అసలు రూపం చూపిన డ్రాగన్
జాతిహితం
పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మైన్మార్, శ్రీలంకలకు చైనా చేరువ కావడమంటే భారత్‌ను చుట్టుముట్టడమే. ఇదొక కొత్త ప్రపంచం. కాబట్టి భారత్ కూడా కొన్ని వ్యూహాత్మక సాధ్యాసాధ్యాల గురించి శోధించాలి. దీనికి తొలి మెట్టుగా మొదట మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. హిమాలయాలలో ఉన్న ఒకటి రెండు ప్రతిదాడి భారత దళాలు చైనాను నిరోధించగలవా? కాబట్టి అవకాశం ఉన్నప్పుడు వ్యూహాత్మక విధానంలోకి మారాలి.
అద్భుతకాలం అని పిలవదగిన ఒక సమయంలో ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి వినిపించిన మాట ఇది: ప్రపంచ పరిస్థితిని మెరుగుపరచాలి. ఇది కొంచెం తికమక పెట్టే పదమే అయినా ఆశావహమైన మాట. అయితే ఈ శీతాకాలంలో ముగిసిన మరో దావోస్ సదస్సు ముగింపు సమయానికి ఈ మాటను వర్తింపచేయలేం. ఈ సందర్భం అద్భుతకాలం కాబోదు. ప్రపంచీకరణకు పెద్ద చోదక శక్తిగా ఉన్న వ్యవస్థకయితే కచ్చితంగా మంచి కాలమని అసలే అనలేం. అంతేకాదు, ప్రపంచీకరణను శ్లాఘించే వాళ్లకీ, చీత్కరించే వాళ్లకీ కూడా ఇది మహోన్నతకాలం కాదు. ఎందుకంటే ప్రపంచీకరణ ఆలోచన విశ్వవ్యాప్తంగా ప్రతిఘటనను, ప్రతికూలతను ఎదు ర్కొంటున్నది. దీని ఆశయాన్ని నిరంతరం శంకించే వామపక్షీయులూ, ఆ సిద్ధాంతంతో సంబంధం ఉన్న సంస్థల కార్యకర్తలూ మాత్రమే ఇప్పుడు దీనిని వ్యతిరేకించడం లేదు. ధనిక, ప్రజాకర్షక పథకాలు అమలు చేసే ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా దాని ఎడల విముఖ భావనతోనే ఉన్నాయి.
అందుకే పారిశ్రామిక విప్లవం గురించి ప్రస్తావిస్తూ చార్లెస్ డికెన్స్ చెప్పిన ‘ఇది అద్భుతం కాలం, ఇది అత్యంత దుర్భర కాలం కూడా’ అన్న వాక్యాలని ఈ సందర్భంలో, అంటే ప్రపంచీకరణ కోసం ప్రార్థిస్తున్న సమయంలో, మరీ ముఖ్యంగా చైనా అగ్రనేత జింగ్పింగ్ అత్యంత మక్కువతో దానికి మద్దతు ఇచ్చిన సందర్భంలో కచ్చితంగా ప్రస్తావిం చుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత బలీయమైన కమ్యూనిస్టు పార్టీలో అగ్రనేత ప్రస్తుతం ప్రపంచీకరణకు పెద్ద మద్దతుదారు. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే నేటి ప్రపంచ పరిస్థితి నిజంగా ఇదే. మనమంతా తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసిన మరో సంగతి–రిపబ్లికన్ పార్టీలో మహా కోటీశ్వరుడు, అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తి ఇప్పుడు ప్రపంచీకరణకు తీవ్ర వ్యతిరేకి. ప్రపంచీకరణ నేపథ్యంలో జీవిస్తున్న నీవు ఈ ప్రపంచ పరిస్థితిని మెరుగుపరచాలన్న ఆలోచనను ఇప్పుడు ఎక్కడ నుంచి ప్రారంభించాలి?
