కర్నూలులో రేపే ‘సమైక్య’ సభ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభ నిర్వహణకు వేదిక జిల్లా నేతల ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. 29వ తేదీ ఉదయానికే జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో శనివారం నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో నేతలు పని చేస్తున్నారు. వేదిక చైర్మన్ అశోక్‌బాబుతో పాటు 30 మంది రాష్ట్ర నాయకులు కార్యక్రమంలో పాల్గొననున్న దృష్ట్యా బహిరంగసభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, క్రిష్టఫర్ దేవకుమార్, సంపత్‌కుమార్, శ్రీరాములు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న సభకు ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, మేధావులు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులను ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు జిల్లా ఎస్పీని కలసి బహిరంగ సభకు తగిన బందోబస్తు కల్పించాలని కోరారు.
ఆదివారం ఉదయం 11 గంటలకే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ఆధ్వర్యంలో మొదలుపెట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బహిరంగ సభకు.. సాంస్కృతిక కార్యక్రమాలకు వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. సభ సజావుగా సాగేందుకు 500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేయగా.. 60వేల మంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. వేలాదిమంది బహిరంగ సభ వేదిక ముందు భాగంలో కూర్చునేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. ఈనెల 29న తెలంగాణవాదులు హైదరాబాద్‌లో సకలజనుల సదస్సు నిర్వహించనుండటంతో.. దానికి దీటుగా కర్నూలులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ బహిరంగ సభకు ఏర్పాట్లను నిర్వాహకులు ముమ్మరం చేశారు. జిల్లా చరిత్రలో ఇప్పటివరకు లేనివిధంగా చేపడుతున్న సభతో సమైక్యవాదాన్ని బలంగా వినిపించేందుకు జిల్లావాసులు సన్నద్ధులవుతున్నారు. ప్రజాగర్జన ఏర్పాట్లను వేదిక జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల నేతలు రమణ, ఇజ్రాయిల్, శ్రీనివాసులు, లక్ష్మన్న, పి.రామకృష్ణారెడ్డి, సర్దార్ అబ్దుల్ హమీద్ తదితరులు పరిశీలించారు.