Strife
-
కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ జాతి నమ్మదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి ఎన్నటికీ నమ్మదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ గురువారం తెలంగాణ భవన్లో హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మత కలహాలు, కరెంటు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తోందని, కాంగ్రెస్, బీజేపీలకు దళితులు, గిరిజనులపై ఏ మాత్రం ప్రేమలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎంఆర్పీఎస్ నాయకులు జే.ఆర్.కుమార్, శ్రీనివాసులు, సతీష్ ఉన్నారు. -
నాడు మోదీ సర్కార్‌ను కూల్చే కుట్ర
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో మత కలహాల తర్వాత రాష్ట్రంలో అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పెద్ద కుట్ర జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తేల్చింది. సర్కారును కూల్చడానికి కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ ఆదేశాలతో సాగించిన కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ సైతం భాగస్వామిగా మారారని వెల్లడించింది. సెతల్వాద్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తాజాగా అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె సమర్పించిన దరఖాస్తును ‘సిట్’ తిరస్కరించింది. సెతల్వాద్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ దరఖాస్తుపై తదుపరి విచారణను అదనపు సెషన్స్ జడ్జి డి.డి.ఠక్కర్ సోమవారానికి వాయిదా వేశారు. గుజరాత్ మత కలహాల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతోపాటు అమాయకులను ఇరికించేలా తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించారన్న ఆరోపణలతో తీస్తా సెతల్వాద్‌తోపాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్.బి.శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను గుజరాత్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రాజకీయ కారణాలతోనే.. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి లేదా అస్థిరపర్చడానికి తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారు. రాజకీయ కారణాలతో కుట్ర సాగించారు. అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించాలని చూశారు. ఇందుకోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. ప్రతిఫలంగా ప్రతిపక్షం (కాంగ్రెస్) నుంచి చట్టవిరుద్ధంగా ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు, బహుమతులు పొందారు’’ అని సిట్ తన అఫిడవిట్లో ఆరోపించింది. సాక్షుల స్టేట్మెంట్లను ఉటంకించింది. అహ్మద్ పటేల్ ఆజ్ఞతోనే కుట్ర జరిగిందని, గోద్రా అల్లర్ల తర్వాత ఆయన నుంచి సెతల్వాద్, ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్ రూ.30 లక్షలు స్వీకరించారని తెలిపింది. గుజరాత్ అల్లర్ల కేసులో బీజేపీ సీనియర్ నాయకుల పేర్లను చేర్చాలంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ(కాంగ్రెస్) నాయకులను సెతల్వాద్ తరచూ కలుస్తూ ఉండేవారని గుర్తుచేసింది. మరో సాక్షి చెప్పిన విషయాలను సిట్ ప్రస్తావించింది. కేవలం షబానా అజ్మీ, జావెద్ అక్తర్‌ను ఎందుకు రాజ్యసభకు పంపిస్తున్నారు? తనకెందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ 2006లో ఓ కాంగ్రెస్ నాయకుడిని సెతల్వాద్ నిలదీశారని పేర్కొంది. మోదీకి క్లీన్చిట్.. సమర్థించిన సుప్రీంకోర్టు గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీతో సహా 62 మందికి ‘సిట్’ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు గత నెలలో సమర్థించింది. ‘సిట్’ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మరుసటి రోజే సెతల్వాద్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు శ్రీకుమార్, సంజీవ్ భట్‌పై ఐపీసీ సెక్షన్ 468(ఫోర్జరీ), సెక్షన్194 (దురుద్దేశంతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం)తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుజరాత్ అల్లర్ల వ్యవహారానికి సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం సృష్టించారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ‘సిట్’ దర్యాప్తు కొనసాగిస్తోంది. సెతల్వాద్, శ్రీకుమార్‌ను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు జూలై 2న ఆదేశాలిచ్చింది. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా సేవలందించిన సంగతి తెలిసిందే. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌కు దుండగులు నిప్పుపెట్టారు. అయోధ్య నుంచి రైలులో వస్తున్న 58 మంది భక్తులు ఆహూతయ్యారు. -
కుంగదీసిన కలహాలు
తిమ్మాజీపేట: ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికితోడు తాగొచ్చిన భర్త నిత్యం గొడవ పడుతున్నాడు. మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు తనతో పాటు తన ముగ్గురు పిల్లలపై కిరోసిన్‌పోసి నిప్పంటించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన సోమవారం మండలంలోని మరికల్లో చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల భీమమ్మను కొడంగల్ చెందిన బాల్‌రాజుకు ఇచ్చి వివాహం చేశారు. కొద్దికాలం తర్వాత భీమమ్మ(28) తన భర్తతోపాటు మరికల్ గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త వికలాంగుడు కావడంతో అన్నింటికీ తానై కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త అడపాదడపా మేస్త్రీ పనికి వెళ్లి కుటుంబానికి ఆసరా ఉంటున్నాడు. వీరికి నందిని, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారి పోషణ భారంగా మారింది. దీనికితోడు భర్త బాల్‌రాజు తరుచూ మద్యం తాగొస్తూ ఇంట్లో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో మరోవారు ఆదివారం రాత్రి భర్త తాగొచ్చాడు. ఇలా తాగితే బతుకుదెరువు ఎట్టా? అని అతనితో వాదనకు దిగింది. పూట గడవక రోజూ ఇబ్బందులు పడుతున్నాం.. ఇలా అయితే ఎలాగని భర్తతో గొడవకు దిగింది. మనస్తాపానికి గురైన భీమమ్మ భర్త ముందే కిరోసిన్ డబ్బా తీసుకుని తన ఒంటిపై పోసుకుంది. అక్కడే ఉన్న కూతుళ్లపై కూడా పోసి నిప్పంటించింది. పెద్ద కూతురు నందిని మంటలతోనే గడియ తీయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో భీమమ్మతో పాటు కూతుళ్లు నందిని, జయలక్ష్మి, శ్రీలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. భర్త బాలరాజుకు మంటలు అంటుకోవడంతో కొద్దిపాటి గాయాలయ్యాయి. చికిత్సకోసం వీరిని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైనవైద్యం కోసం మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో భీమమ్మ చిన్నకూతురు శ్రీలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు మెరుగైన వైద్యం పాలమూరు: జిల్లా ఆస్పత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ వివరిస్తూ.. భీమమ్మకు 45 శాతం శరీరం కాలిందని, ఆమె పెద్దకూతురు నందిని, చిన్న కూతురు శ్రీలక్ష్మి శరీరం 40శాతం కాలిందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. వారంరోజుల తర్వాత వీరి ఆరోగ్యపరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.