ఇప్పుడు వీస్తున్న గాలి
ఈ సందర్భాన్ని చక్కగా రూపుకట్టించడానికి మొదట నీవు ఆలోచించే పనిలో దిగుతావు. ఇందుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ధోరణి నెలకొని ఉన్నది అనే అంశాన్ని గమనించడానికి దావోస్ వైపు ఒకసారి దృష్టి సారిస్తే చాలు.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మొదలు, రష్యాలో పుతిన్, జపాన్‌లో ఏబ్, చైనాలో జింగ్, భారత్‌లో నరేంద్ర మోదీ, టర్కీలో ఎర్డొగన్, ఇజ్రాయెల్‌లో నెతన్యాహు వరకు–ఈ అన్ని దేశాలలోను మొనగాళ్లు అనిపించుకున్నవాళ్లు గద్దెనెక్కారు. వీరంతా తమవైన శైలుల్లో వాళ్ల దేశాల పరిపాలనలు సాగిస్తున్నవారే. అయితే వీళ్లందరిలో సా«ధారణంగా కని పించే సారూప్యతలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి జనాకర్షణ. ఇంకా జాతీయతా భావాలు, కొన్ని సందర్భాలలో మామూలుగా, ఇంకొన్ని సందర్భాలలో ధాటీగా కూడా మాట్లాడే స్వభావం కూడా కనిపిస్తాయి. ఒకవేళ వీళ్ల ధోరణులు కాస్త విసుగు పుట్టిస్తే కనుక ఫిలి ప్పీన్స్ను ఏలుతున్న డ్యూటర్టేని చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఆ పని చేయడానికి పూనుకోవద్దు.
ట్రంప్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్న అమెరికా ప్రపంచంలో ఇప్పటికీ చాలా శక్తిమంతమైనది. సైనిక, ఆర్థిక, సాంకేతిక రంగాల దృష్ట్యా కూడా బలోపేతమైనది. పుతిన్‌కి నవ్వించే సామర్థ్యం చాలా ఉంది. తన శక్తి నంతా రష్యాకు ధారపోసి, ట్రంప్‌తో సఖ్యంగా ఉన్నాడు. ఏబ్ పీకల్లోతు సమస్యల్లో ఉన్నాడు. అవన్నీ జపాన్ జనాభాకు సంబంధించినవే. మనం జపాన్ మంత్రి కొజొ యామామాటోని ఈ వారం కలుసుకున్నాం. ఆయన చాలా ఆసక్తి రేకెత్తించే మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. దాని పేరు జనాభా క్షీణతను అధిగమించే చర్యల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. చైనా నేత జింగ్‌కు చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఆధిక్యంలో ఉన్న ఈ సూపర్ పవర్ దేశానికి అంతరంగంలో అమెరికా అంటే అభిమానం. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్‌కు కూడా విస్తృతమైన ఐచ్ఛి కాంశాలు చేతిలో ఉన్నాయి.
ఇప్పటికి అమెరికాతో భారత్‌కు ఉన్న సంబంధాలు చెక్కుచెదరకుండా ఉండడమే కాదు, అవి మరింత బల పడవచ్చు. పాకిస్తాన్‌తో సంబంధాలు అంకురిస్తున్న తరుణంలో రష్యాతో కొన్ని ప్రయోజనాల ప్రాతిపదికన భారత్ బంధం ఉంటుంది. భారత్‌ను విశ్వసనీయమైన దేశంగా, పెట్టుబడులకు ఆస్కారం ఉన్న దేశంగా జపాన్ భావిస్తోంది. చైనా సంగతి తీసుకుంటే, అప్పుడప్పుడు వాగాడంబరం ప్రదర్శించినా, వీసాల జారీ గురించి మాట్లాడినా, ఐక్యరాజ్య సమితిలో పాక్‌కు మద్దతుగా ఉన్నా కూడా, భారత్‌తో 70 బిలియన్ డాలర్ల మిగుల వాణిజ్య ప్రయోజనాలు ఆ దేశానికి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, చైనా ఉత్పత్తులను నిరోధిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన వాగ్దానం కనుక నిజంగా అమలైతే భారత్‌తో చైనా వాణిజ్యం మరింత అనివార్యమవుతుంది.
