ఏసీబీకి ‘వీధిదీపాల’ రికార్డులు! | street lights scam in common wealth games | Sakshi
Sakshi News home page

ఏసీబీకి ‘వీధిదీపాల’ రికార్డులు!

Published Sat, Feb 8 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

ఏసీబీకి ‘వీధిదీపాల’ రికార్డులు!

ఏసీబీకి ‘వీధిదీపాల’ రికార్డులు!

 న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ సర్కారు హయాంలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల సమయంలో వెలుగుచూసిన వీధిదీపాల కుంభకోణం కేసులో అన్ని రికార్డులను పరిశీలించనున్నట్లు శుక్రవారం ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్ సర్కార్ ఆదేశం మేరకు గురువారం ఏసీబీ మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ వీధిదీపాల కొనుగోలు ఫైల్‌ను అప్పటి సీఎం షీలాదీక్షిత్ స్వయంగా ఆమోదించారు. దాంతో ఈ కుంభకోణంలో షీలా పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీడబ్ల్యూజీ కుంభకోణంలో అప్పటి షీలా ప్రభుత్వంతోపాటు, కార్పొరేషన్ అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలని అవినీతి నిరోధక విభాగాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన మొదటి ఎఫ్‌ఐఆర్‌లో షీలాదీక్షిత్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన ఈ కొనుగోలులో అని ఒక వాక్యం చేర్చడంతో మున్ముందు ఈ కుంభకోణంలో షీలా పేరును కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో ఈ వీధిలైట్ల కొనుగోలుపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపై విచారణకు మాజీ కాగ్ వి.కె.షుంగ్లూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రధానమంత్రి స్వయంగా నియమించారు. ఈ కమిటీ తన నివేదికలో వీధిలైట్ల కొనుగోలులో అప్పటి సీఎం షీలా అనవసరం జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు.
 
  కాగ్ 2011లో ఇచ్చిన నివేదికలోనూ ఈ విషయంలో షీలా ప్రమేయాన్ని తప్పుపట్టింది. కామెన్‌వెల్త్ గేమ్స్ సమయంలో పలు స్టేడియాల వద్ద రోడ్లపై విదేశీ లైట్లు ఏర్పాటు చేసినప్పుడు తగిన ప్రమాణాలను పాటించలేదని పేర్కొంది. అయితే అప్పటి సీఎం ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపించడంతో ప్రభుత్వానికి రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఏసీబీ వీధిలైట్ల కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. కాగా షుంగ్లూ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ కేసులో ముందుకుపోవాలని ఏసీబీ భావిస్తోంది. ‘ఈ కుంభకోణంలో నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించాం. మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఇందులో మేం ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకుని కేసు నమోదుకు అనుమతించలేదు..’ అని మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ‘కామన్‌వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీ సర్కార్ అధీనంలో చేపట్టిన అన్ని పనులపైనా ఏసీబీ దర్యాప్తు జరుపుతుంద’ని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భర్తీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement