నేటినుంచి మోడీ నేపాల్ పర్యటన
కొయిరాలాతో భేటీ, రాజ్యాంగ పరిషత్తులో ప్రసంగం
న్యూఢిల్లీ/ కఠ్మాండూ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నుంచి రెండు రోజులపాటు నేపాల్‌లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఆర్థికరంగం, ఇతర రంగాల్లో పరస్పర సహకారం లక్ష్యాలుగా నేపాల్ వెళ్తున్నారు. మోడీ రెండురోజుల పర్యటనలో భారత్, నేపాల్ మధ్య విద్యుత్, సాంస్కృతిక రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. నేపాల్‌కు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో మోడీ,.. నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కొయిరాలాతో చర్చలు జరపడంతోపాటుగా, నేపాల్ రాజ్యాంగ పరిషత్‌ను ద్దేశించి ప్రసంగిస్తారు.
నేపాల్ రాజ్యాంగ పరిషత్తులో ప్రసంగించే రెండవ విదేశీ నేతగా మోడీకి గౌరవం దక్కబోతోంది. 1990లో జర్మనీ చాన్సలర్ హెల్మట్ కోల్ మొదట ఈ గౌరవం దక్కింది. కాగా పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేదిశగా నేపాల్ భాగస్వామ్యంలో పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన నేపథ్యంలో ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
పశుపతి ఆలయానికి చందనం..
కఠ్మాండూ శివార్లలోని సుప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, ప్రార్థనల్లో మోడీ పాల్గొంటారు. భారత ప్రభుత్వం తరఫున రూ. 3కోట్ల విలువైన రెండున్నర టన్నుల చందనాన్ని ఆలయానికి సమర్పిస్తారు. ఆలయంలో అర్చకులురోజూ అర కిలో చందనాన్ని లింగానికి లేపనం పూస్తారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ శివాలయం ఆవరణలో 400పడకల సౌకర్యంతో ఒక ధర్మశాలను భారత ప్రభుత్వం సహాయంతో నిర్మిస్తున్నారు. భారత ప్రధాని నేపాల్‌లో పర్యటించడం 17 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.
సమితి సాధారణ సభలో మోడీ ప్రసంగం
సెప్టెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లనున్న మోడీ వచ్చేనెల 27న జరగే 69వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య మండలి సమావేశంలో ప్రసంగించనున్నారు.