దావోస్‌లో చైనా విశ్వరూపం
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్న సమయంలోనే ఈ వ్యాసం రాయడం జరిగింది. ప్రపంచం గురించి భారత్‌కు సహజంగా మొదటి నుంచి ఉన్న ఆలోచనా సరళి హేతుబద్ధమైనదే కావచ్చు. అయినా అది కాలం చెల్లినదే. చైనాకు సంబంధించి అయినప్పటికి ఆ సరళి మరింత చురుకైనదిగా ఉండడం అనివార్యం. చైనా మనకు అత్యంత సమీపంగా ఉన్న పొరుగుదేశం. పైగా భారత్‌కు భౌగోళికంగా వ్యూçహా త్మకం అనదగిన దేశాలతో పాచికలు వేస్తున్నది. వస్తూత్పత్తి ఆర్థిక వ్యవహారాలలో కొత్త ధోరణులను తీసుకువచ్చే అంశంలో ప్రపంచంలోనే అధిక ప్రాధాన్యం సంతరించుకున్న దేశం కూడా చైనాయే. ఈ ధోరణే వ్యూహాత్మక శక్తిగా అవతరించడానికి ఆ దేశానికి వరంగా మారింది. ఇప్ప టికీ ఇదే దాని విశాల దృష్టి. ఇంకా చెప్పాలంటే విశ్వ శ్రేయస్సుకు సదా నిబద్ధతతో కూడుకున్నది. కచ్చితంగా చెప్పాలంటే నిస్వార్థమైనది.
దీనికి సంబంధించిన జాడలు దావోస్‌లో జింగ్పింగ్ ఇచ్చిన విశే షమైన ఉపన్యాసంలో రూపుకట్టాయి. ఆయన చైనాను స్వేచ్ఛా వాణి జ్యానికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకీ మద్దతుదారుగా చూపించారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక సుంకాలను విధించాలని (ఇది ఎలాంటిదంటే చలి, వర్షాల నుంచి రక్షణకు మనలను మనం గదిలో బంధించుకుంటే అక్కడకి గాలీ వెలుతురు కూడా రావు) శాంతియుత సహజీవనానికీ, వాతావరణంలో మార్పులకీ ఇవన్నీ నేడు అవసరమని ట్రంప్ ప్రసంగించారు.
అబద్ధాల పుట్ట డ్రాగన్
స్వేచ్ఛా వాణిజ్యం మీద, ప్రపంచ వాణిజ్యంలో అనుసరించే చట్టాలూ నిబంధనలపై గౌరవ ప్రకటన పట్ల చైనా చెప్పిన మొత్తం మాటలన్నీ మోసపూరితాలే. చైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక శక్తులు గూగుల్, ట్వీటర్లను దిగ్బంధనం చేసింది. సుంకాలతో పాటు, సుంకేత రమైన సమస్యలను కూడా కల్పించింది. కార్పొరేట్ కార్యాలయాల మీద దాడులు చేయవలసి వచ్చినప్పుడు వాటి కంప్యూటర్ల నుంచి డేటాను ఖాళీ చేస్తుంది. కొత్త డేటాను నింపుతుంది. ఉగ్రవాదానికి ఆ దేశం ఇస్తున్న మద్దతుకు అనుగుణంగా కొత్త ద్వీపాలను సృష్టిస్తుంది. పొరుగు దేశాలకు చెందిన భూమిని హెక్టార్ల కొద్దీ కలుపుకుంటుంది.
