ఇప్పుడు కింగ్ ఫిషర్ ఎగరలేకపోతోందే!
♦ తక్కువ చమురు ధరల పరిస్థితిని వినియోగించుకోలేకపోవడం నన్ను బాధిస్తోంది
♦ సంస్థ ప్రమోటరు విజయ్ మాల్యా
న్యూఢిల్లీ: ఒక్క అంశంలో తప్ప మిగతా ఏ విషయంలోను బాధ లేదంటున్నారు రుణ ఎగవేతల వివాదాలు వెన్నాడుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా. చమురు రేట్లు భారీగా పతనమైన ప్రస్తుత తరుణంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎగరలేకపోతోందే అన్నదే తనకు బాధ కల్గించే విషయమని ఆయన చెప్పారు. మాల్యా ప్రమోటర్‌గా వ్యవహరించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక సంక్షోభాలతో 2012లోనే కార్యకలాపాలు నిలిపివేయడం, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వెన్నాడుతుండటం తెలిసిందే. కింగ్‌ఫిషర్‌ను, దాని ప్రమోటింగ్ సంస్థ యూబీ గ్రూప్‌ను, మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా కొన్ని బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి.
28వ ఏటనే యూబీ గ్రూప్ పగ్గాలను చేపట్టి, దేశంలోనే అతి పెద్ద బీర్లు, స్పిరిట్స్ కంపెనీలను తీర్చిదిద్దిన తాను ఇప్పుడు ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని మాల్యా చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో లెక్కలు తప్పడానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘జీవితంలో ఎత్తుపల్లాలు ఉండటం సహజం. అంతిమంగా మాత్రం నేను గర్వంగా చెప్పుకోతగినవి చాలానే సాధించాను’ అని ఆయన పేర్కొన్నారు. డియాజియో డీల్ తర్వాత తాను ఇంగ్లాండుకు వెడుతుండంటపై వస్తున్న విమర్శలపై మాల్యా స్పందించారు. తాను గతంలోనూ ఇంగ్లాండులో చాలా కాలం ఉన్నానని, ఇందులో కొత్తేమీ లేదని స్పష్టం చేశారు.
హైకోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ..
తనను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఎస్బీఐ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా వేసిన పిటీషన్‌పై విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఒకే అంశాన్ని రెండు వేర్వేరు బెంచ్‌లు విచారణ చేయడం కుదరదని స్పష్టం చేసింది. దీన్ని గతంలో బాంబే హైకోర్టు విచారణ చేసినందున, తిరిగి ఆ న్యాయస్థానం దృష్టికే తీసుకెళ్లాలని సూచించింది. దీంతో పిటీషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని మాల్యా తరఫు న్యాయవాదులు న్యాయమూర్తులను కోరారు. డిఫాల్టరుగా ప్రకటించే ముందు తన వాదనలను వినిపించే అవకాశాన్ని ఎస్బీఐ ఇవ్వలేదంటూ మాల్యా కోర్టుకెళ్లారు. తాను ఢిల్లీ నివాసిని కాబట్టి ఈ అంశం ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, దీన్ని వ్యతిరేకించిన ఎస్బీఐ తరఫు న్యాయవాదులు.. మాల్యా నివాసం ముంబైలోనే ఉన్నందున, అక్కడి హైకోర్టులోనే దీన్ని విచారణ జరపాలంటూ విన్నవించారు.