రాష్ట్ర పోలీసు శాఖకు ఇకపై యూనిఫారానికి బదులుగా డబ్బులు
సాక్షి, ముంబై: రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఇకనుంచి యూనిఫారానికి బదులుగా డబ్బులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో కానిస్టేబుల్ మొదలుకొని ఇన్స్పెక్టర్ స్థాయి వరకు దాదాపు 1.88 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ రెండేళ్లకు ఒకసారి ప్రభుత్వం యూనిఫారాలు(జత) అందజేస్తోంది. ఇక నుంచి యూనిఫారం అందజేయకుండా ఒకేసారి రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు నగదును అందజేయాలని నిర్ణయించారు.
ఇదివరకు పోలీసులకు డీజీపీ ద్వారా నియమించిన సంబంధిత కాంట్రాక్టర్ సరఫరా చేసిన యూనిఫారాలు లభించేవి. అందుకు ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు వెచ్చించేది. కాని వాటిని సరఫరాచేస్తున్న కాంట్రాక్టర్లు పారదర్శకత పాటించినప్పటికీ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత పాటించడం లేదని, వాటి కొనుగోలులో అవకతవకలు, అక్రమాలు జరిగాయనే కథనాలు మీడియాలో ప్రసారమవుతున్నాయి. దీంతో వీటికి చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూనిఫారానికి అయ్యే మొత్తం ఖర్చును రెండేళ్లకోసారి అందజేయాలని నిర్ణయించింది.
ఇదిలాఉండగా ఎండనకా, వాననకా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తరచూ వారాంతపు సెలవు కూడా రద్దు కావడం, అదనపు గంటలు పనిచేయాల్సి రావడం, దర్యాప్తు పనుల మీద సుదూర ప్రయాణాలు చేయడం వల్ల ఒంటిపైనే యూనిఫారం ఎక్కువ సమయం ఉంటోంది. దీంతో అది తొందరగా పాడవుతోందని, సంవత్సరానికి ఒకసారి డబ్బులు అందజేయాలని పోలీసుశాఖ కోరుతోంది. అయితే నిధుల కొరత వల్ల రెండేళ్లకు ఒకసారి మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పోలీసు శాఖలో పురుష, మహిళా కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది, స్టేట్ రిజర్వుడు పోలీసు దళం, ట్రాఫిక్ శాఖ, అల్లర్ల నియంత్రణ బృందం, నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఇలా వారు ధరించే వేర్వేరు యూనిఫారాన్ని బట్టి రెండేళ్లకు ఒకసారి రూ. 5వేల నుంచి రూ. 8 వేల వరకు చెల్లించాలని నిర్ణయించామని, అందుకు ఆర్థికశాఖ నుంచి కూడా ఆమోదముద్ర పడిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.