రాష్ట్రపతికి ఆంజియోప్లాస్టీ
స్టెంట్ అమర్చిన ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శనివారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో గుండె సంబంధమైన చికిత్స జరిగింది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 79ఏళ్ల రాష్ట్రపతికి, గుండె కండరాలకు రక్తాన్ని చేరవేసే ధమనిలో ఏర్పడిన అడ్డంకిని తొలగించేందుకు స్టెంట్‌ను అమర్చారు.
కడుపునొప్పి, ఉదర సంబంధమైన సమస్యలతో రాష్ట్రపతిని శనివారం ఉదయం ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ధమనిలో అడ్డంకి ఉన్నట్టు గుర్తించారు. ఆంజియోప్లాస్టీ నిర్వహించి, స్టెంట్‌ను అమర్చారు. ధమని ద్వారా జరగాల్సిన రక్తప్రసరణను ఈ చికిత్స మెరుగుపరుస్తుంది.
రాష్ట్రపతికి ఆంజియోప్లాస్టీ జరిగిందన్న వార్తలను ఆయన ప్రెస్ సెక్రెటరీ రాజమొనీ ధ్రువీకరించలేదు, ఖండించనూ లేదు. ఆసుపత్రిలో రాష్ట్రపతి ఆరోగ్యంపై పూర్తి పర్యవేక్షణ కొనసాగుతోందని, సోమవారానికి కల్లా ఆయన ఆసుపత్రినుంచి తిరిగివస్తారని భావిస్తున్నామని రాజమొనీ చెప్పారు.