state yoga
-
క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
లింగపాలెం : క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర యోగా, క్రీడల సమన్వయకర్త పేరం రవీంద్రనాథ్ తెలిపారు. లింగపాలెం మండలం శింగగూడెంలో గురువారం ప్రారంభమైన చింతలపూడి జోనల్‌స్థాయి బాలికల క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటుకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో 175 వికాస కేంద్రాలకు గాను నేటికి 70 నియోజకవర్గాల్లో వీటిని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రాంతీయ క్రీడా అకాడమీలను రాష్ట్రంలో «మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్రీడా నైపుణ్యం కలిగినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. గతంలో క్రీడలకు నిధులటూ ఉండేవికాదన్నారు. నేడు క్రీడల అభివృద్ధికి ప్రతి హైస్కూల్‌కు ఆర్ఎంఎస్ నిధుల కింద రూ.10 వేలు, సర్వశిక్ష అభియాన్ నిధుల కింద రూ.5 వేలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వ్యాయామంపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా కెనడా సహకారంతో ఏపీలో కార్యక్రమం ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ 820 విద్యార్థులకు ఒక పీఈటీ ఉంటే.. ఇకపై 400 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండేలా త్వరలో నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల మంది పీఈటీలు ఉన్నారని మరో 3 వేల పోస్టులు భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. గతంలో మండలానికి ఒక పీడీ పోస్టు ఉండేదన్నారు. రెండు రోజులక్రితం 1,200 మంది పీఈటీలకు పదోన్నతి కల్పించి పీడీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రతి హైస్కూల్లో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి పరిచేందుకు ఉపాధి హామీ పథకంలో రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల వ్యాయమ బాధ్యతలు గతంలో పీఈటీలకు మాత్రమే ఉండేదని, నేడు పాఠశాల హెచ్ఎంలకు కూడా బాధ్యత కల్పించామన్నారు. ప్రతి విద్యార్థికి 6 రకాల క్రీడా నైపుణ్య పరీక్షలు నిర్వహించి వివరాలను ఆధార్ కార్డు నెంబర్‌తో అన్లైన్ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన క్రీడాకారులకు పరీక్షల్లో 6 శాతం మార్కులు కలుపుతామన్నారు. అంతేకాకుండా ఈ క్రీడాకారులకు స్కాలషిప్ ఇవ్వనున్నట్టు రవీంద్ర వివరించారు. -
యోగా వల్ల ఆసుపత్రులు ఖాళీ కావాలి
ఆకివీడు : ఆసుపత్రులు ఖాళీ అయితేనే యోగా విజయవంతమైనట్టని రాష్ట్ర యోగా, స్పోర్ట్సు అధికారి పేరం రవీంద్రనాథ్ అన్నారు. గ్రామంలోని జిల్లా పతంజలి యోగారోగ్య కేంద్రంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించారు. పతంజలి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 8 సంవత్సరాల చిన్నారుల నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకూ పాల్గొని యోగాసనాలతో అబ్బుర పరిచారు. రాత్రి నిర్వహించిన ముగింపు సభలో రవీంద్ర మాట్లాడుతూ పాఠశాలస్థాయిలో యోగాను ప్రవేశ పెట్టి ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల పాఠశాలల్లో 14 వేల మంది ఉపాధ్యాయులకు యోగ శిక్షణ ఇప్పించామన్నారు. ఇకపై రోజూ యోగా, స్పోర్ట్సును రెండు పిరియడ్లుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పతంజలి యోగారోగ్య కేంద్రం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీబీ ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిని యోగా కేంద్రంగా మార్చే సత్తా ప్రజల్లో ఉందన్నారు. యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వబలిశెట్టి శ్రీవెంకేటశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీల్లో 142 మంది పాల్గొన్నారని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ, జాతీయస్థాయి యోగా చాంపియన్లను ఘనంగా సత్కరించారు. క్రీడాకారులందరికీ భోజన వసతిని రైస్ మిల్లర్, యోగా కేంద్రం ప్రతినిధి నేరెళ్ల రామ చెంచయ్య ఏర్పాటు చేశారు. పతంజలి కేంద్రం ప్రతినిధులు ఉండ్రమట్ల సాంబశివరావు, నేరెళ్ల రామ రోశయ్య, కుంకట్ల సత్యనారాయణ, యోగా సాంబశివరావు, వాణీశ్రీ, వెంకటేశ్వరరావు, భూపతిరాజు సత్యనారాయణరాజు, టి.రోషిణి, సీతారామయ్య, కె.సత్యనారాయణ, కేవీకే గాంధీ, కె.రమణారెడ్డి, వి.మోహన్, జి.సుబ్రహ్మణ్యంరాజు పాల్గొన్నారు.