ఎస్సీ వర్గీకరణకు ‘తెలుగు’ సీఎంలే అడ్డంకి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కష్ణమాదిగ
బోనకల్ : ఎస్సీ వర్గీకరణకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కష్ణమాదిగ విమర్శించారు. ఆయన మంగళవారం ఇక్కడ ఎమ్మార్పీఎస్ సమావేశంలో మాట్లాడుతూ.. నవంబర్ 20న 30లక్షల మందితో హైదరాబాద్‌లో ‘మహాధర్నా – యుద్ధ సభ’ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ధర్నా, సభకు ప్రతి గ్రామం నుంచి 200 మందికి తగ్గకుండా హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లితే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందన్నారు. చట్ట సభల్లో వర్గీకరణకు అన్ని జాతీయ పార్టీలు మద్దతు తెలిపాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు సుముఖంగా ఉందన్నారు. నవంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉందన్నారు. నవంబర్ 20న జరిగే మహాధర్నా – యుద్ధ సభను జయప్రదం చేయడం ద్వారా ఎమ్మార్పీఎస్ సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘‘జిల్లాల విభజన వెనుక సీఎం కేసీఆర్, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేల ప్రయోజనాలు ఉన్నాయి.
1.20కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ను జిల్లాలుగా విడగొట్టకుండా.. జంట పట్టణాలుగా ఉన్న వరంగల్, హన్మకొండను జిల్లాలుగా విడగొట్టడం వెనుక ఆంతర్యమేమిటి? 8వేల జనాభాగల యాదగిరిని జిల్లాగా చేశారు, 40వేల జనాభా ఉన్న వేములవాడను ఎందుకు చేయలేదు? దీనికి కారణాలేమిటో వెల్లడించాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, షేక్ మదార్ సాహెబ్, వంగూరి ఆనందరావు, కె.వెంకటేశ్వర్లు, బి.వెంకటేశ్వర్లు, కనకపూడి శ్రీను, మొండితోక అఫ్జల్, గద్దల వెంకటేశ్వర్లు, యంగల కనకయ్య, చిలకా నాగభూషణం, కోటకొండ, తాటికొండ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.