Steve Jarding
-
పవన్ కలిసిన ఆ ప్రముఖుడు ఎవరంటే...
బోస్టన్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బోస్టన్‌లో అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ఓ ప్రముఖ వ్యక్తిని కలుసుకున్నారు. అయనే స్టీవ్ జార్డింగ్. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున బోస్టన్లోని చార్లెస్ హోటల్లో పవన్, జార్డింగ్లు కలుసుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనెడీ స్కూల్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జార్డింగ్‌కు పబ్లిక్ పాలసీ, రాజకీయ వ్యూహాల రూపకల్పనలో విశేష అనుభవం ఉంది. అమెరికాలోనే కాకుండా, వివిధ దేశాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు జార్డింగ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభివృద్ధి కోసం ములాయం సింగ్ కూడా జార్డింగ్ నుంచి చాలాసార్లు సూచనలు స్వీకరించారు. అంతేకాకుండా ప్రస్తుత యూపీ ఎన్నికలకు కూడా జార్డింగ్ రూపొందించిన వ్యూహాలనే అఖిలేష్ యాదవ్ అమలు చేస్తున్నారు. పవన్, జార్డింగ్ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరగబోయే శాసన సభ ఎన్నికల గురించి చర్చించారు. పవన్‌కు రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా చేయడం వంటి అంశాలతోపాటూ మరింత సమాచారాన్ని జార్డింగ్ దాదాపు రెండు గంటలపాటూ విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా జార్డింగ్‌కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. వీలుంటే ఎన్నికల ముందు మరోసారి కలుద్దామని జార్డింగ్ను పవన్ కోరారు. -
మళ్లీ పవర్ కోసం ప్రపంచ వ్యూహకర్తను రంగంలోకి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రధాన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను రంగంలోకి దించగా అందుకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సమాజ్ వాది పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఆ పార్టీ ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యూహకర్త, హార్వార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల వ్యూహకర్త స్టీవ్ జార్డింగ్ను రంగంలోకి దింపుతోంది. రెండోసారి కూడా ఎలాగైనా పాలన పగ్గాలు చేపట్టాలనే లక్ష్యంలో భాగంగా ఆయనను ప్రచార వ్యూహాలకోసం సంప్రదించనుంది. ఇప్పటికే పలు సలహాలను కూడా స్టీవ్ ఎస్పీకి అందించాడట.| హార్వార్డ్ లోని కెన్నడీ స్కూల్ లో జార్డింగ్ పబ్లిక్ పాలసీ బోధిస్తున్నారు. 1980 నుంచి పొలిటికల్ కన్సల్టెంట్‌గా, ప్రచారాల మేనేజర్ గా పనిచేస్తున్నారు. హిల్లరీ క్లింటన్, అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్, స్పానిష్ ప్రధాని మారియనో రాజోయ్వంటివారంతా కూడా ఈయనను సంప్రదించేవారే. ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఆయనను సంప్రదించగా వ్యూహాలు సిద్ధం చేసేందుకు ఆయన ఇప్పటికే లక్నోలో దిగారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే ఆయన చెప్పారట. ప్రజలకు ఇది కేంద్ర పథకమా, రాష్ట్ర పథకమా అనే విషయం తెలియదని, ముఖ్యంగా సమాజ్ వాది పెన్షన్ యోజన అనే పథకాన్ని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తో ప్రచారం చేయించాలని ఆయన సలహా ఇచ్చారట. మొత్తానికి ప్రచార వ్యూహం మొత్తాన్ని తిరిగి రీడిజైన్ చేస్తున్నారని తెలిసింది.