state of the future
-
ఆత్మగౌరవమంటే బాబుకు తెలుసా?
మైలవరం, న్యూస్‌లైన్ : తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ.. నేడు ఆత్మగౌరవం లేని చంద్రబాబునాయుడి నాయకత్వంలో ఉండడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ మైలవరం సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు చెప్పారు. సోమవారం ఆయన న్యూస్‌లైన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన స్వప్రయోజనాల కోసం పార్టీ పరువును, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టిన చంద్రబాబు ఆత్మగౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సమైక్యవాదానికి మద్దతు ప్రకటించడాన్ని గమనిస్తే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన ఫొటోకు దండం పెట్టిన చరిత్ర గుర్తుకొస్తుందన్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు హైటెక్ పాలనంటూ ఖజానా సొమ్మం అంతా హైదరాబాద్‌లో ఫ్లయ్‌ఓవర్ల నిర్మాణాలు, హైటెక్ భవన నిర్మాణాలకు ఖర్చుచేసి, ఇప్పుడు సీమాంధ్రకు అన్యాయం జరిగిందని మొసలికన్నీరు కార్చడమెందుకో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నిర్ణయ ప్రకటన రాగానే కొత్త రాజధాని నిర్మాణం కోసం రూ. నాలుగు లక్షల కోట్లు కేటాయించాలని కోరి చంద్రబాబు అసలు నైజాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఇచ్చిన లేఖను బాబు వెనక్కితీసుకున్న తర్వాతే సీమాంధ్రలో పర్యటించాలని జ్యేష్ఠ డిమాండ్ చేశారు. అసలు లేఖ ఎందుకు ఇచ్చిందీ, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలని ఎందుకు అడిగిందీ, విభజన ప్రకటన చేసిన తర్వాత కూడా నోరు మెదపకుండా నెల రోజులకు పైగా ఇంట్లోనే ఎందుకు ఉన్నదీ, అలాగే ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబును జ్యేష్ఠ డిమాండ్ చేశారు. -
బాబు చీకటి ఒప్పందాల వల్లే విభజన
గాంధీనగర్, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న చీకటి ఒప్పందాల ఫలితంగానే రాష్ర్ట విభజన ప్రకటన వెలువడిందని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు చెప్పారు. సీతారామపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని పేర్కొన్నారు. రెండు కళ్ల విధానమంటూ ప్రకటనలు చేస్తూ వచ్చిన చంద్రబాబు తనపై సీబీఐ దాడులు జరగకుండా చూసుకునేందుకు విభజనకు తలొగ్గారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీతోనే అంటకాగుతోందని విమర్శించారు. జూలై 30వ తేదీన రాష్ట్ర విభజన ప్రకటన వెలువడడానికి సరిగ్గా మూడు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో చంద్రబాబు రహస్య చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఆ చర్చల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు భరోసా ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన సాధ్యమైందని ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడానికి కారణాలేమిటో స్పష్టం చేయాలన్నారు. ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం వేడెక్కడంతో చేసేది లేక చంద్రబాబు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో డ్రామాలాడిస్తున్నారని రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చంద్రబాబు ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరి ఏమిటో ఇప్పటికైనా స్పష్టం చేయాలని డిమాండ్‌చేశారు. విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుంది రాష్ట్ర విభజన జరిగితే కృష్ణాడెల్టా మునుపెన్నడూ లేనివిధంగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. జూలై మొదటి వారంలోనే డెల్టాకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ అతీగతీలేదన్నారు. కృష్ణాజలాలపై ప్రథమ వినియోగహక్కు డెల్టాకు మాత్రమే ఉందని, దానిని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే కృష్ణాడెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాల్లో వరిపైరు ఎండిపోతోందన్నారు. ఎగువన ఉన్న తెలంగాణ ప్రాంత నాయకులు అడ్డగోలుగా నీటిని వినియోగించుకుంటున్నారని, దీని వలన దిగువన ఉన్న డెల్టా ప్రాంత హక్కులు హరించుకుపోతున్నాయన్నారు. సాగునీరందక ఆయకట్టు చివర ఉన్న లక్షల ఎకరాలు బీడుగా మారే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణకు చెందిన కడియం శ్రీహరి 2003లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సెప్టెంబర్ నెలాఖరు వరకు డెల్టాకు నీటిని విడుదల చేయలేదని గుర్తుచేశారు. అప్పటి పరిస్థితులే నేడు డెల్టాలో దర్శనమిస్తున్నాయన్నారు. ఒక మంత్రి ఉంటేనే డెల్టాకు ఇంతటి అన్యాయం చేస్తుంటే ఇక రాష్ట్ర విభజన జరిగితే దక్షిణ భారత ధాన్యాగారం ఎడారికాక తప్పదన్నారు. ఎగువ రాష్ట్రాలనుంచి మనరాష్ట్రానికి 811 టీఎంసీల నీరు విడుదల కావాల్సి ఉండగా కేవలం 125 టీఎంసీలు మాత్రమే విడుదల అవుతోందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా, గోదావరి డెల్టా ఎడారిగా మారుతుందన్నారు. హరితాంధ్రప్రదేశ్‌ను కోరుకునే వారంతా రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.