి, అమరావతి: సైబర్ సెక్యూరిటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ–గవర్నెన్స్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్సైట్లు, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్)కు బదలాయించడమే కాకుండా సొంతంగా స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.153.06 కోట్లతో ఏపీటీఎస్ రెండు చోట్ల ఎస్‌డీసీలను ఏర్పాటు చేస్తోంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.83.4 కోట్ల వ్యయంతో విశాఖలో ప్రైమరీ సైట్‌ను, దీనికి అనుబంధంగా కడపలో రూ.69.67 కోట్లతో డిజాస్టర్ రికవరీ సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశామని, ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏడాదిలోగా ఈ ఎస్డీసీని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వమే సొంతంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా డేటా భద్రతతో పాటు నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం డేటా నిర్వహణకు ప్రైవేటు సంస్థ నుంచి క్లౌడ్ సర్వీసులు వినియోగించుకుంటే ఐదేళ్ల కాలానికి రూ.795 కోట్ల వరకు వ్యయం అవుతుండగా, అదే ఎస్డీసీ ద్వారా ఈ వ్యయాన్ని రూ.570 కోట్లకు పరిమితం చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మార్చిలోగా ఎస్డీసీలోకి..
డేటా భద్రతకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న అప్లికేషన్లను ఏపీఎస్డీసీలోకి మార్చి 31లోగా బదలాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 32కు పైగా ప్రభుత్వ విభాగాలు ఈ గవర్నెన్స్‌లో భాగంగా బయట సంస్థలు అభివృద్ధి చేసిన అప్లికేషన్లు, హోస్టింగ్ డేటా వినియోగించుకుంటున్నట్లు ఏపీటీఎస్ గుర్తించింది. ఈ అప్లికేషన్లకు సంబంధించి సెక్యూరిటీ ఆడిటింగ్ చేసి, మార్చి 31లోగా ఎపీఎస్డీసీలోకి మార్చనున్నారు. అలాగే ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న ఐటీ అప్లికేషన్లు, వెబ్సైట్లు, యాప్‌ల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను కూడా జారీ చేసింది.