తనకు ప్రయోజనం అనుకుంటే ఉగ్రవాది మసూద్ అజర్‌ను కూడా సమర్ధిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో, క్లీన్ టెక్నాలజీ (ఉత్పత్తులు, సేవల విషయంలో పర్యా వరణానికి ప్రతికూలం కాని విధానం), శాంతియుత సహజీవనాల గురించి చైనా చెప్పే సుద్దులు ఎంత అబద్ధమంటే ప్రచురించడానికి సాధ్యం కాని ఆ ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదంతో–అదే ‘బి’తో ఆరం భమై ‘టి’తో ముగుస్తుంది–మాత్రమే వ్యక్తీకరించగలం. జింగ్పింగ్ ఉప న్యాసం ప్రపంచ నాయకత్వం మీద వారికున్న ఆశను కూడా ప్రతిబిం బించింది. ఇన్ని ఆశలు ఉన్న అలాంటి దేశం మన పొరుగునే ఉంది. మన దేశానికి చెందిన చాలా భూభాగాలను తనవిగా చెప్పుకుంటున్న దేశం కూడా.
‘వన్ బెల్ట్’, ‘వన్ రోడ్’ (అభివృద్ధి కోసం చైనా, అంటే జింగ్పింగ్ సూచిస్తున్న భూ, సముద్ర మార్గాల వ్యూహానికి పేరు) అంటూ జింగ్పింగ్ ప్రస్తావవశంగా చేసిన ప్రతిపాదన ప్రపంచంలో శక్తిమంతమైన దేశాలు తిరోగమన దశలో ఉన్న కాలంలో చేసినదని గమనించాలి. ఇదే అంశాన్ని ఆ దేశం నుంచి వచ్చిన ఒక అధికార ప్రతినిధి తరువాత మరింత వివ రించారు కూడా. ఆయన దీనిని 64 దేశాల ప్రాతినిధ్యం ఉన్న, 100 సంవత్సరాల పథకంగా వర్ణించారు. ఇది చైనా తనదైన నాటో శిబిరం గురించి చెప్పడమే కాదు, తన భౌగోళిక స్వరూపాన్ని కూడా చూపిం చింది. అది ఒకింత పెద్దది కూడా. అయితే సహకార, సంపదలపై చైనా ప్రతిపాదన అన్న మాటను ప్రయోగించడం చారిత్రక కారణాల దృష్ట్యా, చరిత్ర అనుభవాల మేరకు నాకు సుతరాము ఇష్టం లేదు. కానీ నేరుగా సైనిక బలగాల ప్రస్తావన లేకుండా కొన్ని ఆలోచనలను మాత్రం ఆ దేశం బయటపెట్టింది. ఇందుకు ఉదాహరణ సీపీ ఈసీ. ఈ భ్రమలో ములిగిన పాకిస్తాన్ వ్యూహాత్మక దృష్టి ఇప్పటికే మారిపోయింది.
మన ఆలోచనా విధానం మారాలి
పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మైన్మార్, శ్రీలంకలకు చైనా చేరువ కావడమంటే భారత్‌ను చుట్టుముట్టడమే. ఇదొక కొత్త ప్రపంచం. కాబట్టి భారత్ కూడా కొన్ని వ్యూహాత్మక సాధ్యాసాధ్యాల గురించి శోధిం చాలి. దీనికి తొలి మెట్టుగా మొదట మన ఆలోచనా విధానాన్ని మార్చు కోవాలి. హిమాలయాలలో ఉన్న ఒకటి రెండు ప్రతిదాడి భారత దళాలు చైనాను నిరోధించగలవా? కాబట్టి అవకాశం ఉన్నప్పుడు వ్యూహాత్మక విధానంలోకి మారాలి. 1962 నుంచి 2017 నాటికి ప్రపంచం ఎంతో దూరం ప్రయాణించింది. మన వ్యూహాత్మక దృష్టి కూడా అందుకు తగ్గట్టే ప్రయాణించాలి.
శేఖర్ గుప్తా
twitter@shekargupta