మార్కెట్లోకి అశోక్ లేలాండ్ స్టైల్
న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్‌కు చెందిన అశోక్ లేలాండ్ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) స్టైల్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.49 లక్షలు-రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). భారత్‌లో తమ తేలిక రకం వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకోవడంలో భాగంగా దీన్ని మార్కెట్లోకి తెచ్చామని ఈ సందర్భంగా కంపెనీ వైస్ చైర్మన్ వి. సుమంత్రన్ చెప్పారు. అశోక్ లేలాండ్-నిస్సాన్ మోటార్ కంపెనీ జాయింట్ వెంచర్... దోస్త్ ఎంపీవీ తరవాత దీన్ని అభివృద్ధి చేసింది. తేలిక రకం వాణిజ్య వాహనం ‘పార్ట్నర్’ను వచ్చే ఏడాది ఈ కంపెనీ మార్కెట్లోకి తేబోతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7-8 సీట్ల రవాణా వాహనంగా, ట్యాక్సీ సర్వీస్‌కు, అంబులెన్స్ సర్వీస్‌కు, హోటల్ షటిల్స్‌కు ఈ స్టైల్ కారు ఉపయోగపడుతుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
త్వరలో సీఎన్జీ వేరియంట్
1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 5 స్పీడ్ ట్రాన్సిమిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, వంటి ప్రత్యేకతలున్న ఈ స్లైల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని 18 సెకన్లలోనే అందుకుంటుందని, 19.5 కిమీ నుంచి 22.5 కిమీ. వరకూ మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. త్వరలో సీఎన్జీ వేరియంట్‌ను కూడా అందించాలని కంపెనీ యోచిస్తోంది.