వేతన సవరణలో కేంద్రానిది నిర్లక్ష్యం
నెల్లూరు (టెలికమ్): వేతన సవరణలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ నాయకుడు ఎస్.తిరుపతయ్య విమర్శించారు. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలో తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నగరంలోని బారకాసులో ఉన్న ఎస్బీఐ ప్రధాన శాఖ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
తిరుపతయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. బుధవారం ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఎత్తున బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వేతన సవరణ చేపట్టకపోతే తమ ఆందోళన, నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్, ఉదయ్‌కుమార్, ఆనందరామ్సింగ్, రామ్‌గోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి, శివప్రసాద్, భాస్కర్‌రెడ్డి, టీఎన్ఆర్ ప్రసాద్, సత్యనారాయణ, లింకన్, వెంకటేశ్వరరావు, రఘురాంకుమార్, వెంకటేశ్వర్లు, ఎన్ఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు.