ఏసీబీకి ‘వీధిదీపాల’ రికార్డులు!
న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ సర్కారు హయాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల సమయంలో వెలుగుచూసిన వీధిదీపాల కుంభకోణం కేసులో అన్ని రికార్డులను పరిశీలించనున్నట్లు శుక్రవారం ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్ సర్కార్ ఆదేశం మేరకు గురువారం ఏసీబీ మొదటి ఎఫ్ఐఆర్ నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ వీధిదీపాల కొనుగోలు ఫైల్‌ను అప్పటి సీఎం షీలాదీక్షిత్ స్వయంగా ఆమోదించారు. దాంతో ఈ కుంభకోణంలో షీలా పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీడబ్ల్యూజీ కుంభకోణంలో అప్పటి షీలా ప్రభుత్వంతోపాటు, కార్పొరేషన్ అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలని అవినీతి నిరోధక విభాగాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన మొదటి ఎఫ్ఐఆర్లో షీలాదీక్షిత్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన ఈ కొనుగోలులో అని ఒక వాక్యం చేర్చడంతో మున్ముందు ఈ కుంభకోణంలో షీలా పేరును కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో ఈ వీధిలైట్ల కొనుగోలుపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపై విచారణకు మాజీ కాగ్ వి.కె.షుంగ్లూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రధానమంత్రి స్వయంగా నియమించారు. ఈ కమిటీ తన నివేదికలో వీధిలైట్ల కొనుగోలులో అప్పటి సీఎం షీలా అనవసరం జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు.
కాగ్ 2011లో ఇచ్చిన నివేదికలోనూ ఈ విషయంలో షీలా ప్రమేయాన్ని తప్పుపట్టింది. కామెన్వెల్త్ గేమ్స్ సమయంలో పలు స్టేడియాల వద్ద రోడ్లపై విదేశీ లైట్లు ఏర్పాటు చేసినప్పుడు తగిన ప్రమాణాలను పాటించలేదని పేర్కొంది. అయితే అప్పటి సీఎం ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపించడంతో ప్రభుత్వానికి రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఏసీబీ వీధిలైట్ల కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. కాగా షుంగ్లూ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ కేసులో ముందుకుపోవాలని ఏసీబీ భావిస్తోంది. ‘ఈ కుంభకోణంలో నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించాం. మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇందులో మేం ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకుని కేసు నమోదుకు అనుమతించలేదు..’ అని మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ‘కామన్వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీ సర్కార్ అధీనంలో చేపట్టిన అన్ని పనులపైనా ఏసీబీ దర్యాప్తు జరుపుతుంద’ని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భర్తీ స్పష్టం చేశారు.