న్యూఢిల్లీ : తన కుమారుడి కారుణ్య మరణానికి (euthanasia) అనుమతించాలని దాఖలు చేసిన తల్లిదండ్రల అభ్యర్ధనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ హృదయ విదారక కేసులో పిటిషనర్లకు మద్దతుగా తీర్పు ఇవ్వలేమని తెలిపింది. అదే సమయంలో 11ఏళ్లుగా మంచానికే పరిమితమైన కుమారుణ్ని చూసుకునేందుకు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏదైనా సంస్థ బాధితుడి సంరక్షణ బాధ్యతల్ని చూసుకుంటుందో తెలుసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.
కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. అశోక్ రాణా,నిర్మలా దేవి దంపతుల కుమారుడు హరీష్ రాణా. 2013లో చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివేవారు. ఆ ఏడాది ఆగస్టు 3న సాయంత్రం 7 గంటలకు చండీగఢ్ నుంచి తండ్రి అశోక్ రాణాకు ఫోన్ వచ్చింది. హరీశ్ కింద పడిపోయి, గాయాలపాలయ్యారని చెప్పారు.
నాలుగో అంతస్తు నుంచి కిందపడి
హరీష్ తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అలా అయ్యింది. తొలుత హరీష్‌కు చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు.
ట్రీట్మెంట్ కోసం ఆస్తులమ్మి
తల్లిదండ్రులు ఇంటి నుంచి చికిత్స అందించే వారు. చికిత్స నిమిత్తం హరీష్ రాణాకు పైపుల (రైల్స్ ట్యూబ్) ద్వారా ఆహారాన్ని, మెడిసిన్‌ను పంపించే వారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చయ్యేది. ఉన్న ఆస్తుల్ని అమ్మి చికిత్స అందించినా.. కుమారుడిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో కుమారుడి కారుణ్యం మరణానికి అవకాశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని
తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు బాధితుడి తల్లిదండ్రులు. మంగళవారం బాధితుల పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అశోక్ రాణా తరుఫు న్యాయవాది మాట్లాడుతూ.. కుమారుడి వైద్యం కోసం అశోక్ రాణా దంపతులు తమ ఇంటిని విక్రయించారని, ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని, కారుణ్య మరణం పొందేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పిటిషన్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేం
పిటిషన్ల అభ్యర్ధనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రైల్స్ ట్యూబ్ తొలగింపు కారుణ్య మరణంలో భాగం కాదు. రైల్స్ ట్యూబ్ తీసివేస్తే రోగి ఆకలితో మరణిస్తారు'అని బెంచ్ పేర్కొంది. అయితే, ఈ హృదయ విదారకమైన కేసులో పిటిషన్లకు మద్దతుగా తీర్పు ఇవ్వలేం. అలాగని చూస్తూ ఉండిపోం. పిటిషనర్లైన తల్లిదండ్రులు దశాబ్దానికి కుమారుడి కోసం కష్టపడుతున్నారు. ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణంలో ఇప్పటి వారి జీవితంలో వెలుగు చూడలేదు.
అందుకే తల్లిదండ్రుల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పిస్తూ కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తుందా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని బెంచ్ అభ్యర్థించింది.
తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలా
ఇది చాలా కఠినమైన కేసు. తల్లిదండ్రులు 13 ఏళ్లుగా కష్టపడుతున్నారని, ఇకపై తమ కుమారుడి వైద్య బిల్లులు భరించలేకపోతున్నారని సీజేఐ తెలిపారు. ఏదైనా సంస్థ హరీష్ రాణాను జాగ్రత్తగా చూసుకోగలదో లేదో తెలుసుకోండి. రైల్స్ ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ, కారుణ్య మరణానికి అనుమతించలేమని’అని బెంచ్ తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదింస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment