సమ్మె చేద్దామా... వద్దా..
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధనకు రైల్వే కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కార్మికుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లలో స్ట్రైక్ బ్యాలెట్ నిర్వహిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం కూడా కొనసాగుతుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 వేల మంది ఇందులో పాల్గొననున్నారు. శుక్రవారం దాదాపు 30 వేల మంది ఓటు వేసినట్టు సమాచారం. సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, గుంతకల్, తిరుపతి లాంటి ముఖ్య స్టేషన్లలో వేలాదిగా కార్మికులు పాల్గొన్నారు. దీనిలో వ్యక్తమైన అభిప్రాయంపై చర్చించి సమ్మెపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ద.మ. రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు ‘సాక్షి’తో చెప్పారు.