the state Department of Education
-
పదవ తరగతి సిలబస్ లో మార్పు
చెన్నూర్, న్యూస్‌లైన్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యాప్రమాణాలు పెంచాలని, దానికి తగ్గట్టుగానే పరీక్ష విధానాల్లోనూ మార్పులు తీసుకురావాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతిలోని అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తిగా మార్చేశారు. కొత్తకొత్త అంశాలను పొందుపర్చారు. గతంలో 11 పేపర్లు ఉన్న పదో తరగతి పరీక్షలను 9 పేపర్లకు కుదించనున్నారు. ప్రతీ పేపర్‌కు 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయించాలని నిర్ణయించారు. గతంలో హిందీ పేపరు తప్ప మిగిలిన ఐదు సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉండేవి. ఈ సంవత్సరం మూడు లాంగ్వేజీ సబ్జెక్టులకు (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) ఒక్కో పేపర్ చొప్పున, సైన్స్, సోషల్, గణితం సబ్జెక్టులకు రెండేసి పేపర్ల చొప్పున కుదించారు. 80 మార్కులకు నిర్వహించే పరీక్షలో 28 మార్కులు, ఇంటర్నల్‌లో కనీసం 7 మార్కులు మొత్తం 35 మార్కులు వస్తేనే ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. దీంతోపాటు హిందీలో 21 మార్కుల ఉత్తీర్ణత స్థాయిని 35 మార్కులకు పెంచేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. ఈ విధానాన్ని విద్యార్థులకు అలవాటు చేసేందుకు 9వ తరగతి పరీక్ష విధానంలోనూ ఈ పద్ధతి ప్రవేశపెట్టాలని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. శిక్షణ ఏదీ..? మరో నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు అవసరం. అయితే అందుకు అనుగుణంగా బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాత సిలబస్ సబ్జెక్టులు చెప్పడానికి అలవాటు పడిన త మకు కొత్త సిలబస్ బోధించాలంటే తిప్ప లు తప్పవని కొందరు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గతంలో సిలబస్ మారితే శిక్షణ ఇచ్చి బోధనలో మెలకువలు చెప్పేవారని, ఇప్పుడు పదో తరగతిలో అన్ని సబ్జెక్టులు ఒకేసారి మార్చడం.. అందులో కొత్త అంశాలను చేర్చడంతో వాటిని ఎలా బోధించాలో తెలియడంలేదని ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పరీక్ష విధానంలో మార్పులు.. మరోవైపు సిలబస్‌లో మార్పులతో 2014-15 విద్యా సంవత్సరంలో పదో తరగతి బోధన అంత సులువు కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. వేసవి సెలవుల్లోనే శిక్షణ ఇస్తే విద్యార్థులుకు మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. -
ఎప్పటికయ్యెన్?
=హైకోర్టు ఆదేశాలు పట్టని విద్యాశాఖ =ఖరారుకాని నాన్‌లోకల్ టీచర్ల జాబితా =610 జీఓ అమలులో తాత్సారం =తుది లెక్కలు తేల్చని విద్యా శాఖ సాక్షి ప్రతినిధి, వరంగల్ : స్థానికేతర ఉద్యోగులను గుర్తించి నివేదిక తయారు చేయడంలో జిల్లా విద్యా శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం స్థానికేతర ఉపాధ్యాయుల జాబితా రూపొందించాలని రాష్ట్ర విద్యా శాఖ ఆదేశించి రెండు నెలలు గడుస్తున్నా... జిల్లా అధికారులు మాత్రం ఇప్పటికీ తుది జాబితాను వెల్లడించడం లేదు. ప్రాథమిక నివేదిక ప్రకారం జిల్లాలో 163 మంది ఉపాధ్యాయులు స్థానికేతరులు ఉన్నట్లు సమాచారం. వీరి సర్వీసు అంశాలను మరోసారి పరిశీలించి తుది జాబితాను రూపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి 2001 వరకు నిర్వహించిన ప్రక్రియల్లో 70 శాతం స్థానికులకు, 30 శాతం మెరిట్ కోటా ఉండేంది. 2001 జూన్ తర్వాత స్థానికుల కోటా 80 శాతంగా పెంచారు. మిగిలిన 20 శాతాన్ని మెరిట్ కోటాగా నిర్ధారించారు. మెరిట్ కోటాలో స్థానికేతరులు నియమితులయ్యారు. ఇలాంటి నియామకాలపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా మెరిట్ కోటాలో నియమితులైన స్థానికేతరులను సొంత జిల్లాలకు పంపించి స్థానికులకు అవకాశమివ్వాలనే డిమాండ్ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం 2007లో 610, ఇతర అనుబంధ జీఓలు జారీ చేసింది. మెరిట్ కోటా స్ఫూర్తికి విరుద్ధంగా నియమితులైన స్థానికేతరులను సొంత జిల్లాలకు పంపించాలని ఆదేశించింది. దీని కోసం అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించింది. 610 జీఓ అమలుపై కొందరు ఉద్యోగులు ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసేలా స్టే ఇవ్వాలని కోరారు. వీరి పిటిషన్లను పరిశీలించిన ట్రిబ్యునల్ బదిలీలపై స్టే విధించింది. ట్రిబ్యునల్ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 610 జీఓ అమలుకు ట్రిబ్యునల్ తీర్పు ఇబ్బందిగా ఉందని... తొలగించాలని పేర్కొంది. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు 610 జీఓ అమలుపై ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ఉత్వర్వులను తొలగిస్తూ తీర్పు ప్రకటించింది. స్థానికేతరులను వారి సొంత జిల్లాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అన్ని శాఖలు ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. విద్యా శాఖలోని స్థానికేతర ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఐదో తేదీన ప్రత్యేక మెమో జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యా శాఖ అన్ని జిల్లాలకు గత నెల ఏడున ప్రొసీడింగ్ ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాలు స్థానికేతర ఉపాధ్యాయుల జాబితాలను రూపొందించడం ప్రాంభించాయి. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ ముగిసినప్పటికీ... మన జిల్లాలో మాత్రం పూర్తికాకపోవడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యా శాఖ తీరును తప్పుబడుతున్నాయి.