‘ఐటీ’పై తీర్పును సవరించండి
* ‘టీఎస్ బీసీఎల్’ అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్
* మా నుంచి బకాయిలు వసూలు చేసుకోవచ్చని తీర్పులో పేర్కొన్నారు
* పొరపాటుగా పేర్కొంటే ఐటీశాఖ రూ.1,274 కోట్లు తీసేసుకుంది
* ఆ వ్యాజ్యంలో మేం ప్రతివాది కాదు.. మా వాదనలూ వినలేదని వెల్లడి
* నోటీసులివ్వకుండానే నిధులు తీసుకున్న వైనంపై కోర్టు ధిక్కార పిటిషన్
* కౌంటర్లు దాఖలు చేయాలని ఐటీశాఖకు ధర్మాసనం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) ఆస్తుల జప్తుకోసం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇచ్చిన నోటీసులను కొట్టివేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాది కాదని, అయినా ప్రభుత్వం నుంచి ఐటీశాఖ బకాయిలు వసూలు చేసుకోవచ్చంటూ ఆ తీర్పులో పేర్కొన్నారని తెలిపింది. ధర్మాసనం పొరపాటుగా పేర్కొన్న ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఐటీశాఖ రిజర్వుబ్యాంకులోని తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి రూ.1,274.21 కోట్లను బకాయిల కింద తీసేసుకుందని, కనీస సమాచారం కూడా ఇవ్వలేదని హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును సవరించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదాయపన్ను శాఖను ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం..
తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. బకాయిల కింద టీఎస్‌బీసీఎల్ ఆస్తుల జప్తు కోసం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇచ్చిన నోటీసులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. దానిపై మే 1న తీర్పునిచ్చిన ధర్మాసనం.. ఐటీ శాఖ నోటీసులను కొట్టివేసిందనితెలిపారు. ఆ వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాది కాదని, తమ వాదనలను కూడా వినలేదని.. అయినా తెలంగాణ ప్రభుత్వం నుంచి బకాయిలను వసూలు చేసుకోవచ్చునని తీర్పులో పేర్కొన్నదని చెప్పారు.
ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని, దానిని సవరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బకాయిలను వసూలు చేసుకోవచ్చనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే ఆర్బీఐలోని తెలంగాణ ఖాతా నుంచి రూ.1,274 కోట్లను ఐటీ శాఖ తీసేసుకుందని ఏజీ కోర్టుకు విన్నవించారు. అసలు ఐటీ శాఖ పన్ను మదించే నాటికి టీఎస్‌బీసీఎల్ లేనేలేదని... ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) ఆస్తులు, అప్పుల విభజన కూడా పూర్తి కాలేదని తెలిపారు. అయినా తెలంగాణ వంతు బకాయిలు రూ.1,274 కోట్లంటూ ఐటీ శాఖ ఎలా నిర్ణయానికి వచ్చిందో అర్థం కాకుండా ఉందని పేర్కొన్నారు.
అది చిన్న మొత్తం కాదు..
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బకాయిలు వసూలు చేసే ముందు నోటీసులు జారీచేశారా. లేదా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వలేదని ఏజీ చెప్పగా, ఇచ్చామని ఐటీ శాఖ తరఫు న్యాయవాది జె.వి.ప్రసాద్ చెప్పారు. దీంతో.. ‘‘మీరు తీసుకున్నది చిన్న మొత్తం కాదు. రూ.1,200 కోట్లు. ఇంత మొత్తం తీసేసుకున్న తరువాత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో? జీతాలు చెల్లించే పరిస్థితి ఉందో, లేదో? మీది (ఐటీశాఖ) కేంద్ర ప్రభుత్వం. వీరిది రాష్ట్ర ప్రభుత్వం.
ఇద్దరూ అన్నదమ్ములు. ఇలా తగవుపడుతుంటే ఎలా? ఈ వివాదానికి ఓ సామరస్యపూర్వక పరిష్కారం చూడాల్సిన అవసరముంది. మీ (ఐటీశాఖ) చర్యల ద్వారా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ఆలోచించారా.. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే. అందులో సందేహం లేదు. అయినా తీర్పులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అని ఉంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రమే ఎందుకు బకాయిలు వసూలు చేసినట్లు..?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వీటన్నింటినీ సమాధానమిస్తామని, రెండు వారాల గడువు ఇవ్వాలని జె.వి.ప్రసాద్ కోరగా.. విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.
కోర్టు ధిక్కార పిటిషన్ కూడా..
నోటీసులివ్వకుండానే రిజర్వుబ్యాంకు నుంచి ఐటీశాఖ నిధులు తీసేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 226 ప్రకారం నోటీసు జారీ చేశాకే బకాయిల వసూలు ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఐటీ శాఖ వ్యవహరించిందని అందులో కోర్టుకు నివేదించింది. దీనిపైనా కౌంటర్ దాఖలు చేయాలని ఐటీ శాఖను ధర్మాసనం ఆదేశించింది.