తెలంగాణ యోధులకు గుర్తింపులేదు
బంగారు తెలంగాణలో కులవృత్తుల అభివృద్ధి
సంఘాలకు కుల పిచ్చి ఉండొద్దు
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్
మిడ్జిల్: స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తెలంగాణ యోధులు పోరాడినా కానీ వారి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై లేకుండా ఆంధ్రాపాలకులు కుట్ర చేశారని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం జడ్చర్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మిడ్జిల్‌లోని గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారి కీర్త ప్రతిష్టలు ఆంధ్రా పాలకుల పెత్తనం వల్ల అంతరించి పోయిందన్నారు.
తెలంగాణ యోధులను స్మరించుకోవాలని, వారి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించేందుకు ముఖ్యమంత్రిని కోరతానన్నారు. దొరలు, నవాబుల పాలన అంతమొందించేందుకు 350ఏళ్ల కిత్రం సర్దార్ పాపన్నగౌడ్ పోరాటం చేసినందుకు ఆయనను గోల్కోండ కోట దగ్గర నవాబులు అతి దారణంగా నరికి చంపారని గుర్తు చేశారు. తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో పాపన్నగౌడ్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు గౌడ సోదరులు ముందుకు రావాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా అంతరించి పోయాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ కృషి వల్ల బంగారు తెలంగాణలో మళ్లీ కులవృత్తులు అభివృద్ధి చెందుతాయన్నారు. కుల సంఘాలు ప్రతిష్టంగా ఉండాలే కానీ కుల పిచ్చి ఉండకూడదని సూచించారు. గౌడ కులస్తులకు ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులతో కలిసి కృషి చేస్తానని చెప్పారు.
వన నర్సరీల ద్వారా తాటి, ఈత చెట్ల పెంపకం
గ్రామాల్లో కల్తీకల్లును నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన హరిత వనం కార్యక్రమంలో వన నర్సరీల ద్వారా తాటి, ఈత చెట్లను పెంచి గౌడ కులస్తులకు అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అలాగే ప్రభుత్వం గ్రామాల్లో గీత కార్మికులకు సొసైటీ ద్వారా ఐదు ఎకరాల భూమి ఇచ్చి తాటి, ఈత వనాలను పెంచేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఎవరూ కల్తీకల్లును ప్రోత్సహించవద్దని సూచించారు. పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రజాకర్లను ఎదిరించిన ఘనత గౌడ సంఘానిదేనని అన్నారు.
ప్రభుత్వపరంగా గౌడ కులస్తుల కోసం ఐదు ఎకరాల భూమి త్వరలో ఇప్పించేందుకు మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కృషి చేస్తానన్నారు. గీత కార్మికులకు పింఛన్లు వచ్చే విధంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌గౌడ్, పల్లెరవికమార్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేశ్‌గౌడ్, జెడ్పీటీసీ హైమావతి, ఎంపీపీ దీప, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, తదితరులు పాల్గొన్నారు.