గర్భిణులు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి
రేగోడ్ (మహబూబ్నగర్ జిల్లా) : బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని స్థానిక డాక్టర్ శంకర్ గర్భిణులకు సూచించారు. మండల కేంద్రమైన రేగోడ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల నుంచి 50 మంది గర్భిణులు హాజరయ్యారు.
వీరందరికీ పూలు, గాజులు, స్వీట్లు, బొట్టు పెట్టి సీమంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ సమయానికి మందులు వేసుకోవాలని తెలిపారు. అనంతరం గర్భిణులకు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మమత శ్రీశైలం, సర్పంచ్ సునీత, డాక్టర్ శ్వేతప్రియ, సూపర్వైజర్ మాసమ్మ, సిబ్బంది, ఏఎన్ఎంలు, జోగిపేట క్లస్టర్ సీహెచ్ఓ సుదర్శన్ పాల్గొన్నారు.