State Municipal Department
-
నేటి నుంచి విశాఖలో త్రిసభ్య కమిటీ పర్యటన
విశాఖపట్నం: నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీ, రాజధాని వసతులు, సౌకర్యాల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బృందం సోమవారం నుంచి విశాఖలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. విశాఖలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో రుషికొండలోని ఐటీ హిల్స్‌లో ఏర్పాట్లను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌లతో ఓ బృందాన్ని నియమించిందని ఈ కమిటీ ఇప్పటికే పని ప్రారంభించిందనీ.. క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుందని తెలిపారు. -
71 కాదు 68 మున్సిపాలిటీలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 68 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. 71 కొత్త పురపాలికల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించినప్పటికీ చివరి క్షణంలో మూడు మున్సిపాలిటీల విషయంలో వెనక్కి తగ్గింది. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 71 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కోసం రాష్ట్ర పురపాలక శాఖ చట్టాల సవరణ కోసం బిల్లును ప్రవేశపెట్టగా, ఆ మేరకు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయని అన్ని పత్రికల్లో కథనాలొచ్చాయి. అయితే, ఈ బిల్లును ఆమోదించడానికి ముందు.. చివరి క్షణంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోనే మూడు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 13 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు తొలుత బిల్లులో ప్రతిపాదించగా, ఆ తర్వాత ఆ జాబితా నుంచి మూడు మున్సిపాలిటీల పేర్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో 68 కొత్త పురపాలికల ఏర్పాటుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. అయితే, చివరి క్షణంలో ఈ బిల్లులో జరిపిన ఈ మార్పుల వివరాలను ప్రభుత్వం శాసనసభలో మీడియాకు అందజేయకపోవడంతో కొత్తగా 71 పురపాలికలు ఏర్పాటు కానున్నాయని ప్రచారం జరిగింది. బిల్లుకు అసెంబ్లీ, గరవ్నర్‌ల ఆమోదం లభించిన తర్వాత పురపాలక శాఖ చట్టాల సవరణలు జరుపుతూ ఆ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో 68 కొత్త పురపాలికల జాబితా మాత్రమే ఉండటంతో ఈ విషయం బయటపడింది. ఈ ఉత్తర్వులను జీవోల వెబ్సైట్లో పొందపర్చకపోవడంతో ఈ విషయం వెలుగులోకి రావడానికి ఆలస్యమైంది. ఆమోదానికి ముందే సవరణలు: శాసనసభ కార్యదర్శి శాసనసభలో బిల్లును ఆమోదించడానికి ముందు సవరణలు జరిపామని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ధ్రువీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, నిజాంపేట, కొంపల్లి, దుండిగల్ కొత్త పురపాలికలుగా ఏర్పాటు కానుండగా, బాచుపల్లి, ప్రగతినగర్, బౌరాంపేట్‌లను పురపాలికలుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలను ప్రభుత్వం విరమించుకుంది. -
హైదరాబాద్‌లో అడుక్కుంటూ కనిపిస్తే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యాచకులను నిర్బంధించి జైళ్ల శాఖ పరిధిలోని ప్రత్యేక గృహాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చంచల్‌గూడ కేంద్ర కారాగారం వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్ హోంను పురుష యాచకుల కోసం, చర్లపల్లి కేంద్ర కారాగారం పక్కన ఉన్న భవనాన్ని మహిళా యాచకుల కోసం వర్క్ హౌస్ కమ్ స్పెషల్ హౌస్‌గా ఉపయోగించనుంది. ఏపీ యాచకుల నిర్మూలన చట్టం–1977 కింద ఈ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాంకా ట్రంప్‌తో పాటు 1,500 మంది బిగ్షాట్స్.. వచ్చే నెల 28 నుంచి 30 వరకు హెచ్ఐఐసీలో జరగనున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు హాజరుకానున్నారు. కాగా ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీల కంటికి నగరంలోని యాచకులు కనిపించకుండా ఏరాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుష, మహిళా యాచకుల కోసం వేర్వేరుగా నిర్వహించే ఈ హోమ్‌ల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర జైళ్లశాఖకే అప్పగించింది. చంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్స్‌పాల్‌ను పురుష యాచకుల వర్క్‌హోంకు సూపరింటెండెంట్‌గా, చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ సూపరింటెండెంట్‌ను మహిళా యాచకుల వర్క్ హోంకు సూపరింటెండెంట్‌గా నియమించింది. -
‘పాము’ బంధువు లాకర్లో బంగారం గుట్టలు
1,400 గ్రాములు స్వాధీనం జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి): రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావు సమీప బంధువుకు చెందిన బ్యాంకు లాకర్‌ను తెరవగా 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. పాండురంగారావుకు సమీప బంధువు, చిన్నపిల్లల వైద్యుడైన కృష్ణ మూర్తి భార్య ఎన్.రాజ్యలక్ష్మి పేరున జంగారెడ్డిగూడెంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో లాకర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. మంగళవారం లాకర్‌ను తెరిచి చూడగా 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 23న కృష్ణమూర్తి ఇళ్లు, ఆస్పత్రిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. -
కొత్త ఇంట్లో ఇంకుడుగుంత తప్పనిసరి!
గ్రేటర్‌తో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో అమలుకు రాష్ట్రప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: మీరు కొత్త ఇంటిని నిర్మిస్తున్నారా? ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లు, అంతకు మించి ఉంటుందా? అయితే.. మీరు నిర్మించుకునే ఇంట్లో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాల్సిందే. 300 చదరపు మీటర్లకు మించిన ప్లాట్లలో ఇంటిని నిర్మిస్తేనే ఇంకుడుగుంతను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అమలులో ఉన్న భవన నిర్మాణ నిబంధనలు పేర్కొంటున్నాయి. తాజాగా ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లు, అంతకు మించినా ఇంకుడుగుంత నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు భవన నిర్మాణ నియమావళి (జీవో 168)కి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోను పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర 73 నగర, పురపాలక సంస్థల పరిధిలో ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంత లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు ప్లాట్ విస్తీర్ణం 100-300 చదరపు మీటర్ల మధ్య ఉంటే కనీసం 1 మీటర్ ఁ1 మీటర్ వైశాల్యంలో ఇంకుడుగుంతను నిర్మించుకోవాల్సిందే. ప్లాట్ విస్తీర్ణం 300 మీటర్లకు మించితే జీవో 168లో నిర్దేశించిన వైశాల్యంతో ఇంకుడుగుంతలను నిర్మించాలని ప్రభుత్వం కోరింది. ఇంకుడుగుంత లేకుండా ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని ఆంక్షలు విధించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో జనాభా శరవేగంగా పెరిగిపోతోంది. దీంతో భూగర్భ జలాల వినియోగం పెరిగిపోతుండగా.. వర్షపు నీటి సంరక్షణ చర్యలు లేక భూగర్భ జలాలు వృద్ధి కావడం లేదు. ఈ నేపథ్యంలో 100 చదరపు మీటర్లు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లలో ఇంకుడుగుంతను తప్పనిసరి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రతిపాదనలు సమర్పించగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.