మునిసిపల్ కార్మికుల సమ్మె విరమణ!
అనంతపురం న్యూసిటీ : రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు మునిసిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం ముగిసింది. మూడ్రోజులుగా మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. జీవో 279ను రద్దు చేయాలంటూ కార్మిక సంఘాల నేతృత్వంలో కార్మికులు ధర్నా చేపట్టారు. సీఐటీయూ నేతలు రాజారెడ్డి, గోపాల్, మునిసిపల్ కార్మిక సంఘం నేత నరసింహులు మాట్లాడుతూ.. జీఓ 279కి సంబంధించి టెండర్లను పిలవబోమంటూ ప్రభుత్వం ప్రకటించిందని, దీంతో సమ్మెను తాత్కాళికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
కాగా, గురువారం ఉదయం నగరపాలక సంస్థ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి మద్దతు తెలిపారు. మునిసిపల్ సొమ్మును కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు పీడీఎఫ్ తరపున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉపేంద్ర, నల్లప్ప, ముర్తూజా, వెంకటనారాయణ, రాజేష్‌గౌడ్, కృష్ణుడు, నాగభూషణ, పెన్నోబులేసు, తిప్పయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులతో మంత్రి సునీత చర్చలు
అనంతపురం సిటీ : గురువారం నిర్వహించిన జెడ్పీ సమావేశానికి హాజరైన మంత్రి పరిటాల సునీత... జెడ్పీ కార్యాలయ ప్రధాన గేట్ వద్ద కార్మిక సంఘాల నేతలు నారాయణరెడ్డి, ఈటె నాగరాజుతో భేటీ అయి చర్చించారు. అంతకు ముందు మంత్రితో చర్చలు జరిపేందుకు వచ్చిన కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కార్యాలయ ప్రధాన గేట్ వద్దనే బైఠాయించి, మంత్రి అక్కడకే రావాలని నినాదాలు చేశారు. కార్మికుల డిమాండ్లను విన్న ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపేదిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.