6 శాతం వృద్ధి రేటు నిరాశాజనకం
♦ నోట్ల రద్దు, ఆర్బీఐ కఠిన పాలసీ, బలమైన రూపాయే తక్కువ వృద్ధికి కారణాలు
♦ ‘నోబెల్’ ఆర్థికవేత్త పాల్క్రుగ్మన్
ముంబై: భారత్ వంటి దేశానికి 6 శాతం వృద్ధి రేటు నిరాశ కలిగించే విషయమని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత పాల్క్రుగ్మన్ అన్నారు. మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఆర్బీఐ కఠిన విధానం, బలమైన రూపాయి ఇవే వృద్ధి నిదానంగా ఉండడానికి కారణాలుగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అధిక సంఖ్యలో పనిచేసే శ్రామిక శక్తిని కలిగి ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ ఆ మేర ఫలితాలను చూపించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. 6% వృద్ధి రేటు నిరాశపరిచిందని, కనీసం 8–9% అయినా నమోదు చేయాల్సి ఉందన్నారు.
గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.1%గా నమోదవడం తెలిసిందే. అబివృద్ధి చెందిన దేశాల మాదిరిగా కాకుండా భారత్‌ను సంప్రదాయ స్థూల ఆర్థిక అంశాలు బాధిస్తున్నాయన్నారు. అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే, ఆర్బీఐ కఠిన విధానాన్ని కొనసాగించడం, బలమైన రూపాయి ఎగుమతుల్లో పోటీ పడలేకుండా చేశాయన్నారు. ఆర్బీఐ విధానాన్ని ఎందుకు సరళతరం చేయలేదో తనకు అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు.