చిన్నవయసులో అర్థంకాని ఆకర్షణను ప్రేమ అనుకుని ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో ఆ ఇద్దరూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.
మానవపాడు : చిన్నవయసులో అర్థంకాని ఆకర్షణను ప్రేమ అనుకుని ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో ఆ ఇద్దరూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి తల్లిదండ్రులు ఒప్పుకోరని బయటకు వెళ్లిన 24 గంటల్లోపే చావులోనైనా ఒకటి కావాలని తలచి తనువు చాలించారు. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొన్ని రోజులుగా మండలంలోని చిన్నపోతులపాడుకు చెందిన సుమన్ (20), మాధవి (15) ప్రేమించుకుంటున్నారు.
సుమన్ కర్నూలు పట్టణంలోని ఎస్‌టీబీసీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్, మాధవి మానవపాడులోని ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదవుతున్నారు. వీరి మధ్య కొంత కాలంగా ప్రేమవ్యవహారం కొనసాగుతుండటంతో ఇంట్లోవారు గమనించి మందలించి బాగా చదువుకోవాలని హెచ్చరించారు.
దీంతో శనివారం ఉదయం ఇద్దరూ కలిసి కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చేరుకున్నారు. అదే రాత్రి పది గంటలకు అన్న సురేష్‌కు ఫోన్‌చేసి ‘మా ప్రేమ బతకడం కష్టంగా ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నాం...’ అని సుమన్ చివరిసారిగా మాట్లాడారు. ఆ తర్వాత వారి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో ఇరు కుటుంబాలవారు మానవపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలోనే ఆదివారం ఉదయం 9.30 గంటలకు నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని పొన్నూర్ శివారులో ఆత్మహత్య పాల్పడినట్టు తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు.