ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈసారి వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు ప్ర భుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జీవోనం.456 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో ఎలాంటి పనులు చేపట్టాలో స్పష్టం చేస్తూ పర్యాటక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందు కు సంబంధిత విభాగాలు సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని, ముఖ్య పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు పండగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని యువజనోభ్యుదయం, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.
బతుకమ్మ గీతాలు వినిపించేందుకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని, ముఖ్య కూడళ్లను బతుకమ్మ ను ప్రతిఫలించేలా పూలు, బెలూన్లతో అలంకరిం చాలని, వేడుకల్లో స్వయం సహాయక బృందాల కూ భాగస్వామ్యం కల్పించాలన్నారు. పోలీసుల తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, బతుకమ్మల్లో ఉత్తమ అలంకరణలకు బహుమతులు ప్రదానం చేయాలని, ప్రతి జిల్లా నుంచి కొందరిని ఎంపిక చేసి హైదరాబాద్లో జరిగే ప్రధాన (చద్దుల బతుకమ్మ) వేడుకలకు పంపాలని సూచించారు.