పర్యాటక శాఖ సహకరిస్తే మెరుగైన సేవలు
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర పర్యాటక శాఖ తమకు తగిన సహకారం అందిస్తే కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలను చూడటానికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించడానికి వీలువుతుందని బెంగళూరు డివిజినల్ రైల్వే మేనేజర్ (డీజీఎం) పేర్కొన్నారు. 2013-14 ఏడాదికి బెంగళూరు రైల్వే స్టేషన్ ‘ఉత్తమ పర్యాటక స్నేహ రైల్వే స్టేషన్‌గా పురస్కారాన్ని అందుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను డీజీఎం తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు వివరించారు.
తమ ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా తమిళనాడు పర్యాటక శాఖ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం అటువంటి చర్యలేవీ చేపట్టడం లేదన్నారు. ఆ శాఖ తమకు సహకారం అందిస్తే కర్ణాటకకు మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం కల్పిస్తామని అనిల్‌కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. బెంగళూరు సిటీ, యశ్వంత్‌పుర రైల్వే స్టేషన్లలో వివిధ రైళ్లలో 60 రోజుల పాటు అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను (కరెంట్, అడ్వాన్స్ రిజర్వేషన్ డిస్ల్పే) ఎల్సీడీ డీటీవీల్లో ప్రదర్శించే ఏర్పాటును నూతనంగా తీసుకువచ్చామన్నారు.
అంతేకాకుండా రిజర్వేషన్ ఛార్ట్ తయారైన తర్వాత దానిని డిజిటల్ రూపంలో కూడా ప్రదర్శించే ఏర్పాట్లను చేశామన్నారు. దీని వల్ల దళారుల వ్యవస్థ తగ్గడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లలో రూ.3 కోట్ల నిధులతో నూతనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బిన్నీమిల్ ప్రాంతంలో రైల్వేశాఖకు అప్పగించిన 3.1 ఎకరాల స్థలంలో షంటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీని వల్ల చెన్నై వైపుగా వెళ్లే రైళ్ల రాకపోకల ఆలస్యం చాలా వ రకూ తగ్గిపోతుందన్నారు.
కే.ఆర్‌పురం, యశ్వంత్‌పుర తదితర రైల్వే స్టేషన్లలో మౌలికసదుపాయాల పెంపునకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ఉన్న పర్యాటక అనుకూల వ్యవస్థలను పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ ఈ స్టేషన్‌ను ఉత్తమ ‘ఉత్తమ పర్యాటక స్నేహ రైల్వే స్టేషన్’ ఎంపిక చేయడం ఆనందం కలిగించిందన్నారు. కాగా, ఈ నెల 18న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి శశిథరూర్ చేతుల మీదుగా డీజీఎం అనిల్‌కుమార్ అవార్డును అందుకున్నారు.